మాడ్రిడ్: ఈ సీజన్‌లో తమ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ నాలుగో టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది. మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో భాగంగా గురువారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 5–7, 7–6 (7/3), 10–4తో ‘సూపర్ టైబ్రేక్’లో సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జోడీని ఓడించింది.
మాడ్రిడ్ మాస్టర్స్ టోర్నీలో బోపన్న ఫైనల్ చేరడం ఇది మూడోసారి. 2015లో ఈ టోర్నీలో టైటిల్ నెగ్గిన బోపన్న, 2016లో రన్నరప్‌గా నిలిచాడు. ఏడేళ్ల తర్వాత మరోసారి ఈ టోర్నీ లో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ఈ సీజన్‌లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో, దోహా ఓపెన్‌లో టైటిల్ సాధించి, రోటర్‌డామ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది.
బోరిస్ గెల్ఫాండ్‌పై అర్జున్ గెలుపు
టెపి సెగెమన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ శుభారంభం చేశాడు. స్వీడన్‌లో గురువారం మొదలైన ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లు జరుగుతాయి. తొలి రౌండ్‌లో 19 ఏళ్ల అర్జున్ 41 ఎత్తుల్లో ఇజ్రాయెల్ గ్రాండ్‌మాస్టర్ బోరిస్ గెల్ఫాండ్‌పై గెలుపొందాడు. 54 ఏళ్ల గెల్ఫాండ్ 2012 ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో విశ్వనాథన్ ఆనంద్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment