రెండు గోల్స్‌తో మెరిసిన భారత కెప్టెన్
చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ విజయం
లీగ్ దశను అజేయంగా ముగించిన డిఫెండింగ్ చాంపియన్
రేపు జరిగే సెమీఫైనల్లో కొరియాతో టీమిండియా పోరు
హులున్‌బుయిర్ (చైనా): పలువురు కీలక ఆటగాళ్లు లేకుండానే ఆసియా పురుషుల చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో బరిలోకి దిగిన భారత జట్టు లీగ్ దశను అజేయంగా ముగించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 2–1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. భారత కెప్టెన్, డ్రాగ్‌ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ (13వ, 19వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించి జట్టును గెలిపించాడు.
పాకిస్తాన్ తరఫున అహ్మద్ నదీమ్ (8వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. శనివారమే జరిగిన ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో చైనా 2–0తో జపాన్ జట్టును ఓడించగా... మలేసియా, దక్షిణ కొరియా జట్ల మధ్య మ్యాచ్ 3–3తో ‘డ్రా’గా ముగిసింది. వరుసగా ఐదో విజయం నమోదు చేసిన భారత జట్టు 15 పాయింట్లతో లీగ్ దశలో టాపర్‌గా నిలిచింది. 8 పాయింట్లతో పాకిస్తాన్ రెండో స్థానంలో, 6 పాయింట్లతో చైనా, దక్షిణ కొరియా వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.
ఆదివారం విశ్రాంతి దినం. సోమవారం జరిగే సెమీఫైనల్స్‌లో దక్షిణ కొరియాతో భారత్; చైనాతో పాకిస్తాన్ తలపడతాయి. 5 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచిన మలేసియా, ఒక పాయింట్‌తో ఆరో స్థానంలో నిలిచిన జపాన్ 5–6 స్థానాల కోసం పోటీపడతాయి. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు జరగ్గా... భారత జట్టు ఏడుసార్లు కనీసం సెమీఫైనల్‌కు చేరుకుంది. 2013లో మాత్రమే భారత జట్టు సెమీఫైనల్ చేరుకోలేకపోయింది.
ఆరంభంలో గోల్ ఇచ్చినా...
పాక్‌తో మ్యాచ్‌కు ముందు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత జట్టుకు చిరకాల ప్రత్యర్థి నుంచి గట్టిపోటీనే ఎదురైంది. ఆట ఎనిమిదో నిమిషంలో భారత డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ మిడ్‌ఫీల్డ్ నుంచి దూసుకొచ్చిన హన్నాన్ షాహిద్ అందించిన పాస్‌ను ‘డి’ ఏరియాలో అహ్మద్ నదీమ్ లక్ష్యానికి చేర్చాడు.
ఆరంభంలోనే గోల్ సమర్పించుకున్నా భారత జట్టు ఆందోళనకు గురి కాలేదు. వెంటనే తేరుకొని తమ దాడుల్లో పదును పెంచింది. 13వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను... 19వ నిమిషంలో లభించిన మరో పెనాల్టీ కార్నర్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్స్‌గా మలిచాడు. దాంతో రెండు క్వార్టర్‌లు ముగిసేసరికి భారత్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది.
మూడో క్వార్టర్‌లో పాకిస్తాన్ దూకుడుగా ఆడుతూ ఏకంగా 10 పెనాల్టీ కార్నర్‌లు సంపాదించింది. అయితే ఈ 10 పెనాల్టీ కార్నర్‌లను భారత గోల్‌కీపర్, డిఫెండర్లు అడ్డుకోవడం విశేషం. చివరి క్వార్టర్‌లో భారత్ జోరు పెంచి పాక్‌ను కట్టడి చేసి విజయాన్ని ఖరారు చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో భారత్‌కు 10, పాకిస్తాన్‌కు 13 పెనాల్టీ కార్నర్‌లు వచ్చాయి.
17 గత ఎనిమిదేళ్ల కాలంలో అంతర్జాతీయ టోర్నీల్లో పాకిస్తాన్ జట్టుపై భారత్‌కిది 17వ విజయం కావడం విశేషం. చివరిసారి భారత్ 2016 దక్షిణాసియా క్రీడల ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. దక్షిణాసియా క్రీడల ఫైనల్ అనంతరం భారత్, పాకిస్తాన్ జట్లు 18 సార్లు తలపడ్డాయి. 2018 ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఫలితం రాలేదు.
203 అంతర్జాతీయ హాకీలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ చేసిన గోల్స్ సంఖ్య. ధ్యాన్‌చంద్, బల్బీర్ సింగ్ సీనియర్ తర్వాత భారత్ తరఫున 200 గోల్స్ మైలురాయి దాటిన మూడో ప్లేయర్‌గా హర్మన్‌ప్రీత్ గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ హాకీలో 12 మంది క్రీడాకారులు 200 అంతకంటే ఎక్కువ గోల్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment