ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ టీ20ల్లో అత్యంత అరుదైన క్లబ్‌లో చేరాడు. నిన్న (మే 4) గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్దసెంచరీతో ఇరగదీసిన ఇతను.. పొట్టి ఫార్మాట్‌లో 10000 పరుగులు పూర్తి చేసుకున్న 14వ బ్యాటర్‌గా, తొలి సౌతాఫ్రికన్ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
టీ20 కెరీర్‌లో 369 మ్యాచ్‌లు ఆడిన డుప్లెసిస్.. 134.30 స్ట్రయిక్‌రేట్‌తో 32.17 సగటున 10039 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో ఓవరాల్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు.
గేల్ 463 మ్యాచ్‌ల్లో 22 సెంచరీలు, 88 హాఫ్ సెంచరీల సాయంతో 14562 పరుగులు చేశాడు. ఈ జాబితాలో గేల్ తర్వాతి స్థానాల్లో షోయబ్ మాలిక్ (13360), పోలార్డ్ (12900), విరాట్ కోహ్లి (12536), అలెక్స్ హేల్స్ (12319), వార్నర్ (12232), రోహిత్ శర్మ (11482), జోస్ బట్లర్ (11465), ఆరోన్ ఫించ్ (11458), కొలిన్ మున్రో (10961), బాబర్ ఆజమ్ (10620), జేమ్స్ విన్స్ (10451), డేవిడ్ మిల్లర్ (10230), డుప్లెసిస్ ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో చేసిన పరుగులతో కలుపుకుని డుప్లెసిస్ మరో ఘనత సాధించాడు. డుప్లెసిస్ ఆర్సీబీ తరఫున నాలుగో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. ఆర్సీబీకి ముందు సీఎస్‌కేకు ఆడిన డుప్లెసిస్ ఆ ఫ్రాంచైజీ తరఫున మూడో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. డుప్లెసిస్ మెరుపు అర్ద సెంచరీతో చెలరేగడంతో గుజరాత్‌పై ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఆర్సీబీ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది.
గుజరాత్ ఇన్నింగ్స్‌లో షారుక్ ఖాన్ (37), డేవిడ్ మిల్లర్ (30), రాహుల్ తెవాతియా (35) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మిగతా ప్లేయర్లంతా పెవిలియన్‌కు క్యూకట్టారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, యశ్ దయాల్, విజయ్‌కుమార్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కర్ణ్ శర్మ, గ్రీన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. పవర్ ప్లేలో పట్టపగ్గాల్లేకుండా చెలరేగిపోయింది. తొలి ఆరు ఓవర్లలో 92 పరుగులు చేసిన ఆర్సీబీ.. ఆతర్వాత ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయి ఆలౌటయ్యేలా కనిపించింది.
అయితే దినేశ్ కార్తీక్ (21 నాటౌట్).. సప్నిల్ సింగ్ (15 నాటౌట్) సాయంతో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. గుజరాత్ బౌలర్లలో జాషువ లిటిల్ 4 వికెట్లతో విజృంభించగా.. నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో భారీ జంప్ కొట్టి చివరి స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. ఈ ఓటమితో గుజరాత్ తొమ్మిదో స్థానానికి పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment