టీమిండియా ఆటగాడు రిషభ్ పంత్(ఫొటో కర్టెసీ: బీసీసీఐ)
ఇస్లామాబాద్: టీమిండియా యువ ఆటగాడు రిషభ్ పంత్ బ్యాటింగ్ శైలి, భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను గుర్తు చేసిందని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ అన్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నా, ఒత్తిడికి లోనుకాకుండా తమదైన శైలిలో బ్యాట్‌తో చెలరేగిపోవడంలో ఇద్దరూ ఇద్దరేనంటూ ప్రశంసలు కురిపించాడు. పంత్‌ను చూసినప్పుడల్లా సెహ్వాగ్ ఎడమచేతిలో బ్యాటింగ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుందని పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీ టెస్టులో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో సిడ్నీ(డ్రా), బ్రిస్బేన్(గెలుపు) ఫలితాల్లో పంత్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అదే విధంగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ మెరుగ్గా ఆడాడు. ముఖ్యంగా నిర్ణయాత్మక ఆఖరి టెస్టులో సెంచరీ చేసి తన విలువేమిటో మరోసారి చాటి చెప్పాడు.
ఈ నేపథ్యంలో ఇంజమామ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్ అత్యంత ప్రతిభావంతుడు. ఎలాంటి పరిస్థితిలోనైనా ఒత్తిడి ఫీల్ అవ్వడు. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఆటగాడిని చూశాను. 6 వికెట్లు పడిన సమయంలోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ అద్భుతమైన ఇన్నిండ్స్ ఆడాడు. పిచ్ గురించి పట్టించుకోలేదు. బౌలర్ ఎవరన్న విషయం గురించి ఆలోచించలేదు. స్పిన్నర్లైనా, ఫాస్ట్ బౌలర్లు అయినా తను ఒకే విధంగా ఆడతాడు. నేనైతే పంత్ బ్యాటింగ్‌ను పూర్తిగా ఆస్వాదించాను. సెహ్వాగ్ ఎడమచేతితో బ్యాటింగ్ చేస్తున్నాడా అనిపించింది’’ అంటూ ప్రశంసించాడు.
అదే విధంగా.. సెహ్వాగ్‌తో తను ఆడిన మ్యాచ్‌ల గురించి గుర్తుచేసుకుంటూ.. ‘‘సెహ్వాగ్ బ్యాటింగ్ చేస్తున్నపుడు వేరే ఇతర విషయాల గురించి అస్సలు పట్టించుకోడు. పిచ్ ఎలా ఉంది, బౌలర్ ఎవరు, బౌండరీల వద్ద ఫీల్డర్లు ఉన్నా సరే తను ఆడాలనుకున్న షాట్‌ను తెలివిగా ఎగ్జిక్యూట్ చేస్తాడు. స్వదేశంలోనే కాదు, విదేశాల్లోనూ తన పంథా ఇలాగే ఉంటుంది. అప్పట్లో సచిన్, ద్రవిడ్, ఇప్పుడు విరాట్, రోహిత్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఎంతో మంది భారత్‌కు దొరికారు. అయితే, సెహ్వాగ్ వంటి ఆత్మవిశ్వాసం ఉన్న క్రికెటర్‌ను నేనింత వరకు చూడలేదు’’ అని గత జ్ఞాపకాలు పంచుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment