చాంగ్వాన్ (కొరియా): గురి తప్పని ప్రదర్శనతో భారత యువ షూటర్లు ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తమ పతకాల వేటను కొనసాగిస్తున్నారు. మంగళవారం భారత్‌కు ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్య పతకం లభించాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో తెలంగాణకు చెందిన బధిర షూటర్ ధనుశ్ శ్రీకాంత్, అభినవ్ షా, పార్థ్ రాకేశ్ మానెలతో కూడిన భారత బృందం పసిడి పతకం గెల్చుకుంది.
ధనుశ్ శ్రీకాంత్, అభినవ్, పార్థ్ బృందం మొత్తం 1886.7 పాయింట్లు స్కోరు చేసి అగ్ర స్థానంలో నిలిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో గౌతమి భానోత్, సోనమ్ మస్కర్, స్వాతి చౌధరీలతో కూడిన భారత జట్టు 1886.8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకుంది.
ఆంధ్ర షూటర్ ఉమామహేశ్‌కు కాంస్యం
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ షూటర్ మద్దినేని ఉమామహేశ్ కాంస్య పతకం సాధించాడు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో విజయవాడకు చెందిన ఉమామహేశ్ 229 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచాడు. రొమైన్ అఫ్రెరె (ఫ్రాన్స్; 251.2 పాయింట్లు) స్వర్ణం, హాంగ్‌హావో వాంగ్ (చైనా; 251 పాయింట్లు) రజతం సాధించారు. ఉమామహేశ్‌తోపాటు ఫైనల్లో పోటీపడ్డ అభినవ్ షా 207.2 పాయింట్లతో నాలుగో స్థానంలో, ధనుశ్ శ్రీకాంత్ 164.9 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచారు. 64 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో అభినవ్ షా 631.4 పాయింట్లతో తొలి స్థానంలో, ధనుశ్ శ్రీకాంత్ 629.9 పాయింట్లతో మూడో స్థానంలో, ఉమామహేశ్ 627.9 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు.
మరోవైపు జూనియర్ మహిళల స్కీట్ ఈవెంట్‌లో భారత షూటర్ రైజా ధిల్లాన్ రజత పతకం సాధించింది. ఆరుగురు షూటర్లు పాల్గొన్న ఫైనల్లో రైజా, మిరోస్లావా హకోవా (స్లొవేకియా) 51 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే స్వర్ణ, రజత పతకాల కోసం ‘షూట్ ఆఫ్’ నిర్వహించగా మిరోస్లావా రెండు పాయింట్లు స్కోరు చేసి స్వర్ణం ఖరారు చేసుకోగా... ఒక పాయింట్ సాధించిన రైజాకు రజతం దక్కింది. ప్రస్తుతం భారత్ 4 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి మొత్తం 10 పతకాలతో రెండో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment