ఆసియా క్రీడల్లో ఐదో రోజూ భారత్ పతకాల వేట కొనసాగింది. ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి గురువారం భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ భారత షూటర్లు నాలుగో స్వర్ణం సాధించగా... వుషులో రోషిబినా దేవి రజతం, ఈక్వెస్ట్రియన్‌లో అనూష్ కాంస్యం గెలిచారు. ఫలితంగా భారత్ పతకాల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. నేటి నుంచి అథ్లెటిక్స్ ఈవెంట్ కూడా మొదలుకానుండటం... టెన్నిస్, షూటింగ్, స్క్వాష్‌లలో కూడా మెడల్ ఈవెంట్స్ ఉండటంతో పతకాల పట్టికలో నేడు భారత్ నాలుగో స్థానానికి చేరుకునే అవకాశముంది.
హాంగ్జౌ: భారీ అంచనాలతో ఆసియా క్రీడల్లో అడుగుపెట్టిన భారత షూటర్లు నిలకడైన ప్రదర్శనతో రాణిస్తున్నారు. పోటీల ఐదో రోజు గురువారం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. శివ నర్వాల్, అర్జున్ సింగ్ చీమా, సరబ్‌జోత్ సింగ్‌లతో కూడిన భారత బృందం క్వాలిఫయింగ్‌లో అగ్రస్థానం సంపాదించి పసిడి పతకం గెల్చుకుంది.
క్వాలిఫయింగ్‌లో భారత జట్టు మొత్తం 1734 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. సరబ్‌జోత్ సింగ్ 580 పాయింట్లు, అర్జున్ సింగ్ 578 పాయింట్లు, శివ నర్వాల్ 576 పాయింట్లు స్కోరు చేశారు. సరబ్‌జోత్ ఐదో స్థానంలో, అర్జున్ సింగ్ ఎనిమిదో స్థానంలో నిలిచి వ్యక్తిగత విభాగం ఫైనల్స్‌కు అర్హత సాధించారు. అయితే వ్యక్తిగత విభాగంలో సరబ్‌జోత్, అర్జున్ సింగ్‌లకు నిరాశ ఎదురైంది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అర్జున్ 113.3 పాయింట్లు స్కోరు చేసి చివరిదైన ఎనిమిదో స్థానంలో నిలువగా... సరబ్‌జోత్ 199 పాయింట్లు సాధించి నాలుగో స్థానం దక్కించుకొని కాంస్య పతకానికి దూరమయ్యాడు.
మరోవైపు స్కీట్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో అనంత్ జీత్ సింగ్, గనీమత్ సెఖోన్‌లతో కూడిన భారత జట్టు ఏడో స్థానంలో నిలిచింది. నేడు షూటింగ్‌లో నాలుగు మెడల్ ఈవెంట్స్ (పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషన్ టీమ్, వ్యక్తిగత విభాగం; మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్, వ్యక్తిగత విభాగం) ఉన్నాయి. ప్రస్తుత ఆసియా క్రీడల్లో భారత షూటర్లు నాలుగు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఐదు కాంస్య పతకాలు గెలిచారు.
అనూష్ ఘనత..
ఈక్వె్రస్టియన్ (అశ్వ క్రీడలు)లో భారత్‌కు మరో పతకం దక్కింది. డ్రెసాజ్ వ్యక్తిగత విభాగంలో అనూష్ అగర్‌వల్లా కాంస్య పతకం సాధించాడు. 14 మంది పోటీపడిన ఫైనల్లో అనూష్, అతని అశ్వం 73.030 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచారు. ఆసియా క్రీడల చరిత్రలో డ్రెసాజ్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు పతకం రావడం ఇదే తొలిసారి. మరోవైపు వుషు క్రీడాంశంలో స్వర్ణ పతకం సాధించాలని ఆశించిన భారత క్రీడాకారిణి రోషిబినా దేవికి నిరాశ ఎదురైంది. వు జియోవె (చైనా)తో జరిగిన 60 కేజీల సాండా ఈవెంట్ ఫైనల్లో రోషిబినా దేవి 0–2తో ఓడిపోయి రజత పతకం కైవసం చేసుకుంది.
భారత్ ‘హ్యాట్రిక్’ విజయం
భారత పురుషుల హాకీ జట్టు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. డిఫెండింగ్ చాంపియన్ జపాన్‌తో గురువారం జరిగిన పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 4–2 గోల్స్ తేడాతో నెగ్గింది. భారత్ తరఫున అభిõÙక్ (13వ, 48వ ని.లో) రెండు గోల్స్ చేయగా... మన్‌దీప్ (24వ ని.లో), అమిత్ రోహిదాస్ (34వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు.
క్వార్టర్ ఫైనల్లో సింధు బృందం..
మహిళల బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్‌లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్ చేరింది. మంగోలియాతో జరిగిన తొలి రౌండ్‌లో భారత్ 3–0తో గెలిచింది. పీవీ సింధు, అషి్మత, అనుపమ తమ సింగిల్స్ మ్యాచ్‌ల్లో విజయం సాధించారు.
స్క్వాష్ జట్లకు పతకాలు ఖాయం
వరుసగా నాలుగోసారి ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల స్క్వాష్ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నాయి. చివరి లీగ్ మ్యాచ్‌ల్లో భారత మహిళల జట్టు 0–3తో మలేసియా చేతిలో ఓడిపోగా.. భారత పురుషుల జట్టు 3–0తో నేపాల్‌పై నెగ్గింది. తమ గ్రూపుల్లో రెండో స్థానంలో నిలవడం ద్వారా ∙భారత జట్లు సెమీఫైనల్ బెర్త్‌లు పొందాయి.
నిశాంత్ పంచ్ అదుర్స్..
భారత బాక్సర్లు నిశాంత్ దేవ్ (71 కేజీలు), జాస్మిన్ లంబోరియా (60 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లి పతకానికి విజయం దూరంలో నిలువగా... దీపక్ (51 కేజీలు) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. నిశాంత్ పంచ్‌లకు అతని ప్రత్యర్థి బుయ్ తుంగ్ (వియత్నాం) తొలి రౌండ్‌లోనే చిత్తయ్యాడు. జాస్మిన్ పంచ్‌లకు హదీల్ గజ్వాన్ (సౌదీ అరేబియా) తట్టుకోలేకపోవడంతో రిఫరీ రెండో రౌండ్‌లో బౌట్‌ను ముగించాడు. దీపక్ 1–4తో ప్రపంచ మాజీ చాంపియన్ టొమోయా సుబోయ్ (జపాన్) చేతిలో ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment