వెస్టిండీస్ గడ్డపై టెస్టు, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న టీమిండియా.. టీ20 సిరీస్ మాత్రం ప్రత్యర్ధి జట్టుకు అప్పగించేసింది. ఫ్లోరిడా వేదికగా విండీస్‌తో జరిగిన సిరీస్ డిసైడర్ ఐదో టీ20లో 8 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2తో భారత్ కోల్పోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు.
అతడితో పాటు తిలక్ వర్మ (18 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాసేపు మెరుపులు మెరిపించాడు. విండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్ 4 వికెట్లు పడగొట్టి భారత్‌ను దెబ్బతీశాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి గెలిచింది. విండీస్ బ్యాటర్లలో ఓపెనర్ బ్రాండన్ కింగ్ (55 బంతుల్లో 85 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), నికోలస్ పూరన్ (35 బంతుల్లో 47; 1 ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగారు.
భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, తిలక్ వర్మ తలా వికెట్ మాత్రమే సాధించారు. ఇక ఈ సిరీస్ ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ఈ ఓటమి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నామని హార్దిక్ తెలిపాడు.
"మేము మొదట్లో వికెట్లు కోల్పోయినప్పటికీ.. సూర్య, తిలక్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. నేను బ్యాటింగ్‌కు వచ్చే అంతవరకు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత మేము మా రిథమ్‌ను కోల్పోయాము. స్కోరు వేగాన్ని పెంచడంలో విఫలమయ్యాం. అక్కడ పరిస్థితిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాము. రాబోయే సిరీస్‌ల్లో మేము మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాము. ఇక ఈ ఓటమి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి ఓడిపోవడం కూడా మంచిదవుతుంది.
ఎందుకంటే ఈ సిరీస్‌లో మాకు చాలా పాజిటివ్ అంశాలు ఉన్నాయి. మేము ఈ సిరీస్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. యువ ఆటగాళ్ల టాలెంట్‌ను గుర్తించడానికి మాకు చాలా ఉపయోగపడింది. ఈ సిరీస్‌లో మా బాయ్స్ ప్రదర్శన బాగానే ఉంది. మా బాయ్స్ తమ సత్తా ఎంటో చూపించారు. వారి ప్రదర్శన పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది.
ప్రతీ ఒక్క ఆటగాడు కొత్తగా ట్రై చేశారు. మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు . వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ కూడా ఇక్కడే జరగనుంది. అప్పుడు మరింత మంది అభిమానులు రావడం ఖాయమని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హార్దిక్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs WI: ఐదో టీ20లో టీమిండియా ఓటమి.. సిరీస్ సమర్పయామి
Comments
Please login to add a commentAdd a comment