దక్షిణాఫ్రికా గడ్డపై అడుగు పెట్టే ముందు రెండు ఫార్మాట్‌లలోనూ విజేతగా నిలిచేలా పటిష్టంగా కనిపించిన భారత జట్టు చివరకు పేలవ ప్రదర్శనతో రెండు సిరీస్‌లూ కోల్పోయింది. టెస్టు సిరీస్‌ను 1–2తో చేజార్చుకున్న టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్‌నూ అప్పగించింది. తొలి పోరుకు దాదాపు రీప్లేలా కనిపించిన రెండో వన్డేలోనూ భారత బృందం సునాయాసంగా తలవంచింది. పంత్ మినహా పసలేని బ్యాటింగ్‌తో ముందుగా సాధారణ స్కోరుకే పరిమితం కాగా... ఆపై బౌలింగ్ పూర్తిగా నిరాశపరచింది. పేలవ ఆటతో ఒకదశలో వికెట్ తీయడమే గగనంగా మారిపోయింది. డి కాక్, మలాన్ జోరైన ఆటతో దక్షిణాఫ్రికా జట్టును గెలిపించారు.
పార్ల్: భారత్‌తో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను 2–0తో గెలుచుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (71 బంతుల్లో 85; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్ (79 బంతుల్లో 55; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం దక్షిణాఫ్రికా 48.1 ఓవర్లలో 3 వికెట్లకు 288 పరుగులు చేసి గెలిచింది. జేన్‌మన్ మలాన్ (108 బంతుల్లో 91; 8 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డి కాక్ (66 బంతుల్లో 78; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 132 పరుగులు జోడించారు. చివరి మ్యాచ్ ఆదివారం కేప్‌టౌన్‌లో జరుగుతుంది.
శతక భాగస్వామ్యం...
తొలి వన్డేతో పోలిస్తే ఈసారి భారత్‌కు ఓపెనర్లు మెరుగైన ఆరంభాన్ని అందించారు. రాహుల్, శిఖర్ ధావన్ (38 బంతుల్లో 29; 5 ఫోర్లు) కొన్ని చక్కటి షాట్లతో పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 57 పరుగులకు చేరింది. 8 పరుగుల వద్ద మలాన్ క్యాచ్ వదిలేయడంతో రాహుల్ బతికిపోయాడు. అయితే ధావన్‌ను అవుట్ చేసి మార్క్‌రమ్ 63 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీయగా... కేశవ్ మహరాజ్ వేసిన తర్వాతి ఓవర్లోనే కవర్స్‌లో సునాయాస క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లి (0) డకౌటయ్యాడు. ఈ దశలో రాహుల్, పంత్ సెంచరీ పార్ట్‌నర్‌షిప్ జట్టును నడిపించింది. పంత్ దూకుడు పెంచి షమ్సీ వేసిన ఓవర్లో మూడు ఫోర్లు కొట్టడంతో 43 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది.
46 పరుగుల వద్ద మార్క్‌రమ్ క్యాచ్ వదిలేయడంతో మళ్లీ ‘లైఫ్’ లభించిన రాహుల్ ఆ తర్వాత 71 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 31 ఓవర్లు ముగిసేసరికి 179/2తో భారత్ పటిష్టమైన స్థితిలో నిలిచింది. అయితే మూడో వికెట్‌కు 115 పరుగులు జోడించిన రాహుల్, పంత్‌లను వరుస ఓవర్లలో అవుట్ చేసిన సఫారీ బౌలర్లు... శ్రేయస్ అయ్యర్ (11)ను కూడా వెనక్కి పంపి మళ్లీ పట్టు బిగించారు. వెంకటేశ్ అయ్యర్ (22) కీలక పరుగులు జోడించగా... చివర్లో శార్దుల్ ఠాకూర్ (38 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), అశ్విన్ (24 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడి ఏడో వికెట్‌గా అభేద్యంగా 37 బంతుల్లోనే 48 పరుగులు జత చేయడంతో భారత్ చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగింది.
ఓపెనర్ల జోరు...
ఛేదనలో ఓపెనర్లు అందించిన భారీ భాగస్వామ్యమే దక్షిణాఫ్రికా విజయానికి బాటలు వేసింది. మలాన్, డి కాక్ పోటీ పడి పరుగులు సాధించడంతో స్కోరు వేగంగా దూసుకుపోయింది. భువనేశ్వర్ తొలి ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టిన డి కాక్ ఇతర భారత బౌలర్లను కూడా సమర్థంగా ఎదుర్కొన్నాడు. పది ఓవర్లు ముగిసేసరికి సఫారీ టీమ్ 66 పరుగులు చేయగా, ఆ తర్వాత 36 బంతుల్లోనే డి కాక్ అర్ధ సెంచరీ పూర్తయింది. భారీ భాగస్వామ్యం తర్వాత ఎట్టకేలకు డి కాక్‌ను అవుట్ చేసి శార్దుల్ ఈ జోడీని విడదీశాడు. అనంతరం బవుమా (36 బంతుల్లో 35; 3 ఫోర్లు) కూడా మలాన్‌కు చక్కటి సహకారం అందించడంతో రెండో వికెట్‌కు 80 పరుగుల పార్ట్‌నర్‌షిప్ నమోదైంది. వీరిద్దరు రెండు పరుగుల వ్యవధిలో పెవిలియన్ చేరినా... మార్క్‌రమ్ (37 నాటౌట్; 4 ఫోర్లు), డసెన్ (37 నాటౌట్; 2 ఫోర్లు) ఇబ్బంది లేకుండా ఆడి దక్షిణాఫ్రికాకు విజయాన్ని అందించారు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) డసెన్ (బి) మగాలా 55; ధావన్ (సి) మగాలా (బి) మార్క్‌రమ్ 29; కోహ్లి (సి) బవుమా (బి) మహరాజ్ 0; పంత్ (సి) మార్క్‌రమ్ (బి) షమ్సీ 85; శ్రేయస్ (ఎల్బీ) (బి) షమ్సీ 11; వెంకటేశ్ (స్టంప్డ్) డి కాక్ (బి) ఫెలుక్‌వాయో 22; శార్దుల్ (నాటౌట్) 40; అశ్విన్ (నాటౌట్) 25; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 287. వికెట్ల పతనం: 1–63, 2–64, 3–179, 4–183, 5–207, 6–239. బౌలింగ్: ఎన్‌గిడి 8–0–35–0, మగాలా 8–0–64–1, మార్క్‌రమ్ 8–0–34–1, కేశవ్ మహరాజ్ 9–0–52–1, ఫెలుక్‌వాయో 8–0–44–1, షమ్సీ 9–0–57–2.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: మలాన్ (బి) బుమ్రా 91; డి కాక్ (ఎల్బీ) (బి) శార్దుల్ 78; బవుమా (సి అండ్ బి) చహల్ 35; మార్క్‌రమ్ (నాటౌట్) 37; డసెన్ (నాటౌట్) 37; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (48.1 ఓవర్లలో 3 వికెట్లకు) 288. వికెట్ల పతనం: 1–132, 2–212, 3–214. బౌలింగ్: బుమ్రా 10–0–37–1, భువనేశ్వర్ 8–0–67–0, అశ్విన్ 10–1–68–0, చహల్ 10–0–47–1, శార్దుల్ 5–0–35–1, వెంకటేశ్ 5–0–28–0, శ్రేయస్ 0.1–0–1–0.
Comments
Please login to add a commentAdd a comment