![Kane Williamson beats Virat Kohli in major ODI record](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/kane_0.jpg.webp?itok=Ugk39bzG)
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ముందు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్(Kane Williamson) అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కివీస్ జట్టు ప్రస్తుతం పాకిస్తాన్ వేదికగా మక్కోణపు సిరీస్‌లో తలపడుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో సత్తాచాటిన కేన్ మామ.. సోమవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.
టీ20 తరహాలో తన ఇన్నింగ్స్‌ను కొనసాగించిన విలియమ్సన్ కేవలం 72 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇది విలియమ్సన్‌కు ఐదేళ్ల తర్వాత వచ్చిన వన్డే సెంచరీ కావడం గమనార్హం. ఓవరాల్‌గా 113 బంతులు ఎదుర్కొన్న విలియమ్సన్.. 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 133 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు డెవాన్ కాన్వే(97) కీలక ఇన్నింగ్స్ ఆడారు. దీంతో 305 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 48.4 ఓవర్లలో చేధించింది.
అంతకుమందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో అరంగేట్ర ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్‌కే విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.148 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 150 పరుగులు చేశాడు. అతడితో పాటు వియాన్ ముల్డర్ (64), జాసన్ స్మిత్ (41) కూడా రాణించారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ, ఓ రూర్క్ తలా రెండు వికెట్లు పడగొట్టగా..బ్రాస్‌వెల్ ఓ వికెట్ సాధించాడు.
చరిత్ర సృష్టించిన విలియమ్సన్..
ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 7000 పరుగులు అందుకున్న రెండో బ్యాటర్‌గా విలియమ్సన్ రికార్డులకెక్కాడు. 159 ఇన్నింగ్స్‌లలో కేన్ ఈ ఫీట్ సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు విరాట్ కోహ్లి(161 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కోహ్లి రికార్డును విలియమ్సన్ బ్రేక్ చేశాడు. అయితే కివీస్ తరపున ఈ ఫీట్ సాధించిన తొలి క్రికెటర్ మాత్రం కేన్ మామనే కావడం విశేషం.
వన్డేల్లో అత్యంత వేగంగా 7000 పరుగులు
1. హషీమ్ ఆమ్లా: 150 ఇన్నింగ్స్‌లు
2. కేన్ విలియమ్సన్: 159 ఇన్నింగ్స్‌లు
3. విరాట్ కోహ్లీ: 161 ఇన్నింగ్స్‌లు
4. ఏబీ డివిలియర్స్: 166 ఇన్నింగ్స్‌లు
5. సౌరవ్ గంగూలీ: 174 ఇన్నింగ్స్‌లు
Comments
Please login to add a commentAdd a comment