సెమీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్‌.. | Matthew Short doubtful for Australias Champions Trophy semis clash | Sakshi
Sakshi News home page

Champions Trophy: సెమీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్‌..

Published Sat, Mar 1 2025 8:59 AM | Last Updated on Sat, Mar 1 2025 9:47 AM

Matthew Short doubtful for Australias Champions Trophy semis clash

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో గ్రూపు-బి నుంచి  ఆస్ట్రేలియా సెమీఫైన‌ల్‌కు ఆర్హ‌త సాధించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా శుక్ర‌వారం అఫ్గానిస్తాన్‌-ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయింది. దీంతో నాలుగు పాయింట్ల‌తో ఆసీస్ త‌మ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. అయితే సెమీఫైన‌ల్స్‌కు ముందు కంగారుల‌కు భారీ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ ఆల్‌రౌండ‌ర్ మాథ్యూ షార్ట్ గాయం కార‌ణంగా సెమీస్‌కు దూరం కానున్న‌ట్లు తెలుస్తోంది.

షార్ట్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండ‌గా షార్ట్ తొడ కండరాలు ప‌ట్టేశాయి. అయిన‌ప్పటికి సెకెండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చిన షార్ట్ కాస్త ఇబ్బంది ప‌డుతూ క‌న్పించాడు. కేవలం 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 20 పరుగులు చేసి అతడు ఔటయ్యాడు.  కాగా మ్యాచ్ అనంతరం షార్ట్ గాయంపై ఆసీస్ కెప్టెన్ స్టీవ్‌​ స్మిత్‌​​ స్పందించాడు.

"షార్ట్ తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు. అతడు నడవడానికి కాస్త ఇబ్బంది పడడం మేము చూశాము. అయితే నాకౌట్స్‌​ మ్యాచ్‌లు మొదలు కావడానికి ఇంకా మూడు రోజుల సమయం ఉంది. కాబట్టి షార్ట్ తన గాయం నుంచి కోలుకుంటాడని ఆశిస్తున్నాము. అయితే షార్ట్‌​ ఒకవేళ సెమీస్‌కు దూరమైనా, అతడి స్ధానాన్ని భర్తీ చేసేందుకు మా కుర్రాళ్లు సిద్దంగా ఉన్నారని" స్మిత్ పేర్కొన్నాడు.

కాగా సెమీస్‌కు షార్ట్ దూరమైతే ఆసీస్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. అతడికి అద్బుతమైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. ఈ  మెగా టోర్నీలో ఇంగ్లండ్‌పై భారీ లక్ష్యాన్ని ఆసీస్ చేధించడంలో షార్ట్‌ది కూడా కీలక పాత్ర. రన్ ఛేజ్‌లో ఈ ఆసీస్ ఆల్‌రౌండర్ 62 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్‌​ ఆడాడు.

కాగా ఈ మెగా ఈవెంట్‌లో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌, మిచెల్ స్టార్క్‌, జోష్ హాజిల్‌వుడ్ వంటి స్టార్ ప్లేయర్ల సేవలను ఆసీస్ కోల్పోయింది. ఇప్పుడు ఈ జాబితాలోకి షార్ట్ చేరాడు. షార్ట్ స్ధానంలో యువ ఆటగాడు జేక్‌​ ఫ్రేజర్ మెక్‌గర్క్‌​ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది.
చదవండి: ఆసీస్‌తో మ్యాచ్ రద్దు.. అయినా అఫ్గాన్‌కు సెమీస్ చేరే ఛాన్స్‌​! ఎలా అంటే?
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement