
రోటర్‌డామ్ (నెదర్లాండ్స్): ప్రొ హాకీ మహిళల లీగ్‌లో భారత జట్టు సంచలనం సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత అర్జెంటీనా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ‘షూటౌట్’లో 2–1తో గెలిచింది. ‘షూటౌట్’లో భారత్ తరఫున నేహా గోయల్, సోనిక స్కోరు చేశారు. షర్మిలా దేవి, మోనిక విఫలమయ్యారు. అర్జెంటీనా క్రీడాకారిణుల ఐదు షాట్‌లలో భారత గోల్‌కీపర్, కెప్టెన్ సవితా పూనియా నాలుగింటిని నిలువరించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది.
అంతకుముందు రెగ్యులర్ సమయం ముగిసేసరికి రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ రెండు గోల్స్, లాల్‌రెమ్‌సియామి ఒక గోల్ చేశారు. అర్జెంటీనా తరఫున అగస్టీనా మూడు గోల్స్‌తో హ్యాట్రిక్ సాధించింది. ఫలితం తేలడానికి ‘షూటౌట్’ నిర్వహించగా భారత్ పైచేయి సాధించింది. ఇదే వేదికపై జరిగిన పురుషుల ప్రొ లీగ్‌లో భారత జట్టు 1–4తో ‘షూటౌట్’లో నెదర్లాండ్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment