చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
చాంగ్జౌ: భారత యువ షట్లర్ మాళవిక బన్సోద్ చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టో ర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో తనకన్నా ఎక్కువ ర్యాంక్‌లో ఉన్న ప్లేయర్‌ను ఓడించి సత్తా చాటింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 43వ ర్యాంకర్ మాళవిక 21–17, 19–21, 21–16తో రెండుసార్లు కామన్వెల్త్ క్రీడల చాంపియన్ క్రిస్టీ గిల్మోర్ (స్కాట్లాండ్)ను కంగు తినిపించింది.
ప్రపంచ 25వ ర్యాంకర్‌తో జరిగిన ఈ పోరులో ప్రతి గేమ్‌లోనూ ఒక్కో పాయింట్ గెలించేందుకు 22 ఏళ్ల మాళవిక చెమటోడ్చాల్సి వచ్చింది. రెండో గేమ్‌లో ఆఖరిదాకా పోరాడినా... గేమ్‌ను 2 పాయింట్ల తేడాతో కోల్పోయిన భారత షట్లర్ నిర్ణాయక మూడో గేమ్‌లో పుంజుకొని ఆడింది.
ప్రత్యర్థిపై ఆధిక్యాన్ని పెంచుకుంటూ 21–16తో గేమ్‌ను, మ్యాచ్‌ను గెలిచింది. క్వార్టర్ ఫైనల్లో భారత ప్లేయర్‌కు మరింత క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురవుతోంది. శుక్రవారం జపాన్‌కు చెందిన నాలుగో సీడ్ అకానె యామగుచితో మాళవిక తలపడుతుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం మాళవిక మాట్లాడుతూ ‘బీడబ్ల్యూఎఫ్ సూపర్–1000 టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి.
ఓ పెద్దస్థాయి టో ర్నీలో ముందంజ వేయాలన్న నా కల నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. టోర్నీకి ముందే క్వార్టర్స్ చేరితే బాగుండేదనిపించింది. ఇప్పుడు టాప్–8కు అర్హత సంపాదించడం గొప్ప అనుభూతినిస్తోంది’ అని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment