గతానికి భిన్నంగా.. తొలిసారి ఇండోర్‌లో అథ్లెటిక్స్‌ పోటీలు | Indoor Athletics Championship Games In Bhuvaneshwar Odisha | Sakshi
Sakshi News home page

గతానికి భిన్నంగా.. తొలిసారి ఇండోర్‌లో అథ్లెటిక్స్‌ పోటీలు

Mar 24 2026 12:31 PM | Updated on Mar 24 2026 1:27 PM

Indoor Athletics Championship Games In Bhuvaneshwar Odisha

భువనేశ్వర్‌: సంప్రదాయ అథ్లెటిక్స్‌కు భిన్నంగా భారత్‌ కూడా ఇప్పుడు ఇండోర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు సిద్ధమైంది. తొలిసారిగా నేటి నుంచి జరిగే జాతీయ ఇండోర్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు కళింగ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. జాతీయ అథ్లెట్లందరూ సొంతగడ్డపై తొలి ఇండోర్‌ అనుభవానికి సిద్ధమయ్యారు. ఇండోర్‌ అథ్లెటిక్స్‌ ట్రాక్, పోటీలు భిన్నంగా ఉంటాయి. 

400 మీటర్ల ట్రాక్‌ స్థానంలో 200 మీటర్ల ట్రాక్‌ ఉంటుంది. ఇటీవలే భారత్‌కు 2028 ప్రపంచ ఇండోర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ ఆతిథ్య హక్కులు లభించాయి. దీంతో వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా ఇండోర్‌ ఈవెంట్ల నిర్వహణ ఊపందుకోనుంది. అయితే తొలి ఇండోర్‌ ఈవెంట్‌లో స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా పాల్గొనడం లేదు. అతని ఈవెంట్‌ (జావెలిన్‌ త్రో) ఈ చాంపియన్‌షిప్‌లో లేకపోవడంతో చోప్రా అభిమానులకు ఇది నిరాశపరిచే అంశం. 3000 మీటర్ల స్టీపుల్‌ చేజర్‌ అవినాశ్‌ సాబ్లే కూడా ఇదే కారణంతో పోటీలకు దూరమయ్యాడు. 

స్ప్రింటర్‌ అనిమేశ్‌ కుజుర్, ట్రిపుల్‌ జంపర్‌ ప్రవీణ్‌ చిత్రావెల్‌ మొట్టమొదటి జాతీయ ఇండోర్‌ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. 100 మీటర్లు, 200 మీటర్లు అవుట్‌డోర్‌ ఈవెంట్స్‌లో జాతీయ రికార్డు సాధించిన కుజుర్‌ ఇప్పుడు ఇండోర్‌ పోటీల్లోనూ రికార్డు నెలకొల్పేందుకు శ్రమిస్తున్నాడు. స్వరాష్ట్రం ఒడిశా తరఫున ఇండోర్‌ పోటీల్లో అతను 60 మీటర్ల రేసులో పోటీపడనున్నాడు. 

‘నాకు ఇది తొలి  ఇండోర్‌ ఈవెంట్‌. ఇక్కడ రెగ్యులర్‌ స్ప్రింట్‌ (100, 200 మీటర్లు) కాకుండా 60 మీటర్ల పోటీకి సిద్ధమయ్యాను. నిజానికి నా ప్రధాన లక్ష్యం కామన్వెల్త్‌ క్రీడలు, ఆసియా క్రీడలు. అయితే ఇండోర్‌ ఈవెంట్‌లో నా సత్తా ఎంటో తెలుసుకునేందుకే పోటీల్లోకి దిగుతు న్నాను’ అని కుజుర్‌ తెలిపాడు. 

తమిళనాడుకు చెందిన ప్రవీణ్‌కు ట్రిపుల్‌ జంప్‌లో జాతీయ రికార్డు ఉంది. అయితే అతను ఈ చాంపియన్‌షిప్‌లో మాత్రం లాంగ్‌జంప్‌లో  పోటీపడతాడు. హైజంప్, పోల్‌వాల్ట్, లాంగ్‌జంప్, ట్రిపుల్‌ జంప్, షాట్‌పుట్‌లు ఈ ఇండోర్‌ క్రీడల్లో ఉన్నప్పటికీ జావెలిన్‌ త్రో, డిస్కస్‌ త్రో, హ్యామర్‌ త్రోలను కొన్ని కారణాల వల్ల తప్పించారు. సాధారణంగా రెగ్యులర్‌ అవుట్‌డోర్‌ ఈవెంట్‌లో ప్రత్యర్థులతో పాటు వాతావరణ సమస్యల్ని ఎదుర్కొవాల్సి ఉంటుంది. కానీ ఇండోర్‌ అథ్లెటిక్స్‌లో అలాంటి ఇబ్బందులేవీ ఉండవు.   

చదవండి: రాజస్థాన్‌లోకి షనక.. కీలక సూత్రధారి అతడే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement