ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధన అదరగొట్టింది. వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో మంధన టాప్-3లోకి ప్రవేశించింది. వన్డే ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరిన మంధన.. టీ20 ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరింది.ఆస్ట్రేలియా, వెస్టిండీస్ సిరీస్‌ల్లో ప్రదర్శనల ఆధారంగా మంధన ర్యాంక్‌లు మెరుగుపడ్డాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో మంధన సూపర్ సెంచరీ (105) చేసింది. తాజాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో మెరుపు అర్ద సెంచరీ (54) సాధించింది.
మరోవైపు వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ ట్యామీ బేమౌంట్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 11వ స్థానానికి చేరగా.. భారత బ్యాటర్ హర్లీన్ డియోల్ తొమ్మిది స్థానాలు మెరుగుపర్చుకుని 64వ స్థానానికి ఎగబాకింది. సౌతాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్ట్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. శ్రీలంక బ్యాటర్ చమారీ ఆటపట్టు, ఇంగ్లండ్ బ్యాటర్ నతాలీ సీవర్ బ్రంట్, ఆసీస్ ప్లేయర్ ఎల్లిస్ పెర్రీ 3, 4, 5 స్థానాల్లో ఉన్నారు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రెండు స్థానాలు కోల్పోయి 13వ స్థానానికి పడిపోయింది.
టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఓ స్థానం మెరుగపర్చుకుని 11వ స్థానానికి చేరగా.. భారత్‌కే చెందిన జెమీమా రోడ్రిగెజ్ ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని 15వ స్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియా ప్లేయర్లు బెత్ మూనీ, తహిళ మెక్‌గ్రాత్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత్‌కు చెందిన దీప్తి శర్మ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని రెండో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లండ్‌కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment