టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ నియామకం పట్ల సౌతాఫ్రికా మాజీ ఆటగాళ్లు జాక్వెస్ కలిస్, డేల్ స్టెయిన్ హర్షం వ్యక్తం చేశారు. దూకుడైన ఆటకు మారుపేరైన గౌతీ శిక్షకుడిగా కూడా ఆకట్టుకోగలడని ధీమా వ్యక్తం చేశారు.
కాగా భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగియడంతో అతడి స్థానాన్ని బీసీసీఐ గంభీర్‌తో భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి మంగళవారం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది.
శ్రీలంకతో జూలై 26 నుంచి మొదలుకానున్న ద్వైపాక్షిక సిరీస్ నుంచి ఈ మాజీ ఓపెనర్ కోచ్‌గా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. అయితే, గంభీర్ రాకతో సీనియర్ ఆటగాళ్లకు ఇబ్బందులు తప్పవని.. భావి జట్టును తీర్చిదిద్దే క్రమంలో అతడు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సీనియర్ల పట్ల గౌతీ కఠినంగా వ్యవహరించే అవకాశం
ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సహా రవీంద్ర జడేజా వంటి సీనియర్ల పట్ల గౌతీ కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోతే ఎంతటివారినైనా పక్కనపెట్టేందుకు గంభీర్ వెనుకాడడని పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘గౌతం గంభీర్‌ను నేను వీరాభిమానిని. అతడి దూకుడైన స్వభావం నాకెంతో ఇష్టం.
కోహ్లి ఇక ఆడకపోవచ్చు
నేను ఎదుర్కొన్న అత్యంత దూకుడైన భారత ఆటగాళ్లలో అతడూ ఒకడు. డెస్సింగ్ రూంలోనూ అలాంటి వాతావరణమే ఉండాలని కోరుకుంటాడు.
నాకు తెలిసి విరాట్ కోహ్లి వంటి కొంత మంది సీనియర్లు ఇక ఎక్కువ కాలం జట్టులో కొనసాగకపోవచ్చు. వాళ్లను పూర్తిగా పక్కన పెడతాడని చెప్పలేను కానీ.. కచ్చితంగా కఠినంగానే ఉంటాడనిపిస్తోంది’’ అని డేల్ స్టెయిన్ అభిప్రాయపడ్డాడు.
ఇక జాక్వెస్ కలిస్ స్పందిస్తూ.. ‘‘గంభీర్‌ది క్రికెటింగ్ బ్రెయిన్. సరికొత్త వ్యూహాలు రచించగలడు. జట్టులో జోష్ నింపుతాడు. దూకుడుగా ఆడటం తనకు ఇష్టం. జట్టును కూడా అలాగే తయారు చేస్తాడు’’ అని పేర్కొన్నాడు.
చదవండి: WCL 2024: యువరాజ్ మళ్లీ ఫెయిల్.. యూసఫ్, ఇర్ఫాన్ మెరుపులు!
Comments
Please login to add a commentAdd a comment