డుప్లెసిస్‌ మెరుపు ఇన్నింగ్స్‌.. సూపర్‌ కింగ్స్‌ ఖాతాలో మరో విజయం | MLC 2024: Texas Super Kings Beat Seattle Orcas By 37 Runs | Sakshi
Sakshi News home page

డుప్లెసిస్‌ మెరుపు ఇన్నింగ్స్‌.. సూపర్‌ కింగ్స్‌ ఖాతాలో మరో విజయం

Published Wed, Jul 24 2024 10:06 AM | Last Updated on Wed, Jul 24 2024 10:32 AM

MLC 2024: Texas Super Kings Beat Seattle Orcas By 37 Runs

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ 2024 ఎడిషన్‌లో టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ మరో విజయం సాధించింది. సియాటిల్‌ ఓర్కాస్‌తో ఇవాళ (జులై 24) జరిగిన మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు ఇదివరకే ఖరారు కావడంతో ఈ మ్యాచ్‌ నామమాత్రంగా సాగింది. సూపర్‌ కింగ్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేస్తూ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. అనంతరం ఓర్కాస్‌ను 140 పరుగులకే పరిమితం చేసింది.

మెరుపు ఇన్నింగ్స్‌లతో సత్తా చాటిన డుప్లెసిస్‌, సావేజ్‌
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సూపర్‌ కింగ్స్‌.. డుప్లెసిస్‌ (17 బంతుల్లో 39; 6 ఫోర్లు, సిక్స్‌), సావేజ్‌ (27 బంతుల్లో 45 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో సత్తా చాటడంతో ఓ మోస్తరు స్కోర్‌ చేసింది. విధ్వంసకర బ్యాటర్లు డెవాన్‌ కాన్వే (0), స్టోయినిస్‌ (11) నిరాశపరిచారు. ఓర్కాస్‌ బౌలర్లలో అయాన్‌ దేశాయ్‌, కీమో పాల్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. గానన్‌, నండ్రే బర్గర్‌, బ్రేస్‌వెల్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

రాణించిన బార్ట్‌మన్‌, నూర్‌ అహ్మద్‌
178 పరుగుల లక్ష్య ఛేదనలో ఓర్కాస్‌ దారుణంగా విఫలమైంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 140 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓట్నీల్‌ బార్ట్‌మన్‌ (4-0-20-3), నూర్‌ అహ్మద్‌ (4-0-19-2) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. బ్యాటింగ్‌లో చెలరేగిన సావేజ్‌ బౌలింగ్‌లోనూ (3-0-23-2) సత్తా చాటాడు. మిచెల్‌ సాంట్నర్‌ ఓ వికెట్‌ దక్కింది. ఓర్కాస్‌ ఇన్నింగ్స్‌లో డికాక్‌ (26) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో సంబంధం లేకుండానే సూపర్‌ కింగ్స్‌ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యింది.

ఈ మ్యాచ్‌తో లీగ్‌ మ్యాచ్‌లన్నీ పూర్తయ్యాయి. వాషింగ్టన్‌ ఫ్రీడం, శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌, టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ న్యూయార్క్‌ ప్లే ఆఫ్స్‌కు అ‍ర్హత సాధించాయి. భారతకాలమానం ప్రకారం రేపు ఉదయం జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ పోటీపడతాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement