ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే ఖరీదైన వ్యవహారం. ఫ్రాంఛైజీ యజమానులు వేలంలో రేసు గుర్రాల్లాంటి క్రికెటర్లను సొంతం చేసుకోవడానికి కోట్లకు కోట్లు కుమ్మరించడానికి కూడా వెనకాడరు. సదరు ఆటగాడి అవసరం తమ జట్టుకు ఉందని భావిస్తే ప్రత్యర్థులతో పోటీపడి భారీ మొత్తానికి కొనుగోలు చేస్తారు.
తమ బ్రాండ్ వాల్యూను పెంచుకునేందుకు స్టార్ల కోసం జరిగే వేటలో తగ్గేదేలే అంటూ కనక వర్షం కురిపిస్తారు. అయితే, ఇటీవలి కాలంలో విదేశీ ఆటగాళ్లు, బోర్డుల కారణంగా ఫ్రాంఛైజీలకు తలనొప్పులు ఎక్కువయ్యాయి. చాలా మంది ఆటగాళ్లు సీజన్ ఆరంభానికి ముందే లీగ్ నుంచి తప్పుకొంటుండగా.. మరికొందరు జాతీయ విధుల దృష్ట్యా మధ్యలోనే నిష్క్రమిస్తున్నారు.
అసలు కారణం అదే?!
అయితే, వ్యక్తిగత కారణాలు చూపేవారిలో చాలా మంది తప్పుడు సమాచారమే ఇస్తున్నారని ఫ్రాంఛైజీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వేలంలో అనుకున్నంత సొమ్ము దక్కకపోవడంతోనే చాలా మంది అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ వద్ద వాపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సాకులతో తప్పించుకునే విదేశీ ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీసీఐని కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. ఇటీవల బీసీసీఐ సీఈవో హేమంగ్ అమిన్‌తో ఫ్రాంఛైజీ అధికారులు సమావేశమై.. ఈ విషయం గురించి చర్చించారు. విదేశీ ఆటగాళ్లు తప్పుకొంటున్నామన్న నిర్ణయాన్ని అకస్మాత్తుగా చెప్పడం వల్ల తమ ప్రణాళికలు దెబ్బతింటున్నాయని.. వారి స్థానంలో అప్పటికప్పుడు మరో విదేశీ ప్లేయర్‌ను భర్తీ చేయడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాంటి వారిపై వేటు వేయాలి!
ఈ నేపథ్యంలో సాకులు చెప్పి తప్పించుకునే విదేశీ ఆటగాళ్లపై వేటు వేయాలని విజ్ఞప్తి చేసినట్లు వదంతులు వ్యాపిస్తున్నాయి. కాగా ఐపీఎల్-2024 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ కీలక సమయంలో స్వదేశానికి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో అతడు ఇంగ్లండ్‌కు పయనమయ్యాడు. బట్లర్ లేని లోటు రాయల్స్‌పై తీవ్ర ప్రభావం చూపింది.
ప్లే ఆఫ్స్ చేరకుండానే ఆ జట్టు రేసు నుంచి నిష్క్రమించింది. అయితే, ఇంగ్లండ్ బోర్డు తనను అర్ధంతరంగా వెనక్కి పిలిపించడంపై బట్లర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపించాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో ఐపీఎల్‌లోని పది ఫ్రాంఛైజీల యజమానులు బుధవారం(జూలై 31) బీసీసీతో సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా ఆటగాళ్ల రిటెన్షన్ విధానం, సాలరీ క్యాప్స్, ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన తదితర అంశాల గురించి ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.
పది జట్లు
కాగా పదిహేడేళ్లుగా ఈ క్యాష్ రిచ్ లీగ్ విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ప్రస్తుతం బరిలో ఉన్నాయి.
చదవండి: Ind vs SL: ఇది చాలదు.. ఇంకా కావాలి.. సూర్యకు కంగ్రాట్స్: గంభీర్
NEW FOREIGN PLAYERS RULE. 🚨
- IPL teams have requested the BCCI to take actions against foreign players who withdraw last minute from the season. (Cricbuzz). pic.twitter.com/vJTOmTtOsI— Mufaddal Vohra (@mufaddal_vohra) July 31, 2024
Comments
Please login to add a commentAdd a comment