‘చాంపియన్స్‌’ పోరుకు సిద్ధం | India Squad Announcement For Champions | Sakshi
Sakshi News home page

‘చాంపియన్స్‌’ పోరుకు సిద్ధం

Published Sun, Jan 19 2025 11:45 AM | Last Updated on Sun, Jan 19 2025 12:41 PM

India Squad Announcement For Champions

రోహిత్‌ శర్మ నాయకత్వంలో భారత జట్టు మరో ఐసీసీ వన్డే సమరానికి సన్నద్ధమైంది. వరల్డ్‌ కప్‌లో ఫైనల్‌ చేరిన టీమిండియాలోని ప్రధాన ఆటగాళ్లంతా ఇప్పుడు ఈ పోరులోనూ జట్టులో భాగం కానున్నారు. స్వల్ప మార్పులు మినహా ఎలాంటి అనూహ్య, సంచలనాలు లేకుండా చాంపియన్స్‌ ట్రోఫీ కోసం భారత జట్టు ఎంపిక జరిగింది. ప్రధాన పేసర్‌ బుమ్రా ఫిట్‌నెస్‌పై కాస్త సందేహాలు ఉన్నా...అతడిని టీమ్‌లోకి తీసుకోగా, వరల్డ్‌ కప్‌లో అత్యధిక వికెట్లతో చెలరేగిన షమీ కూడా మరో ఐసీసీ పోరుకు రెడీ అంటున్నాడు. నలుగురు ఆల్‌రౌండర్లను జట్టులోకి తీసుకోవడంతో హైదరాబాదీ పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ తన స్థానాన్ని కోల్పోవాల్సి రాగా... ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న జైస్వాల్‌ తొలిసారి వన్డే టీమ్‌లోకి వచ్చాడు. ఓవరాల్‌గా ఈ 15 మంది సభ్యుల బృందానికి టైటిల్‌ సాధించే సత్తా ఉందని సెలక్షన్‌ కమిటీ నమ్ముతోంది.  

ముంబై: ఐసీసీ వన్డే టోర్నీ చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టును అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ శనివారం ప్రకటించింది. దానికి ముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు వన్డేల్లో కూడా ఇదే జట్టు తలపడుతుంది. ఇటీవల ఆ్రస్టేలియాతో టెస్టు సిరీస్‌ ముగిసిన తర్వాత రోహిత్‌ కెపె్టన్సీపై చర్చ జరిగినా...2023 వన్డే వరల్డ్‌కప్‌లో జట్టును ఫైనల్‌ చేర్చిన అతని నాయకత్వంపై సెలక్టర్లు పూర్తి విశ్వాసం ఉంచారు. భారత జట్టు ‘సంధి దశ’లో ఉందని వినిపించినా...వన్డేల్లో దానికి ఇంకా సమయం ఉందని తాజా ఎంపికతో అర్థమైంది. వరల్డ్‌కప్‌లో రాణించిన ప్రధాన ఆటగాళ్లందరినీ ఎలాంటి సందేహాలు లేకుండా టీమ్‌లోకి తీసుకున్నారు. బహుశా ఈ టోర్నీ తర్వాత 2027 వరల్డ్‌ కప్‌ కోసం మార్పులు జరగవచ్చు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటూ శుబ్‌మన్‌ గిల్‌ను వైస్‌ కెపె్టన్‌గా నియమించారు. గత ఏడాది ఆగస్టులో శ్రీలంకతో సిరీస్‌ తర్వాత భారత్‌ మళ్లీ ఇప్పుడే వన్డేల్లో బరిలోకి దిగుతోంది. చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా గ్రూప్‌ ‘ఎ’లో ఫిబ్రవరి 20, 23, మార్చి 2న వరుసగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లతో భారత్‌ తలపడుతుంది. పాకిస్తాన్‌ వెళ్లేందుకు నిరాకరించిన టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడుతుంది.  

రెండు వన్డేలకు హర్షిత్‌... 
ఫిట్‌నెస్‌పై సందేహాలు ఉన్నా...ప్ర«దాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను ఈ మెగా టోర్నీ కోసం ఎంపిక చేశారు. అయితే ఇంగ్లండ్‌తో తొలి రెండు వన్డేల సమయానికి అతను పూర్తిగా కోలుకునే అవకాశం లేకపోవడంతో  ప్రత్యామ్నాయంగా ఢిల్లీ పేసర్‌ హర్షిత్‌ రాణాకు చోటు కల్పించారు. ఆసీస్‌ పర్యటనలో హర్షిత్‌ 2 టెస్టులు ఆడాడు. స్పోర్ట్స్‌ హెర్నియా గాయంతో కివీస్‌తో తొలి టెస్టు తర్వాత ఆటకు దూరమైన స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు కూడా టీమ్‌లో స్థానం లభించింది. గాయంనుంచి కోలుకున్న తర్వాత అతను ఏ స్థాయిలోనూ మ్యాచ్‌ ఆడకపోయినా...జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో పెద్ద సంఖ్యలో ఓవర్లు బౌలింగ్‌ చేస్తుండటంతో ఫిట్‌నెస్‌పై స్పష్టత వచి్చంది. ఫిట్‌గా మారి ఇంగ్లండ్‌తో టి20 సిరీస్‌కు ఎంపికైన సీనియర్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీకి ఊహించిన విధంగానే వన్డే టీమ్‌లోనూ స్థానం దక్కింది. టీమిండియా తరఫున ఇప్పటికే టెస్టుల్లో చెలరేగి...టి20 ఫార్మాట్‌లోనూ పదునైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌కు తొలిసారి వన్డే టీమ్‌లో అవకాశం దక్కింది. వరల్డ్‌ కప్‌ తరహాలోనే వరుసగా రోహిత్, గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్‌ టాప్‌–5లో ఉంటారు.  

నలుగురు ఆల్‌రౌండర్లు... 
సెలక్టర్లు ఒక ప్రధాన బౌలర్‌ను తగ్గించి మరీ ఆల్‌రౌండర్లపై దృష్టి పెట్టారు. హార్దిక్‌ పాండ్యా ఒక్కడే పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కాగా...ముగ్గురు స్పిన్‌ ఆల్‌రౌండర్లు జడేజా, అక్షర్, సుందర్‌లకు స్థానం లభించింది. ఈ ముగ్గురూ లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్లే కాగా, పాండ్యాతో కలిపి భారత టాప్‌–6 రైట్‌ హ్యాండర్లే ఉన్నారు. జట్టులో ముగ్గురే ప్రధాన పేసర్లు ఉన్నారు. వికెట్‌ కీపర్‌గా కేఎల్‌ రాహుల్‌కే ప్రధమ ప్రాధాన్యత ఇచి్చనట్లుగా భావించవచ్చు. వన్డేల్లో ఎప్పుడూ రెగ్యులర్‌గా చోటు దక్కించుకోకపోయినా, పెద్దగా ప్రభావం చూపని రిషభ్‌ 
పంత్‌ను రెండో కీపర్‌గా ఎంపిక చేశారు. తాను ఆడిన చివరి వన్డేలో సెంచరీ సాధించినా సరే... సంజు సామ్సన్‌పై సెలక్టర్లు నమ్మకం ఉంచలేదు. కేరళ అసోసియేషన్‌తో వివాదం కారణంగా విజయ్‌హజారే ట్రోఫీకి సామ్సన్‌ దూరం కావడం కూడా సెలక్షన్‌పై ప్రభావం చూపించి ఉండవచ్చు.  

‘బోర్డు కార్యదర్శితో మాట్లాడాలి’ 
క్రికెటర్ల కోసం బీసీసీఐ కొత్తగా రూపొందించిన మార్గదర్శకాల విషయంలో ఆటగాళ్లు అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులను అనుమతించే విషయంపై మరికొంత సడలింపును వారు కోరుతున్నారు. ఇదే మాట మీడియా సమావేశంలో రోహిత్‌ నోటినుంచి వచి్చంది. ఇది నేరుగా రోహిత్‌ మీడియాతో చెప్పకపోయినా... అగార్కర్‌కు చెబుతుండటం అందరికీ వినిపించింది. ‘కొత్త నిబంధనలపై మరింత స్పష్టత కావాలి.ఈ సమావేశం తర్వాత నేను బోర్డు కార్యదర్శితో కూర్చొని మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే అందరూ నన్నే అడుగుతున్నారు’ అని అగార్కర్‌తో రోహిత్‌ అన్నాడు.   మరో వైపు తనకు, హెడ్‌ కోచ్‌ గంభీర్‌కు మధ్య పరస్పర నమ్మకం ఉన్నాయని రోహిత్‌ స్పష్టం చేశాడు. మైదానంలోకి దిగడానికి ముందే తమ మధ్య వ్యూహాలకు సంబంధించిన చర్చ జరుగుతుందని...ఒక్కసారి మైదానంలోకి దిగిన తర్వాత అన్నీ తానే చూసుకుంటానని కెపె్టన్‌ వెల్లడించాడు. ఈ విషయంలో తమకు స్పష్టమైన విభజన రేఖ ఉందని రోహిత్‌ వ్యాఖ్యానించాడు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement