Photo Courtesy: IPL
సన్‌రైజర్స్ ఒత్తిడిలో పడి చిత్తయ్యింది. ఆర్సీబీ నిర్దేశించిన 150 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక చతికిలబడింది. గెలవాల్సిన మ్యాచ్‌ను తీసుకెళ్లి ఆర్సీబీ చేతిలో పెట్టింది. ఆరు పరుగుల తేడాతో ఆరెంజ్ ఆర్మీ ఓటమి పాలైంది. 15 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లను కోల్పోవడంతో సన్‌రైజర్స్ తిరిగి తేరుకోలేకపోయింది. ఓ దశలో రషీద్ ఖాన్(17) గెలిపిస్తాడని ఆశలు పెట్టుకున్నా రనౌట్ కావడంతో సన్‌రైజర్స్ ఓటమి తప్పలేదు. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైన సన్‌రైజర్స్ పరాజయం చెందింది.
సన్‌రైజర్స్ ఓపెనర్లలో వృద్దిమాన్ సాహా(1) నిరాశపరిచినా డేవిడ్ వార్నర్ ఆకట్టుకున్నాడు. . 37 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 54 పరుగులతో మెరిశాడు. వార్నర్‌కు మనీష్ పాండే నుంచి కూడా సహకారం లభించింది. వీరిద్దరూ 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా, ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. దాంతో సాధారణ స్కోరును సైతం ఛేదించలేక వరుసగా రెండో ఓటమిని మూట గట్టుకుంది. కాగా, ఓటమి అంచుల నుంచి ఆర్సీబీ తేరుకుని విజయం సాధించింది. ఇది ఆర్సీబీకి వరుసగా రెండో విజయం. ఆర్సీబీ బౌలర్లలో షెహబాజ్ అహ్మద్ మూడు వికెట్లు సాధించగా, హర్షల్ పటేల్, సిరాజ్‌లు తలో రెండు వికెట్లు సాధించారు. జెమీసన్‌కు వికెట్ దక్కింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్(59; 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లి(33; 29 బంతుల్లో 4 ఫోర్లు) మాత్రమే రాణించగా, మిగతా వారు విఫలమయ్యారు, టాస్ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఆర్సీబీ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను కోహ్లి, పడిక్కల్‌లు ఆరంభించారు. కాగా, పడిక్కల్(11) నిరాశపరిచాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన మూడో ఓవర్ ఐదో బంతికి నదీమ్‌కు క్యాచ్ ఇచ్చిన పడిక్కల్ పెవిలియన్ చేరాడు.
ఆపై షహబాజ్ అహ్మద్(14) ఔట్ కావడంతో ఆర్సీబీ 47 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను మ్యాక్స్‌వెల్-కోహ్లిలు మరమ్మత్తు చేశారు. ఈ జోడి 44 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత కోహ్లి ఔటయ్యాడు. ఆపై స్వల్ప వ్యవధిలో ఏబీ డివిలియర్స్(1)పెవిలియన్ చేరాడు. కాసేపటికి వాషింగ్టన్ సుందర్(8) కూడా ఔట్ కావడంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. కాగా, మ్యాక్స్‌వెల్ కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో ఆర్సీబీ 150 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. సన్‌రైజర్స్ బౌలర్లలో హెల్డర్ మూడు వికెట్లు సాధించగా, రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. నదీమ్, నటరాజన్, భువనేశ్వర్‌లు తలో వికెట్ తీశారు.
సన్‌రైజర్స్ టపాటపా
సన్‌రైజర్స్ వరుసగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. 15 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లను నష్టపోయింది. బెయిర్ స్టో వికెట్ మొదలు వరుసగా కీలక వికెట్లు కోల్పోయింది. ఒకే ఓవర్ మూడు వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్.. ఆపై మరుసటి ఓవర్‌లో ఒక వికెట్‌ను, ఆ తర్వాత ఓవర్‌లో మరొక వికెట్‌ను నష్టపోయింది.
8 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయింది.115 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయిన సన్‌రైజర్స్.. 123 పరుగుల స్కోరు బోర్డుపై వచ్చేసరికి ఆరో వికెట్‌ను నష‍్టపోయింది. విజయ్ శంకర్(3) ఆరో వికెట్‌గా ఔటయ్యాడు. హర్షల్ పటేల్ వేసిన 18 ఓవర్ ఆఖరి బంతికి విజయ్ శంకర్ ఆడిన షాట్ కాస్తా పైకి లేవడంతో కోహ్లి క్యాచ్ తీసుకున్నాడు.
ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు
షెహబాజ్ వేసిన ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు సాధించాడు. ముందు బెయిర్ స్టోను, ఆపై మనీష్ పాండే, అబ్దుల్ సామద్‌లను బోల్తా కొట్టించి సన్‌రైజర్స్ క్యాంప్‌ను టెన్షన్‌లో పెట్టాడు., ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు రావడంంతో ఆర్సీబీ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. దాంతో 116 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది సన్‌రైజర్స్.
బెయిర్ స్టో విఫలం.. ఆపై వెంటనే మనీష్
బెయిర్ స్టో విఫలమయ్యాడు. బెయిర్ స్టో 12 పరుగులు చేసి ఔటయ్యాడు. క్రీజ్‌లోకి వచ్చిన వెంటనే ఫోర్ కొట్టి మంచి టచ్‌లో కనిపించిన బెయిర్ స్టో.. షెహబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో డివిలియర్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత వెంటనే మనీష్ పాండే(38) పెవిలియన్ చేరాడు. 17 ఓవర్ తొలి బంతికి బెయిర్ స్టో ఔటైతే, తర్వా బంతికి మనీష్ పెవిలియన్ బాట పట్టాడు., షాట్ ఆడబోయి హర్షల్ నటేల్ క్యాచ్ పట్టడంతో మనీష్ పెవిలియన్ చేరాడు.
వార్నర్(54) ఔట్, ఎస్‌ఆర్‌హెచ్ 98/2
డేవిడ్ వార్నర్ రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. 37 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 54 పరుగులు సాధించి పెవిలియన్ చేరాడు. జెమీసన్ వేసిన 14 ఓవర్ రెండో బంతికి షాట్‌కు యత్నించిన వార్నర్.. క్రిస్టియన్ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. దాంతో 98 పరుగుల వద్ద సన్‌రైజర్స్ రెండో వికెట్‌ను కోల్పోయింది.
వార్నర్ బాధ్యతాయుతమైన ఫిఫ్టీ
ఓవరాల్ టీ20 కెరీర్‌లో 300వ మ్యాచ్ ఆడుతున్న వార్నర్(31 బంతుల్లో 50; 7 ఫోర్లు, సిక్స్) ఐపీఎల్ కెరీర్‌లో 49వ ఫిఫ్టీ నమోదు చేశాడు. 13 ఓవర్ల తర్వాత ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ 96/1. మనీశ్ పాండే(34 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) నిలకడగా ఆడుతున్నాడు.
నిలకడగా ఆడుతున్న ఎస్‌ఆర్‌హెచ్, 10 ఓవర్ల తర్వాత 77/1
లూజ్ బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోర్ బోర్డ్‌ను పరుగులు పెట్టిస్తున్న ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లు నిలకడైన ఆటతీరును కనబరుస్తూ, గెలుపు దిశగా సాగుతున్నారు. మనీశ్ పాండే(27 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), వార్నర్(24 బంతుల్లో 28; 5 ఫోర్లు, సిక్స్)లు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ ఆర్‌సీబీ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. 10 ఓవర్లు ముగిసే సమయానికి ఎస్‌ఆర్‌హెచ్ వికెట్ నష్టానికి 77 పరుగులు సాధించింది. ఎస్‌ఆర్‌హెచ్ గెలుపునకు 60 బంతుల్లో 73 పరుగులు చేయాల్సి ఉంది.
6 ఓవర్ల తర్వాత ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ 50/1
ఆదిలోనే సాహా వికెట్ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్ ఏమాత్రం తడబాటుకు లోనుకాకుండా చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. మనీశ్ పాండే(14 బంతుల్లో 14; ఫోర్, సిక్స్) నిలకడైన బ్యాటింగ్‌కు కెప్టెన్ వార్నర్(13 బంతుల్లో 28; 4 ఫోర్లు, సిక్స్) మెరుపులు తోడవ్వడంతో 6 ఓవర్లు ముగిసే సమాయానికి ఎస్‌ఆర్‌హెచ్ 50 పరుగుల స్కోర్‌ను చేరుకోగలిగింది.
తొలి వికెట్ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్, సాహా(1) ఔట్
సింగల్ తీసేందుకు కూడా ఇబ్బంది పడ్డ వృద్ధిమాన్ సాహా 9 బంతులను ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించి సిరాజ్ బౌలింగ్‌లో మ్యాక్సీకి సింపుల్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. తొలి ఓవర్ మెయిడిన్ వేసిన సిరాజ్.. రెండో ఓవర్లో సాహా వికెట్ పడగొట్టి కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో 3 ఓవర్లు ముగిసే సమాయానికి ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ 15/1. క్రీజ్‌లో వార్నర్(5 బంతుల్లో 7), మనీశ్ పాండే(4 బంతుల్లో 1) ఉన్నారు.
మ్యాక్సీ ఫిఫ్టీ.. ఆర్‌సీబీ 149/8
గ్లెన్ మ్యాక్స్‌వెల్ హాఫ్ సెంచరీ సహాకారంతో ఆర్‌సీబీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగలిగింది. హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి బంతికి వికెట్ కీపర్ సాహా చేతికి క్యాచ్ ఇచ్చిన మ్యాక్సీ(41 బంతుల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో హోల్డర్ 3 వికెట్లు, రషీద్ ఖాన్ 2, భువీ, షాబాజ్, నటరాజన్‌లకు తలో వికెట్ దక్కింది.
జేమీసన్(12) ఔట్
హోల్డర్ బౌలింగ్‌లో మనీశ్ పాండే క్యాచ్ అందుకోవడంతో జేమీసన్(9 బంతుల్లో 12; 2 ఫోర్లు) పెవిలియన్ చేరాడు.
ఆర్సీబీ ఆరో వికెట్ డౌన్, క్రిస్టియన్(1) ఔట్
నటరాజన్ బౌలింగ్‌లో బాటమ్ ఎడ్జ్ తీసుకోవడంతో వికెట్ కీపర్ సాహా చేతికి క్యాచ్ ఇచ్చి డేనియల్ క్రిస్టియన్(2 బంతుల్లో 1) వెనుదిరిగాడు. 17 ఓవర్ల తర్వాత ఆర్‌సీబీ స్కోర్ 110/6. క్రీజ్‌లో మ్యాక్సీ(35), జేమీసన్(1) ఉన్నారు.
ఐదో వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ, సుందర్(8) ఔట్
ఎస్‌ఆర్‌హెచ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆర్‌సీబీని కోలుకోలేని దెబ్బకొట్టాడు. వరుసగా డివిలియర్స్, సుందర్(11 బంతుల్లో 8; ఫోర్)ల వికెట్లు తీసి ఆర్‌సీబీని కష్టాల్లోకి నెట్టాడు. రషీద్ బౌలింగ్‌లో మనీశ్ పాండే అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ అందుకోవడంతో సుందర్ పెవిలియన్ చేరాడు. 16 ఓవర్ల తర్వాత ఆర్‌సీబీ స్కోర్ 106/5. క్రీజ్‌లో మ్యాక్సీ(33), డేనియల్ క్రిస్టియన్(0) ఉన్నాడు.
ఆర్‌సీబీకి మరోషాక్.. డివిలియర్స్(1) ఔట్
13వ ఓవర్ తొలి బంతికి కెప్టెన్ కోహ్లి వికెట్‌ను కోల్పోయిన ఆర్‌సీబీ, ఆ మరుసటి ఓవర్ నాలుగో బంతికే డేంజరస్ బ్యాట్స్‌మెన్ డివిలియర్స్(5 బంతుల్లో 1) వికెట్‌ను కూడా చేజార్చుకుని కష్టాల్లో చిక్కుకుంది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో షార్ట్ కవర్‌లో ఫీల్డింగ్ చేస్తున్న డేవిడ్ వార్నర్ క్యాచ్ అందుకోవడంతో ఏబీ పెవిలియన్ బాట పట్టాడు. 14 ఓవర్ల తర్వాత ఆర్‌సీబీ స్కోర్ 96/4. క్రీజ్‌లో మ్యాక్సీ(30), సుందర్(1) ఉన్నారు.
కోహ్లి(33) అవుట్
నిలకడగా ఆడుతున్న ఆర్‌సీబీ కెప్టెన్ కోహ్లి(29 బంతుల్లో 33; 4 ఫోర్లు).. హోల్డర్ బౌలింగ్‌లో విజయ్ శంకర్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరాడు. బంతిని ఫ్లిక్ చేసే ప్రయత్నంలో టాప్ ఎడ్జ్ తీసుకోవడంతో బంతి గాల్లోకి లేచింది. దీంతో కోహ్లి పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. డ్రసింగ్ రూమ్‌లోకి వెళ్లిన అనంతరం కోహ్లి బ్యాట్‌ను కుర్చీ కేసి కొట్టి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. కోహ్లి అవుటయ్యాక జట్టు స్కోర్ 91/3. క్రీజ్‌లో మ్యాక్సీ(28), ఏబీ డివిల్లియర్స్(0) ఉన్నారు.
నదీమ్‌కు చుక్కలు చూపించిన మ్యాక్సీ
షాబాజ్ నదీమ్ వేసిన 11వ ఓవర్‌లో మ్యాక్స్‌వెల్ విరుచుకుపడ్డాడు. వరుసగా 6,4,6 పరుగులు పిండుకున్నాడు. అనంతరం సింగల్ తీసి కోహ్లికి స్ట్రయిక్ ఇవ్వగా అతను కూడా మరో బౌండరీ బాదడంతో ఆ ఓవర్‌లో మొత్తం 22 పరుగులు వచ్చాయి. దీంతో 11 ఓవర్ల తర్వాత ఆర్‌సీబీ స్కోర్ 85/2. క్రీజ్‌లో కోహ్లి(23 బంతుల్లో 29; 4 ఫోర్లు), మ్యాక్స్‌వెల్(20 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఉన్నారు.
9 ఓవర్ల తర్వాత ఆర్‌సీబీ స్కోర్ 58/2
రెండు వికెట్లు కోల్పోయాక ఆర్‌సీబీ స్కోర్ నెమ్మదించింది. కెప్టెన్ విరాట్ కోహ్లి(18 బంతుల్లో 22; 3 ఫోర్లు) సింగల్స్ తీస్తూ స్ట్రయిక్ రొటేట్ చేస్తున్నా మ్యాక్స్‌వెల్(13 బంతుల్లో 7; ఫోర్) పరుగులు సాధించేందుకు ఆపసోపాలు పడుతున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 9 ఓవర్ల అనంతరం ఆర్‌సీబీ స్కోర్ 58/2.
ఆర్‌సీబీ రెండో వికెట్ డౌన్, షాబాజ్(14) ఔట్
మంచి టచ్లో ఉన్నట్లు కనిపించిన షాబాజ్ అహ్మద్(10 బంతుల్లో 14; సిక్స్).. ఎస్‌ఆర్‌హెచ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ అందించి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. 7 ఓవర్ల అనంతరం ఆర్‌సీబీ స్కోర్ 48/2. క్రీజ్‌లో విరాట్(15 బంతుల్లో 20; 3 ఫోర్లు), మ్యాక్స్‌వెల్(0) ఉన్నారు.
5 ఓవర్ల తర్వాత ఆర్‌సీబీ స్కోర్ 36/1
తొలి వికెట్ కోల్పోయాక ఆర్‌సీబీ ఆచితూచి ఆడుతుంది. పడిక్కల్ అవుటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన షాబాజ్ అహ్మద్(7 బంతుల్లో 13; సిక్స్) వచ్చి రాగానే అద్భుతమైన సిక్సర్ బాది మంచి టచ్లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ విరాట్(10 బంతుల్లో 10; ఫోర్) సింగల్స్‌పైనే ఎక్కువగా కాంసంట్రేట్ చేస్తూ స్ట్రయిక్ రొటేట్ చేస్తున్నాడు. దీంతో 5 ఓవర్ల తర్వాత ఆర్‌సీబీ వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది.
తొలి వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ.. పడిక్కల్(11) ఔట్
లీగ్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న దేవ్‌దత్ పడిక్కల్(13 బంతుల్లో 11; 2 ఫోర్లు) ఇన్నింగ్స్ ఆరంభం నుంచి పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. భువనేశ్వర్ వేసిన 3వ ఓవర్‌లో మిడ్ వికెట్‌లో షాబాజ్ నదీమ్ అద్భుతమైన లో క్యాచ్ అందుకోవడంతో అతను పెవిలియన్ బాట పట్టాడు. 3 ఓవర్ల తర్వాత ఆర్‌సీబీ స్కోర్ 20/1. క్రీజ్‌లో కోహ్లి(4 బంతుల్లో 6; ఫోర్), షాబాజ్ అహ్మద్(1) ఉన్నారు.
ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను బోల్తా కొట్టించి ఉరకలేస్తున్న ఆర్‌సీబీ.. నేడు సన్‌రైజర్స్‌తో జరుగబోయే మ్యాచ్‌లో కూడా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు లీగ్‌లో తమ తొలి మ్యాచ్‌లో కేకేఆర్ చేతిలో ఖంగుతిన్న సన్‌రైజర్స్.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఎస్‌ఆర్‌హెచ్, ఆర్‌సీబీ జట్ల మధ్య చెపాక్ వేదికగా ఆసక్తికరపోరు జరగనుంది. ఇక ఇరు జట్ల మధ్య ముఖాముఖి పోరు విషయానికొస్తే.. ఆర్‌సీబీపై ఎస్‌ఆర్‌హెచ్‌దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు ఇప్పటి వరకూ 18 మ్యాచ్‌ల్లో తలపడగా.. ఎస్‌ఆర్‌హెచ్ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 7 మ్యాచ్‌ల్లో బెంగళూరు గెలుపొందింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
ఐపీఎల్‌లో బెంగళూరుపై హైదరాబాద్ చేసిన అత్యధిక స్కోరు 231 పరుగులు కాగా.. హైదరాబాద్‌పై బెంగళూరు చేసిన అత్యధిక స్కోరు 227 పరుగులుగా ఉంది. గత సీజన్‌లో(ఐపీఎల్ 2020) ఇరు జట్లు మూడు సార్లు తలపడ్డాయి. ఇందులో రెండు లీగ్ మ్యాచ్‌లు కాగా, ఒకటి ప్లేఆఫ్ మ్యాచ్‌గా ఉంది. ఇందులో తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ గెలుపొందింది. ప్లేఆఫ్‌లో భాగంగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరుపై హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా, ఇరు జట్లు ఐపీఎల్ 2016 సీజన్ టైటిల్ పోరులో తలపడగా.. వార్నర్ సేన బెంగళూరుపై విజయం సాధించి విజేతగా నిలిచింది.
ఇక ఇరు జట్ల బలాబలాల విషయానికొస్తే.. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాట్స్‌మెన్లు బెయిర్ స్టో, మనీష్ పాండేలు గత మ్యాచ్‌లో దుమ్మురేపారు. వీరికి తోడుగా డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్‌లో ఫాంలోకి వస్తే ఆ జట్టుకు తిరుగే ఉండదు. గత మ్యాచ్‌కు దూరమైన కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. ఇక భువీ, రషీద్ ఖాన్, సందీప్ శర్మలతో ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తుంది. అయితే ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ఫాంలో లేకపోవడం ఆ జట్టుకు ఆందోళన కలిగించే అంశం. ఇక బెంగళూరులో కెప్టెన్ విరాట్ కోహ్లీ, పవర్ హిట్టర్లు గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్ మంచి టచ్లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఆల్‌రౌండర్ డేనియల్ క్రిస్టియన్ గత మ్యాచ్‌లో విఫలమయ్యాడు. దాంతో.. ఆ జట్టు లోయర్ మిడిలార్డర్ బలహీనంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లోనూ ఆర్‌సీబీ అంత బలంగా లేదు. జేమిసన్ ఒక్కడే కాస్త పొదుపుగా బౌలింగ్ చేయగా.. చహల్ మొదటి మ్యాచ్‌లో 4 ఓవర్లలో 41 పరుగులిచ్చేశాడు. సిరాజ్ పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్ దక్కించుకోలేకపోయాడు.
తుది జట్లు:
ఎస్‌ఆర్‌హెచ్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), వృద్దిమాన్ సాహా (వికెట్ కీపర్), మనీష్ పాండే, విజయ్ శంకర్, జేసన్ హోల్డర్, జానీ బెయిర్ స్టో, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, టి నటరాజన్
ఆర్‌సీబీ: విరాట్ కోహ్లి (కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, హర్షల్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కైల్ జెమీషన్, చాహల్, మహ్మద్ సిరాజ్, షాబాజ్ అహ్మద్
Comments
Please login to add a commentAdd a comment