రెండు మ్యాచ్ పాయింట్లు కాపాడుకొని ఫైనల్ చేరిన ఇటలీ ప్లేయర్
2 గంటల 51 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్ పోరులో డోనా వెకిచ్‌పై విజయం
రేపు క్రిచికోవాతో వింబుల్డన్ టైటిల్ కోసం అమీతుమీ
లండన్: గత మూడేళ్లు వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టిన ఇటలీ క్రీడాకారిణి జాస్మిన్ పావోలిని... ఈసారి మాత్రం విన్నర్స్ ట్రోఫీని ఇంటికి తీసుకెళ్లేందుకు విజయం దూరంలో ఉంది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన ప్రపంచ ఏడో ర్యాంకర్ జాస్మిన్ వింబుల్డన్ టోర్నీలోనూ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో 28 ఏళ్ల జాస్మిన్ 2 గంటల 51 నిమిషాల్లో 2–6, 6–4, 7–6 (10/8)తో ప్రపంచ 37వ ర్యాంకర్ డోనా వెకిచ్ (క్రొయేషియా)పై గెలిచింది.
రెండో సెమీఫైనల్లో ప్రపంచ 32వ ర్యాంకర్, 2021 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ బర్బొరా క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 2 గంటల 7 నిమిషాల్లో 3–6, 6–3, 6–4తో 2022 విజేత, ప్రపంచ నాలుగో ర్యాంకర్ రిబాకినా (కజకిస్తాన్)పై విజయం సాధించింది. తన కెరీర్‌లో తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది. రేపు జరిగే తుది పోరులో జాస్మిన్‌తో క్రిచికోవా తలపడుతుంది. ఎవరు నెగ్గినా వారికి తొలి వింబుల్డన్ టైటిల్ అవుతుంది.
వెకిచ్‌తో జరిగిన సెమీఫైనల్లో తొలి సెట్‌ను కోల్పోయిన జాస్మిన్ రెండో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్‌లో స్కోరు 4–5 వద్ద... టైబ్రేక్‌లో 5–6 వద్ద జాస్మిన్ రెండుసార్లు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో వింబుల్డన్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో ఫైనల్ చేరిన తొలి ఇటలీ క్రీడాకారిణిగా జాస్మిన్ రికార్డు నెలకొల్పింది.
2 గంటల 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ వింబుల్డన్ చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన మహిళల సెమీఫైనల్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. 2009లో సెరెనా విలియమ్స్ (అమెరికా), ఎలీనా దెమెంతియెవా (రష్యా) మధ్య సెమీఫైనల్ 2 గంటల 49 నిమిషాలు సాగింది. కెరీర్‌లో తొలిసారి సెమీఫైనల్ ఆడిన వెకిచ్ అందివచ్చిన అవకాశాలను చేజార్చుకొని మూల్యం చెల్లించుకుంది. జాస్మిన్ సర్వీస్‌ను బ్రేక్ చేసేందుకు వెకిచ్‌కు 14 సార్లు అవకాశం లభించగా ఆమె నాలుగుసార్లు మాత్రమే సద్వినియోగం చేసుకుంది. 42 విన్నర్స్ కొట్టిన వెకిచ్ ఏకంగా 57 అనవసర తప్పిదాలు చేసింది.
నేడు జరిగే పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అల్‌కరాజ్ (స్పెయిన్)తో మెద్వెదెవ్ (రష్యా); ముసెట్టి (ఇటలీ)తో జొకోవిచ్ (సెర్బియా) ఆడతారు. సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment