తంగవేలు తీన్‌మార్‌    | Paris Paralympics 2024: Mariappan Thangavelu Became First Indian To Medal At Three Consecutive Paralympics | Sakshi
Sakshi News home page

Paris Paralympics 2024: తంగవేలు తీన్‌మార్‌   

Published Thu, Sep 5 2024 3:29 AM | Last Updated on Thu, Sep 5 2024 12:13 PM

Mariappan Thangavelu third consecutive Paralympics medal

వరుసగా మూడో పారాలింపిక్స్‌లో పతకం

ఈ ఘనత సాధించిన తొలి భారత ప్లేయర్‌గా గుర్తింపు  

ఒకటి, రెండు, మూడు... అతని అడుగులు వేగంగా పడ్డాయి. ఎప్పటిలాగే ఒంటి కాలిపై వేగంగా ముందుకు దూసుకుపోయి చేసిన జంప్‌ మరో పారాలింపిక్‌ పతకాన్ని అందించింది. ఒకటి కాదు రెండు కాదు ఇది వరుసగా మూడో పారాలింపిక్‌ మెడల్‌... ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా 29 ఏళ్ల మరియప్పన్‌ తంగవేలు సగర్వంగా నిలిచాడు. 

హైజంప్‌లో ఎదురులేకుండా సాగిన అతను 2016 ‘రియో’లో స్వర్ణం, 2020 ‘టోక్యో’లో రజతం గెలవగా... 2024 ‘పారిస్‌’లో కాంస్యం దక్కింది. ఐదేళ్ల వయసులో అంగవైకల్యాన్ని ఎదుర్కొన్న రోజు నుంచి ఇప్పుడు పారా క్రీడల్లో భారత పతాకాన్ని రెపరెపలాడించే వరకు తంగవేలు సాగించిన ప్రస్థానం అసాధారణం, అందరికీ స్ఫూర్తిదాయం.  

పేదరికానికి చిరునామాలాంటి కుటుంబంలో జన్మించిన తంగవేలుకు అనూహ్యంగా ఎదురైన వైకల్యం కష్టాలతో పాటు అతనిలో పట్టుదలను కూడా పెంచింది. తమిళనాడు సేలం వద్ద ఒక చిన్న గ్రామం అతనిది. ఆరుగురు పిల్లల కుటుంబంలో అతనొకడు. తండ్రి పట్టించుకోకపోవడంతో తల్లి కూలీ పని, ఆపై కూరగాయలు అమ్మి తీవ్ర ఇబ్బందుల మధ్య పిల్లలను పెంచింది. అలాంటి స్థితిలో ఐదేళ్ల వయసులో స్కూల్‌కు వెళుతుండగా బస్సు ఢీకొనడంతో కుడికాలు కింది భాగాన్ని కోల్పోయాడు. శస్త్రచికిత్స తర్వాత కూడా దానిని ఏం చేయలేమని డాక్టర్లు తేల్చేశారు. 

కానీ స్కూల్‌ స్థాయిలో కూడా ఆ చిన్నారి ఎలాంటి బాధను తన దరిచేరనీయలేదు. తనకు స్పోర్ట్స్‌ అంటే చాలా ఇష్టం. అందుకే స్కూల్‌లో ఆ కాలుతోనే అన్ని క్రీడల్లో పాల్గొనేందుకు సిద్ధపడిపోయేవాడు. అన్ని సక్రమంగా ఉన్నవారితో మరీ పోటీ పడి గెలిచేవాడు కూడా. తాను ఎవరికంటే తక్కువ కాదనే భావనను ఇది కలిగించిందని అతను చెప్పుకునేవాడు. వేర్వేరు క్రీడలతో మొదలైనా పీఈటీ సర్‌ సూచన మేరకు హైజంప్‌ను అతను తన గేమ్‌గా మార్చుకున్నాడు. ఇదే జోరులో ఎక్కడ అవకాశం దొరికినా పోటీలో పాల్గొంటూ జాతీయ పారా క్రీడల వరకు తంగవేలు చేరుకున్నాడు.  

దివ్యాంగుల క్రీడల్లో శిక్షణ ఇవ్వడంతో మేటి అయిన సత్యనారాయణ దృష్టిలో పడటం తంగవేలు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆయన శిక్షణలో అసలైన ప్రొఫెషనల్‌ తరహా కోచింగ్‌ తంగవేలుకు లభించింది. ఫలితంగా పారా క్రీడల్లో తంగవేలుకు వరుస విజయాలు దక్కాయి. ఈ క్రమంలో 2016 రియో పారాలింపిక్స్‌కు అర్హత సాధించడంతో అతని గురించి ప్రపంచానికి తెలిసింది. ఇక ఆ తర్వాత ఒలింపిక్‌ పతకం,  వరల్డ్‌ చాంపియన్‌íÙప్‌లో స్వర్ణాలు తంగవేలుకు పేరు తెచ్చిపెట్టాయి.  

క్రీడల్లో గుర్తింపు తెచ్చుకొని కొంత డబ్బు రాగానే అతను కుటుంబ కనీస అవసరాలపైనే దృష్టి పెట్టాడు. ముందుగా అమ్మ కోసం కొంత పొలం కొనడం, ఊర్లో సొంత ఇల్లు కట్టుకోవడంవంటివే చేశాడు. ‘అర్జున’... ‘పద్మశ్రీ’... ‘ఖేల్‌రత్న’ అవార్డుల తర్వాత స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కోచ్‌గా ఉద్యోగం కూడా దక్కడంతో తంగవేలు స్థిరపడ్డాడు. ఇప్పుడు మూడో ఒలింపిక్‌ పతకంతో పారా క్రీడల్లో శాశ్వత కీర్తిని అందుకున్నాడు.

– సాక్షి క్రీడావిభాగం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement