హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో 23 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-2 ఆధిక్యంలోకి టీమిండియా దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.
భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్(66) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రుతురాజ్ గైక్వాడ్(49) పరుగులతో రాణించాడు. జింబాబ్వే బౌలర్లలో ముజర్బానీ, రజా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులకే పరిమితమైంది.
జింబాబ్వే బ్యాటర్లలో మైర్స్(65) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మదండే(37) ఆఖరిలో మెరుపులు మెరిపించినప్పటికీ జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు పడగొట్టగా.. అవేష్ ఖాన్ రెండు, ఖాలీల్ ఆహ్మద్ ఒక్క వికెట్ సాధించారు.
చరిత్ర సృష్టించిన భారత్..
ఇక ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా ఓ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకుంది. భారత్‌కు ఇది పొట్టిఫార్మాట్‌లో 150వ విజయం కావడం విశేషం. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో 150 విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా టీమిండియా చరిత్రకెక్కింది.
టీమిండియా ఇప్పటవరకు 230 మ్యాచ్‌లు ఆడి 150 విజయాలు సాధించింది. కాగా టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో భారత్(150) అగ్రస్ధానంలో కొనసాగుతుండగా.. పాకిస్తాన్(142), న్యూజిలాండ్(111) మూడో స్ధానంలో కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment