![Manu Bhaker breaks silence on Khel Ratna snub](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/24/manu-2.jpg.webp?itok=01VIZVTY)
దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు నామినీ జాబితాలో పారిస్ ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్, భారత షూటర్ మను భాకర్(Manu Bhaker)కు చోటు దక్కపోయిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ వేదికపై దేశ పతాకాన్ని రెపరెపలాడించిన మనును ప్రతిష్టాత్మక ఖేల్ రత్న(Major Dhyan Chand Khel Ratna) అవార్డుకు నామినెట్ చేయకపోవడం ప్రస్తుతం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ క్రమంలో నామినీల జాబితాలో మను పేరు లేకపోవడంపై ఆమె రామ్ కిషన్ భాకర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కుమార్తెను షూటర్ కాకుండా, క్రికెటర్‌ను చేసి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. అదేవిధంగా తన పేరు లేకపోవడంతో మను కూడా బాధపడిందని కిషన్ భాకర్ వ్యాఖ్యనించారు.
తాజాగా ఈ విషయంపై మను భాకర్ తొలిసారి స్పందించారు. అవార్డుల కంటే దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావడమే తన లక్ష్యమని మను చెప్పకొచ్చారు. "అవార్డుల గురుంచి నేను ఎప్పుడూ ఆలోచించను. ఒక అథ్లెట్‌గా దేశం తరపున ఆడి మరిన్ని పతకాలు తీసుకు రావడమే నా లక్ష్యం.
దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. అనవసరమైన ఊహాగానాలు ప్రచారం చేయవద్దు. నామినేషన్ కోసం అప్లై చేసేటప్పుడు పొరపాటు జరిగిందని అనుకుంటున్నా" ఎక్స్‌లో రాసుకొచ్చారు.
కాగా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రమణ్ నేతృత్వంలోని 12 మంది సభ్యుల బృందం.. భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్‌తో పాటు పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ పేర్లను నామినేట్ చేసింది. ప్యారిస్ ఒలిపింక్స్-2024 షూటింగ్‌లో మను రెండు కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment