వడోదర వేదికగా వెస్టిండీస్ మహిళలతో జరిగిన రెండో టెస్టులో 115 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో భారత అమ్మాయిలు కైవసం చేసుకున్నారు.
డియోల్ సూపర్ సెంచరీ..
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో హర్లీన్ డియోల్(103 బంతుల్లో 115, 16 ఫోర్లు) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. ప్రతికా రావల్(76), రోడ్రిగ్స్(52) హాఫ్ సెంచరీలతో మెరిశారు.
హర్లీన్ డియోల్‌కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం. కాగా వన్డేల్లో భారత్ 350కిపైగా స్కోరు చేయడం ఇది రెండోసారి. 2022లో ఐర్లాండ్‌పై కూడా సరిగ్గా 358/5 స్కోరు చేసింది. ఇక విండీస్ బౌలర్లలో అఫీ ఫ్లెచర్, జైదా జేమ్స్, క్వినా జోసెఫ్, డాటిన్ తలో వికెట్ తీశారు.
మాథ్యూస్ ఒంటరి పోరాటం..
అనంతరం భారీ లక్ష్య చేధనలో వెస్టిండీస్ మహిళల జట్టు 46.2 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. విండీస్ కెప్టెన్ హీలీ మథ్యూస్ విరోచిత పోరాటం కనబరిచింది. మథ్యూస్ సూపర్ సెంచరీతో చెలరేగింది. 109 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో మాథ్యూస్ 106 పరుగులు చేసింది.
అయితే మిగితా బ్యాటర్ల నుంచి పెద్దగా సహకారం లభించకపోవడంతో విండీస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. దీప్తీ శర్మ, ప్రతికా రావల్,టిటాస్ సాదు తలా రెండు వికెట్లు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment