టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ గాయపడినట్లు సమాచారం. ఈ క్రమంలో అతడు శ్రీలంకతో మొదటి టీ20కి దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే జరిగితే యువ పేసర్లతోనే భారత జట్టు బరిలో దిగాల్సి వస్తుంది.
మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడే నిమిత్తం టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇరు జట్ల మధ్య జూలై 27న తొలి టీ20తో ద్వైపాక్షిక సిరీస్ మొదలుకానుంది. ఇందుకోసం ఇప్పటికే ఇరుజట్లు ప్రాక్టీస్ సెషన్‌లో తీవ్రంగా చెమడోస్తున్నాయి.
ఈ క్రమంలో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ గాయపడ్డట్లు వార్తలు వస్తున్నాయి. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బంతి అతడి కుడికాలికి బలంగా తాకినట్లు తెలుస్తోంది. నొప్పితో సిరాజ్ విలవిల్లాడగా బీసీసీఐ మెడికల్ టీమ్ అతడికి చికిత్స అందించింది.
ఈ నేపథ్యంలో తొలి టీ20కి అతడు అందుబాటులో ఉండే అంశంపై సందిగ్దం నెలకొంది. కాగా శ్రీలంక టూర్‌కు జస్‌ప్రీత్ బుమ్రా దూరంగా ఉండగా.. టీమిండియా పేస్ దళాన్ని ముందుకు నడిపించే బాధ్యత సిరాజ్‌పై పడింది. అతడితో పాటు అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్ ఫాస్ట్‌బౌలింగ్ విభాగంలో టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు.
ఒకవేళ సిరాజ్ గనుక గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమైతే అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు ఖలీల్ అహ్మద్ తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఒకవేళ గాయం మానక టీ20, వన్డే సిరీస్‌ల నుంచి సిరాజ్ తప్పుకొంటే ఆవేశ్ ఖాన్ లేదంటే ముకేశ్ కుమార్ జట్టులోకి రావచ్చు. లేదంటే.. వన్డే జట్టులో ఉన్న హర్షిత్ రాణాను సిరాజ్ స్థానంలో ఉపయోగించుకునే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే, సిరాజ్ గాయం తీవ్రతపై బీసీసీఐ ఇంతవరకు ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వేకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో గెలుచుకుంది యువ భారత్.
అనంతరం పూర్తిస్థాయి జట్టు ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోంంది. హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్, టీ20 పూర్తిస్థాయి కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్‌తో తమ ప్రయాణం మొదలుపెట్టనున్నారు. మరోవైపు.. శ్రీలంక కొత్త కెప్టెన్‌గా చరిత్ అసలంక నియమితుడు కాగా.. సనత్ జయసూర్య ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment