చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని ఫిట్‌నెస్ గురించి ఆ జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని.. అతడి సేవలను ఎలా ఉపయోగించుకోవాలో తమకు తెలుసునని పేర్కొన్నాడు.
అదే విధంగా.. ధోని ఏ స్థానంలోనైనా ఆడగలడని అందుకే గత మ్యాచ్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడని ఫ్లెమింగ్ తెలిపాడు. కాగా గతేడాది నుంచి ధోని మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.
అయినప్పటికీ 42 ఏళ్ల తలా ఐపీఎల్-2024 బరిలో దిగాడు. ఇప్పటి వరకు 9 ఇన్నింగ్స్ ఆడి 110 పరుగులు చేశాడు. అయితే, ఇటీవల పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా ధోని తన టీ20 కెరీర్‌లో తొలిసారి తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు ధోని నిర్ణయాన్ని తప్పుబట్టారు. జట్టు కోసం అతడు ఏడో స్థానంలోనే రావాలని.. అలా కాని పక్షంలో తుదిజట్టులో ఉండకూడదని ఘాటు విమర్శలు చేశారు.
ఈ క్రమంలో మోకాలి నొప్పి కారణంగానే బ్యాటింగ్ తగ్గించి.. వికెట్ కీపర్‌గా పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకు ధోని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై సీఎస్‌కే హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తాజాగా స్పందించాడు.
గుజరాత్ టైటాన్స్‌తో శుక్రవారం చెన్నై మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అతడు కేవలం సిక్సర్లు, ఫోర్లు కొట్టడమే కాదు.. ఏ స్థానంలో వచ్చినా తన అత్యుత్తమ ప్రదర్శన కనబరచగలడు.
అతడు తొమ్మిదో స్థానంలో వచ్చినంత మాత్రాన ప్రభావం చూపలేడని భావించవద్దు. జట్టు కోసం తనేం చేయగలడో తప్పకుండా చేస్తాడు.
అతడి సేవలను అన్ని రకాలుగా మేము ఉపయోగించుకుంటాం. అయితే, ఒత్తిడి పెంచి అతడు జట్టుకు దూరమయ్యేలా చేసుకోలేం. జట్టు కోసం తను ఎల్లప్పుడూ పరితపిస్తాడు. అభిమానుల కోసం ఏమైనా చేస్తాడు. ప్రస్తుతం తన ఫిట్‌నెస్‌కు వచ్చిన ఇబ్బందులేమీ లేవు’’ అని స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.
కాగా ఈ సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో సీఎస్‌కే ఆడిన 11 మ్యాచ్‌లలో ఆరు గెలిచింది. 12 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. అహ్మదాబాద్‌లో శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో పోరులో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో సాఫీగా ముందుకు సాగాలని పట్టుదలగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment