PC: IPL
IPL 2022: ఐపీఎల్ అభిమానులు, క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యపరిచే వార్త ఇది. ఓవైపు క్యాష్ రిచ్‌లీగ్ వాయిదా పడుతుందనే సందేహాలు నెలకొన్న తరుణంలో.. ఏకంగా ఒమిక్రాన్‌కు కేంద్రస్థానంగా భావిస్తున్న దక్షిణాఫ్రికాలోనే మెగా టోర్నీ నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి సిద్ధమైనట్లు సమాచారం. భారత్‌లో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుదల నేపథ్యంలో ఇప్పటికే పలు దేశవాళీ టోర్నీలు వాయిదా పడిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ప్లాన్- బీలో భాగంగా ముంబైలోనే మ్యాచ్‌లన్నీ నిర్వహించాలని బీసీసీఐ తొలుత భావించినట్లు వదంతులు వ్యాపించాయి. అయితే, వాణిజ్య రాజధానిలో రోజురోజుకీ కోవిడ్ ఉధృతమవుతున్న నేపథ్యంలో ఈ ఆలోచనను విరమించుకుందట. అదే సయంలో ఐపీఎల్ 15 ఎడిషన్ వేదికను ఆశ్చర్యకరంగా దక్షిణాఫ్రికాకు మార్చాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీలైతే సౌతాఫ్రికా.. లేదంటే శ్రీలంకను మరో ఆప్షన్‌గా పరిగణిస్తోందట.
కాగా గత సీజన్ మధ్యలోనే కరోనా కారణంగా వాయిదా పడటంలో మిగతా మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్వహించారు. ఒకవేళ ఈసారి కూడా వేదికను మార్చాల్సి వస్తే యూఏఈకే వెళ్లాలని భావించినప్పటికీ.. దక్షిణాఫ్రికాను ఇందుకు ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘యూఏఈ మీద మాత్రమే ఆధారపడలేము కదా. మరిన్ని ఆప్షన్ల కోసం చూస్తున్నాం. సౌతాఫ్రికా కూడా ఆటగాళ్లకు సురక్షితమైనదిగా భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలోనూ దక్షిణాఫ్రికా ఇప్పటికే పలు సిరీస్‌లను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటీవలి ఇండియా ఏ- సౌతాఫ్రికా ఏ జట్ల మధ్య అనధికారిక సిరీస్ కూడా సాఫీగా జరిగిపోయింది. ప్రస్తుతం టెస్టు, వన్డే సిరీస్‌ల నిర్వహణ కూడా సజావుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ వేదికను ప్రొటిస్ దేశానికి మార్చాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
‘‘ప్రస్తుత పర్యటనలో భాగంగా టీమిండియా రెండో టెస్టుకై బస చేసిన ప్రాంతం సువిశాలమైనది. వాకింగ్ ట్రాక్స్ , సరస్సులు ఉన్నాయి. బయోబబుల్‌లో ఉన్నామన్న భావన కలగదు. కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ ఉల్లాసకరమైన వాతావరణం వాటిని మరిపిస్తుంది’’అని సదరు అధికారి చెప్పడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. కాగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో ఐపీఎల్-2022 మెగా వేలం జరుగనున్నది.
చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు
Comments
Please login to add a commentAdd a comment