జకార్తా: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. శుక్రవారం భారత షూటర్లు రెండు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకం సొంతం చేసుకున్నారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో అఖిల్ షెరోన్ పసిడి పతకం నెగ్గగా... ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ రజత పతకం కైవసం చేసుకున్నాడు. అఖిల్, ఐశ్వర్య ప్రతాప్, స్వప్నిల్ కుసాలేలతో కూడిన భారత జట్టు టీమ్ విభాగంలో బంగారు పతకం దక్కించుకుంది.
ఎనిమిది మంది షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో అఖిల్ 460.2 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ఐశ్వర్య ప్రతాప్ 459 పాయింట్లతో రెండో స్థానాన్ని పొందగా... తోంగ్‌ఫాఫుమ్ (థాయ్‌లాండ్; 448.8 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలిచాడు. అఖిల్, ఐశ్వర్య ప్రతాప్, స్వప్నిల్ బృందం టీమ్ విభాగంలో 1758 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ప్రస్తుతం భారత్ 11 స్వర్ణాలు, 8 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 26 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment