తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 285/9 డిక్లేర్డ్
8.22 రన్‌రేట్‌తో పరుగులు సాధించిన జట్టు
టీమిండియాకు 52 పరుగుల ఆధిక్యం
రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 26/2
తొలి మూడు రోజుల ఆటలో రెండు రోజులు ఒక్క బంతి కూడా పడలేదు. మొదటి రోజు కూడా 35 ఓవర్లకే ఆట పరిమితమైంది. ఇలాంటి స్థితిలో మిగిలిన రెండు రోజుల్లో ‘డ్రా’కే అవకాశం తప్ప మరో ఫలితం వస్తుందా అని సోమవారం ఉదయం అంతా ఊహించారు. కానీ భారత జట్టు మాత్రం భిన్నంగా ఆలోచించింది. మ్యాచ్‌లో ఆధిక్యం ప్రదర్శించి విజయంపై గురి పెట్టాలంటే అసాధారణంగా ఆడాలని నిశ్చయించుకుంది. బ్యాటర్లంతా ఒక్కసారిగా టి20 ఫార్మాట్‌కు మారిపోయారు.
అంతే... 50, 100, 150, 200, 250... ఇలా అన్ని పరుగుల మైలురాళ్లను వేగంగా, తక్కువ బంతుల్లో అధిగమించిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. రోహిత్‌తో మొదలు పెట్టి జైస్వాల్, గిల్, కోహ్లి, రాహుల్ ధాటిగా ఆడటంతో ఏకంగా 8.22 రన్‌రేట్‌తో భారీగా పరుగులు, ఆపై ఆధిక్యం కూడా వచ్చేశాయి. అనంతరం 45 నిమిషాల్లోనే బంగ్లాదేశ్‌ను ఒత్తిడిలోకి నెట్టి రెండు వికెట్లతో పైచేయి సాధించింది. చివరి రోజు బంగ్లా పోరాడుతుందా లేక భారత్ ఇదే ఊపులో మ్యాచ్ గెలిచేస్తుందా చూడాలి.
కాన్పూర్: వర్షంతో వృథా అయిన సమయాన్ని మర్చిపోయేలా గ్రీన్‌పార్క్ స్టేడియంలో భారత జట్టు అభిమానులకు ఒక్క రోజులో పూర్తి స్థాయిలో వినోదాన్ని అందించింది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో మెరుపు బ్యాటింగ్‌తో జట్టు సత్తా చాటింది. సోమవారం భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 34.4 ఓవర్లలో 9 వికెట్లకు 285 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఫలితంగా భారత్‌కు 52 పరుగుల ఆధిక్యం లభించింది.
యశస్వి జైస్వాల్ (51 బంతుల్లో 72; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), కేఎల్ రాహుల్ (43 బంతుల్లో 68; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) విరాట్ కోహ్లి (35 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్), శుబ్‌మన్ గిల్ (36 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిని ప్రదర్శించగా... షకీబ్, మిరాజ్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లలో 2 వికెట్లకు 26 పరుగులు చేసింది. ఆ జట్టు మరో 26 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఉదయం 107/3తో ఆట కొనసాగించిన బంగ్లా తమ తొలి ఇన్నింగ్స్‌లో 74.2 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. మోమినుల్ హక్ (107 నాటౌట్; 17 ఫోర్లు, 1 సిక్స్) కీలక సెంచరీ సాధించారు. సోమవారం ఒక్కరోజే 18 వికెట్లు నేలకూలడం విశేషం.
మోమినుల్ మినహా...
రెండు రోజుల పాటు మైదానానికి దూరంగా ఉన్న తర్వాత ఎట్టకేలకు 107/3 స్కోరుతో బంగ్లాదేశ్ తమ ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. సోమవారం మరో 39.2 ఓవర్లు ఆడిన జట్టు మరో 126 పరుగులు జోడించి మిగిలిన 7 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు ఆరంభం నుంచే ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. ముష్ఫికర్ (11)ను బౌల్డ్ చేసి బంగ్లా పతనానికి బుమ్రా శ్రీకారం చుట్టాడు.
బుమ్రా తర్వాతి ఓవర్లో దాస్ మూడు ఫోర్లు కొట్టి జోరు ప్రదర్శించినా... రోహిత్ అద్భుత క్యాచ్‌తో అతని ఇన్నింగ్స్ ముగిసింది. మరో ఎండ్‌లో మోమినుల్ మాత్రం పట్టుదలగా నిలబడి పరుగులు సాధించాడు. కొద్ది సేపటికే సిరాజ్ అసాధారణ క్యాచ్ షకీబ్ (9)ను పెవిలియన్ పంపించింది. 93, 95 పరుగుల వద్ద పంత్, కోహ్లి క్యాచ్‌లు వదిలేయడంతో బతికిపోయిన మోమినుల్ ఆ తర్వాత కెరీర్‌లో 13వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంచ్ విరామం తర్వాత మిగిలిన 4 వికెట్లను పడగొట్టేందుకు భారత్ కు ఎక్కువ సమయం పట్టలేదు. ఖాలెద్‌ను అవుట్ చేసి జడేజా తన ఖాతాలో 300వ వికెట్‌ను వేసుకున్నాడు.
ధనాధన్...
దూకుడే మంత్రంగా భారత్ ఇన్నింగ్స్ సాగింది. మహమూద్ వేసిన తొలి ఓవర్లో జైస్వాల్ 3 వరుస ఫోర్లు బాదగా... ఖాలెద్ వేసిన తర్వాతి ఓవర్లో తాను ఎదుర్కొన్న తొలి రెండు బంతులను రోహిత్ శర్మ (11 బంతుల్లో 23; 1 ఫోర్, 3 సిక్స్‌లు) సిక్సర్లుగా మలిచాడు. అనంతరం మహమూద్ ఓవర్లో వీరిద్దరు 2 సిక్స్‌లు, 2 ఫోర్లతో 22 పరుగులు రాబట్టారు. అయితే నాలుగో ఓవర్లోనే స్పిన్నర్ మిరాజ్ బౌలింగ్ కు దిగి రోహిత్‌ను వెనక్కి పంపాడు.
31 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో జైస్వాల్ అర్ధసెంచరీ పూర్తయింది. మరో వైపు గిల్ కూడా కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. అయితే వేగంగా ఆడే క్రమంలో 32 పరుగుల వ్యవధిలో జైస్వాల్, గిల్, పంత్ (9) అవుటయ్యారు. ఈ దశలో కోహ్లి, రాహుల్ జోరు తగ్గకుండా బంగ్లా బౌలర్లపై ఆధిక్యం ప్రదర్శించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 59 బంతుల్లోనే 87 పరుగులు జోడించడం విశేషం. 33 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీని అందుకోగా, కోహ్లి ఆ అవకాశం చేజార్చుకున్నాడు.
షకీబ్ ఓవర్లో రెండు వరుస సిక్సర్లతో ఆకాశ్‌దీప్ కూడా తానూ ఓ చేయి వేశాడు. 16 పరుగుల వ్యవధిలో తర్వాతి 4 వికెట్లు కోల్పోయిన తర్వాత భారత్ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం 11 ఓవర్లపాటు క్రీజ్‌లో బంగ్లా బ్యాటర్లు తడబడుతూనే ఆడారు. 7 ఓవర్లలో జట్టు 18 పరుగులు చేసింది. అయితే తర్వాతి ఓవర్ తొలి బంతికే జాకీర్ (10)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అశ్విన్... తన తర్వాతి ఓవర్లో నైట్‌వాచ్‌మన్ మహమూద్ (4)ను బౌల్డ్ చేసి బంగ్లా ఆందోళనను మరింత పెంచాడు. అంతకుముందు 3 పరుగుల వద్ద షాద్‌మన్ ఇచి్చన క్యాచ్‌ను స్లిప్‌లో రాహుల్ వదిలేశాడు.
స్కోరు వివరాలు
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: జాకీర్ (సి) జైస్వాల్ (బి) ఆకాశ్‌దీప్ 0; షాద్‌మన్ (ఎల్బీ) (బి) ఆకాశ్‌దీప్ 24; మోమినుల్ (నాటౌట్) 107; నజ్ముల్ (ఎల్బీ) (బి) అశి్వన్ 31; ముష్ఫికర్ (బి) బుమ్రా 11; లిటన్ దాస్ (సి) రోహిత్ (బి) సిరాజ్ 13; షకీబ్ (సి) సిరాజ్ (బి) అశి్వన్ 9; మిరాజ్ (సి) గిల్ (బి) బుమ్రా 20; తైజుల్ (బి) బుమ్రా 5; మహమూద్ (ఎల్బీ) (బి) సిరాజ్ 1; ఖాలెద్ (సి అండ్ బి) జడేజా 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (74.2 ఓవర్లలో ఆలౌట్) 233.
వికెట్ల పతనం: 1–26, 2–29, 3–80, 4–112, 5–148, 6–170, 7–224, 8–230, 9–231, 10–233.
బౌలింగ్: బుమ్రా 18–7–50–3, సిరాజ్ 17–2–57–2, అశి్వన్ 15–1–45–2, ఆకాశ్‌దీప్ 15–6–43–2, జడేజా 9.2–0–28–1.
భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) మహమూద్ 72; రోహిత్ (బి) మిరాజ్ 23; గిల్ (సి) మహమూద్ (బి) షకీబ్ 39; పంత్ (సి) మహమూద్ (బి) షకీబ్ 9; కోహ్లి (బి) షకీబ్ 47; రాహుల్ (స్టంప్డ్) దాస్ (బి) మిరాజ్ 68; జడేజా (సి) నజు్మల్ (బి) మిరాజ్ 8; అశ్విన్ (బి) షకీబ్ 1; ఆకాశ్‌దీప్ (సి) ఖాలెద్ (బి) మిరాజ్ 12; బుమ్రా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (34.4 ఓవర్లలో 9 వికెట్లకు డిక్లేర్డ్) 285.
వికెట్ల పతనం: 1–55, 2–127, 3–141, 4–159, 5–246, 6–269, 7–272, 8–284, 9–285.
బౌలింగ్: మహమూద్ 6–0–66–1, ఖాలెద్ 4–0–43–0, మిరాజ్ 6.4–0–41–4, తైజుల్ 7–0–54–0, షకీబ్ 11–0–78–4.
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: షాద్‌మన్ (బ్యాటింగ్) 7; జాకీర్ (ఎల్బీ) (బి) అశ్విన్ 10; మహమూద్ (బి) అశ్విన్ 4; మోమినుల్ (బ్యాటింగ్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (11 ఓవర్లలో 2 వికెట్లకు) 26.
వికెట్ల పతనం: 1–18, 2–26.
బౌలింగ్: బుమ్రా 3–1–3–0, అశి్వన్ 5–2–14–2, ఆకాశ్‌దీప్ 3–2–4–0.
4: మూడు ఫార్మాట్‌లో కలిపి అంతర్జాతీయ క్రికెట్‌లో 27 వేల పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో ఆటగాడిగా విరాట్ కోహ్లి నిలిచాడు. సచిన్ (34,357), సంగక్కర (28,016), రికీ పాంటింగ్ (27,483) ఈ జాబితాలో అతనికంటే ముందున్నారు. కోహ్లి ప్రస్తుతం 27,012 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment