పారిస్‌కు బయల్దేరిన భారత పారా అథ్లెట్లు
12 క్రీడాంశాల్లో 84 మంది పోటీ
పతాకధారులుగా భాగ్యశ్రీ, సుమిత్
న్యూఢిల్లీ: పారిస్ పారాలింపిక్స్‌లో సత్తా చాటడమే లక్ష్యంగా భారత అథ్లెట్ల బృందం శుక్రవారం ఫ్రాన్స్‌కు పయనమైంది. ఇటీవల పారిస్ వేదికగా ఒలింపిక్స్ ముగియగా.. ఈ నెల 28 నుంచి సెపె్టంబర్ 8 వరకు అక్కడే పారాలింపిక్స్ జరగనున్నాయి. ఈ క్రీడల్లో భారత్ నుంచి 84 మంది అథ్లెట్లు 12 క్రీడాంశాల్లో పాల్గొంటారు. విశ్వ క్రీడలకు బయలుదేరే ముందు భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
మూడేళ్ల క్రితం టోక్యోలో జరిగిన పారాలింపిక్స్‌లో భారత్ నుంచి 54 మంది బరిలోకి దిగి 19 పతకాలు (5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు) సాధించగా.. ఈసారి ఆ సంఖ్య మరింత పెరుగుతుందని భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ) అధ్యక్షుడు దేవేంద్ర ఝఝారియా అన్నాడు. పారిస్ పారాలింపిక్స్‌లో ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, కనోయింగ్, సైక్లింగ్, బ్లైండ్ జూడో, పవర్ లిఫ్టింగ్, రోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, తైక్వాండోలో మన అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు. ‘ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మన పారా అథ్లెట్లు ఒలింపిక్స్ వరకు చేరుకున్నారు.
‘పారిస్’ పారాక్రీడల్లో సత్తా చాటి అధిక సంఖ్యలో పతకాలు సాధిస్తారనే నమ్మకముంది. ఈ బృందంలో చాలా మంది అథ్లెట్లు ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం ద్వారా లబ్ది పొందినవారే. అథ్లెట్లకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విశ్వక్రీడల్లో అధిక సంఖ్యలో పతకాలు సాధించి దేశ ఖ్యాతిని మరింత పెంపొందించాలి’ అని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయా అన్నారు.
ఫ్లాగ్ బేరర్లుగా భాగ్యశ్రీ, సుమిత్
పారిస్ పారాలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్, షాట్‌పుటర్ భాగ్యశ్రీ జాదవ్ భారత పతాకధారులుగా వ్యవహరించనున్నారు. టోక్యో పారాలింపిక్స్ ఎఫ్64 విభాగంలో స్వర్ణం నెగ్గిన సుమిత్ అంటిల్.. గత ఏడాది ప్రపంచ పారా చాంపియన్íÙప్‌లోనూ బంగారు పతకం సాధించాడు.
మహిళల ఎఫ్34 కేటగిరీలో పోటీపడుతున్న భాగ్యశ్రీ ఆసియా పారా క్రీడల్లో రజతం సాధిచింది. ఈ నేపథ్యంలో పీసీఐ అధ్యక్షుడు ఝఝారియా మాట్లాడుతూ.. ‘విశ్వక్రీడల ఆరంభ వేడుకలో సుమిత్, భాగ్యశ్రీ ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరిస్తారు. వీరిద్దరూ గత కొంతకాలంగా చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నారు.
టోక్యో పారాలింపిక్స్ కంటే ఎక్కువ పతకాలు సాధిస్తామనే నమ్మకముంది. అనేక క్రీడాంశాల్లో మన అథ్లెట్లు అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్నారు. దాని వెనక వారి కఠోర శ్రమ, కృషి ఉంది. పారిస్ పారాలింపిక్స్‌లో దానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని ఆశిస్తున్నాం’ అని అన్నాడు. ఈ క్రీడల్లో తెలంగాణ నుంచి మహిళల 400 మీటర్ల టి20 విభాగంలో జివాంజి దీప్తి పోటీపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment