#MSDhoni: స్వర్ణ యుగం ముగిసింది.. రెండోసారి వదిలేశాడు! | IPL 2024: CSK Dhoni Hands Over Captaincy To Ruturaj End Of Golden Era Fans Reacts- Sakshi
Sakshi News home page

#MSDhoni: స్వర్ణ యుగం ముగిసింది.. గుండె ముక్కలైంది!.. ఆ ఊహే కష్టంగా ఉంది..

Published Thu, Mar 21 2024 5:05 PM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM

IPL 2024 CSK Dhoni Hand Over Captaincy To Rutu End Of Golden Era Fans Reacts - Sakshi

‘‘ఐపీఎల్‌-2024కు ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్సీని ఎంఎస్‌ ధోని రుతురాజ్‌ గైక్వాడ్‌కు అప్పగించాడు’’... కెప్టెన్‌ మార్పుపై ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ సీఎస్‌కే విడుదల చేసిన అధికారిక ప్రకటన ఇది. 

మరే ఇతర జట్టుకు సాధ్యం కాని రీతిలో అత్యధికసార్లు చెన్నైని ఫైనల్‌కు చేర్చి.. ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత మహేంద్ర సింగ్‌ ధోని సొంతం. టీమిండియా కెప్టెన్‌గా ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు అందుకున్న ఈ జార్ఖండ్‌ డైనమైట్‌.. సీఎస్‌కేతో అనుబంధం పెనవేసుకుని ‘తలా’గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

సీఎస్‌కే అంటే ధోని.. ధోని అంటే సీఎస్‌కే అన్న చందంగా చెరగని ముద్ర వేశాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ తొలి సీజన్‌లోనే చెన్నైని ఫైనల్‌కు చేర్చిన ఈ మిస్టర్‌ కూల్‌.. 2010, 2011, 2018, 2021, 2023 సీజన్లలో టైటిల్‌ అందించాడు. అంతేకాదు.. ధోని కెప్టెన్సీలో సీఎస్‌కే 2012, 2013, 2015, 2019లో రన్నరప్‌గానూ నిలిచింది.

ఫిక్సింగ్‌ ఆరోపణల నేపథ్యంలో సీఎస్‌కేపై నిషేధం పడినపుడు మినహా ఐపీఎల్‌ కెరీర్‌ ఆరంభం నుంచీ ఇప్పటిదాకా అదే ఫ్రాంఛైజీతో కొనసాగాడు ధోని. వేలంలో ఆటగాళ్ల కొనుగోలు మొదలు.. మైదానంలో తనదైన వ్యూహాలు అమలు చేయడం దాకా ప్రతీ అంశంలోనూ తానే ముందుండి సీఎస్‌కేను విజయవంతమైన జట్టుగా నిలిపాడు.

అప్పుడే పగ్గాలు వదిలేశాడు.. కానీ
ఆటగాడిగా, వికెట్‌ కీపర్‌గా సత్తా చాటుతూనే కెప్టెన్‌గా మార్కు చూపించిన తలా.. నిజానికి 2022లోనే కెప్టెన్సీ పగ్గాలను వదిలేశాడు. తన వారసుడిగా టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పగించాడు.

కానీ ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపింది. కెప్టెన్‌గా భారాన్ని మోయలేక తీవ్ర ఒత్తిడికి లోనైన జడ్డూ.. ఆల్‌రౌండర్‌గానూ విఫలమై విమర్శల పాలయ్యాడు. 2022లో ఆడిన పది మ్యాచ్‌లలో కేవలం 116 పరుగులు చేసి.. ఐదు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. 

మళ్లీ తనే బాధ్యత తీసుకుని
ఈ క్రమంలో ఆఖరి మ్యాచ్‌లకు కూడా అందుబాటులో లేకుండా పోవడంతో మళ్లీ ధోనినే కెప్టెన్సీ చేపట్టాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచిన సీఎస్‌కే పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.

అభిమానుల హృదయం ముక్కలు
అయితే, చేదు జ్ఞాపకాలను మరిపించేలా 2023లో చెన్నైకి పూర్వవైభవం అందించాడు ధోని. 41 ఏళ్ల వయసులో సీఎస్‌కేను ఐదోసారి చాంపియన్‌గా నిలబెట్టాడు. పెరుగుతున్న వయసు దృష్ట్యా.. భవిష్య కెప్టెన్‌ను తీర్చిదిద్దే క్రమంలో ఐపీఎల్‌-2024లో పూర్తిగా కెప్టెన్సీని వదిలేసి.. మహారాష్ట్ర క్రికెటర్‌, టీమిండియా ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ను తన స్థానంలో సారథిగా తీసుకువచ్చాడు.

ఈ ప్రకటన సీఎస్‌కేతో పాటు ఐపీఎల్‌ సగటు అభిమాని గుండెను కూడా ముక్కలు చేసింది. మైదానంలో పాదరసంలా కదులుతూ తన వ్యూహాలతో క్షణాల్లో ఫలితాన్ని మార్చివేయగల ధోని(అధికారిక కెప్టెన్‌గా)ని ఇక చూడలేమా అంటూ తలా ఫ్యాన్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్పు మంచిదే అయినా.. ఓ స్వర్ణ యుగం ముగిసిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. ధోని పట్ల అభిమానం చాటుకుంటూ వీడియోలు షేర్‌ చేస్తూ అతడి పేరును ట్రెండ్‌ చేస్తున్నారు.

అందుకే కెప్టెన్‌గా రుతురాజ్‌
ఇదిలా ఉంటే.. దేశవాళీ క్రికెట్‌లో మహారాష్ట్రకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రుతురాజ్‌ గైక్వాడ్‌.. ఆసియా క్రీడలు-2023లో టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ఆ ప్రతిష్టాత్మక ఈవెంట్లో భారత్‌కు స్వర్ణ పతకం అందించాడు. ఈ నేపథ్యంలో ధోని వారసుడిగా ఇప్పుడు సీఎస్‌కే పగ్గాలు కూడా చేపట్టడం విశేషం.

చదవండి: IPL 2024: మెరుపులా వచ్చి మాయం!.. ఇకనైనా మారు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement