IPL 2022 Auction: క్యాష్ రిచ్‌లీగ్ ఐపీఎల్-2022లో రెండు కొత్త జట్ల చేరికతో బీసీసీఐ ఖజానాలో ఇప్పటికే 12,715 కోట్ల రూపాయలు చేరాయి. రానున్న నెలలో మరో 40 వేల కోట్లు ట్రెజరీలో జమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాల గురించి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. జర్నలిస్టు బోరియా మజుందార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘‘ రెండు కొత్త ఫ్రాంఛైజీల రాకతో 12 వేల కోట్ల రూపాయలు వచ్చాయి.
ఇక ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా మరో 40 వేల కోట్ల రూపాయలకు పైగా పొందేలా ప్రణాళికలు రచిస్తున్నాం. ఇందుకు సంబంధించి త్వరలోనే టెండర్లు వేసేందుకు సిద్ధమవుతున్నాం’’ అని దాదా పేర్కొన్నారు. కాగా మీడియా హక్కుల అమ్మకం విషయంలో గత ఐదేళ్లుగా(ప్రస్తుత సైకిల్: 2018-2022) సంబంధించి బీసీసీఐకి 16,347 కోట్ల మేర ఆదాయం వస్తోంది. ఒకవేళ గంగూలీ వ్యాఖ్యలు గనుక కార్యరూపం దాల్చి... 2023-27 సైకిల్‌కు గానూ మీడియా హక్కుల రూపంలో 40 వేల కోట్లకు పైగా గనుక సమకూరితే ఈ విలువ మూడు రెట్లవుతుంది.
ఐపీఎల్-2022 సీజన్ నేపథ్యంలో కొత్త జట్ల రాకతో 12 వేల కోట్లు, మీడియా రైట్స్ రూపంలో 40 వేల కోట్లకు పైగా.. అంటే మొత్తంగా 50 వేల కోట్ల రూపాయలతో భారత బోర్డు మరింత సుసంపన్నం కానుంది. ఈ నేపథ్యంలో.. ‘‘భారత క్రికెట్‌కు యాభై వేల కోట్ల రూపాయలు... మన ఆటను మరో మెట్టు ఎక్కించేందుకు బీసీసీఐ కృషి చేస్తోంది. ఇప్పటికే ఐపీఎల్ ద్వారా భారీ ఆదాయం.. ఇప్పుడు మరో స్థాయికి చేరుకుంటాం’’ అని గంగూలీ పేర్కొనడం చూస్తుంటే... బోర్డుపై మరోసారి కాసుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది.
స్టార్ ఇండియాతో..
2018-2022 మధ్య కాలానికి గానూ టీవీ, డిజిటల్ హక్కులకు సంబంధించి స్టార్ ఇండియా బీసీసీఐతో ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలో 2.55 బిలియన్ డాలర్లు(మన కరెన్సీలో రూ. 16,347 కోట్లు) చెల్లిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు ఐపీఎల్‌లో కొత్తగా మరో రెండు జట్లు చేరనుండటంతో మ్యాచ్‌ల సంఖ్య పెరగడం.. తద్వారా ఆదాయాన్ని కూడా పెంచుకునేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలో టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్న క్రమంలో స్టార్ ఇండియా, సోనీ, వియాకామ్, అమెజాన్‌ల మధ్య గట్టిపోటీ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా భారత కార్పొరేట్ సంస్థ గోయెంకా గ్రూప్, అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్ లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొత్తం పది జట్లతో ఐపీఎల్ 15వ ఎడిషన్ కొత్త కళను సంతరించుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment