కెరీర్‌లో ఏడో మాస్టర్స్ సిరీస్ టైటిల్ గెలిచిన ఇటలీ స్టార్
ఒక్క సెట్ కోల్పోకుండా ‘సన్‌షైన్ డబుల్’ సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డు
ఫ్లోరిడా: ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ చేజార్చుకున్నా... మరోసారి ‘టాప్’ క్లాస్ ఆటతీరును ప్రదర్శించి ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినెర్ కెరీర్‌లో ఏడో మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మయామి ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 సిరీస్ టోర్నీలో ప్రపంచ రెండో ర్యాంకర్ సినెర్ రెండోసారి చాంపియన్‌గా నిలిచాడు.
ఫైనల్లో సినెర్ 6–4, 6–4తో ప్రపంచ 14వ ర్యాంకర్ జిరీ లెహెస్కా (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించాడు. సినెర్‌కు 11,51,380 డాలర్ల (రూ. 10 కోట్ల 89 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ లెహెస్కాకు 6,12,340 డాలర్ల (రూ. 5 కోట్ల 79 లక్షలు) ప్రైజ్‌మనీ, 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
ఓవరాల్‌గా సినెర్ కెరీర్‌లో ఇది 26వ సింగిల్స్ టైటిల్. 93 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో సినెర్ పది ఏస్‌లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేశాడు. తొలి సర్వీస్‌లో 33 పాయింట్లు, రెండో సర్వీస్‌లో తొమ్మిది పాయింట్లు సాధించాడు. మూడుసార్లు తన సర్వీస్ బ్రేక్ పాయింట్లు కాపాడుకున్న ఈ ఇటలీ స్టార్ ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు.
2024లో తొలిసారి మయామి ఓపెన్‌లో టైటిల్ నెగ్గిన సినెర్ గత ఏడాది తనపై విధించిన మూడు నెలల నిషేధం కారణంగా బరిలోకి దిగలేదు. రెండు వారాల క్రితం ఇండియన్ వెల్స్ ఓపెన్‌లో టైటిల్ నెగ్గిన సినెర్ మయామి ఓపెన్‌లోనూ విజేతగా నిలవడం ద్వారా ‘సన్‌షైన్ డబుల్’ సాధించిన ఎనిమిదో ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు.
ఇండియన్ వెల్స్, మయామి ఓపెన్ టోర్నీ టైటిల్స్‌ను వరుసగా గెలిస్తే ‘సన్‌షైన్ డబుల్’గా పరిగణిస్తారు. ఈ రెండు టోర్నీల్లో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా సినెర్ చాంపియన్‌గా నిలిచాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.


