ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో (ILT20-2025) డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్‌కు (MI Emirates) షాక్ తగిలింది. ప్రస్తుత ఎడిషన్‌లో ఆ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్‌లో నాకౌటైంది. నిన్న (ఫిబ్రవరి 7) షార్జా వారియర్జ్‌తో (Sharjah Warriorz) జరిగిన మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్ 6 వికెట్ల తేడాతో పరాజయంపాలై, టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేసింది. 42 పరుగులు (22 బంతుల్లో; 6 ఫోర్లు, సిక్స్) చేసిన నికోలస్ పూరన్ ఎంఐ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
టామ్ బాంటన్ (29), విల్ జాక్స్ (18), కుసాల్ పెరీరా (18), అకీల్ హొసేన్ (15) రెండంకెల స్కోర్లు చేశారు. భారీ హిట్టర్లు ఆండ్రీ ఫ్లెచర్ (0), బెవాన్ జాకబ్స్ (7), రొమారియో షెపర్డ్ (7) దారుణంగా విఫలమయ్యారు. వారియర్జ్ బౌలర్లలో టిమ్ సౌథీ 2, ఆడమ్ మిల్నే, దిల్షన్ మధుషంక, అస్టన్ అగర్, హర్మీత్ సింగ్, రోహన్ ముస్తఫా తలో వికెట్ పడగొట్టారు.
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వారియర్జ్ 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. టామ్ కొహ్లెర్ కాడ్‌మోర్ (40), జాన్సన్ ఛార్లెస్ (36) వారియర్జ్ విజయానికి గట్టి పునాది వేయగా.. టిమ్ సీఫర్ట్ (40 నాటౌట్), రోహన్ ముస్తఫా (2 నాటౌట్) వారియర్జ్‌ను విజయతీరాలకు చేర్చారు.
జేసన్ రాయ్ (26) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఎంఐ బౌలర్లలో ముహమ్మద్ రోహిద్ ఖాన్ 3, ఫజల్ హక్ ఫారూకీ ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపు అనంతరం వారియర్జ్ రెండో క్వాలిఫయర్‌లో డెసర్ట్ వైపర్స్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌లో విజేత ఫిబ్రవరి 9న జరిగే ఫైనల్లో దుబాయ్ క్యాపిటల్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది.
కాగా, యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ఇప్పటిదాకా రెండు ఎడిషన్లు జరిగాయి. తొలి ఎడిషన్‌లో గల్ఫ్ జెయింట్స్ ఛాంపియన్‌గా నిలువగా.. రెండో సీజన్‌లో ఎంఐ ఎమిరేట్స్ విజేతగా నిలిచింది. గత ఎడిషన్ ఫైనల్లో ఎమిరేట్స్ దుబాయ్ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. ఈ సీజన్‌లో క్యాపిటల్స్ అందరికంటే ముందే ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment