టీమిండియా అభిమానులకు శుభవార్త. స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఈ విషయాన్ని షమీనే స్వయంగా వెల్లడించాడు. షమీ గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్‌కప్ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆ గాయం నుంచి కోలుకునేందుకు షమీ సర్జరీ చేయించుకున్నాడు.
ప్రస్తుతం షమీ గాయం తాలూకా నొప్పి లేకుండా పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు అప్‌డేట్ ఇచ్చాడు. తాజాగా అతను నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. షమీ తన ఫిట్‌నెస్ పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాడు. సర్జరీ అనంతరం మోకాళ్ల వాపు కారణంగా షమీ పునరాగమనంపై సందేహాలు ఉండేవి. అయితే తాజాగా షమీ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న విధానం చూస్తే ఆ సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. షమీ పూర్తి రన్నప్‌తో మునపటిలా బౌలింగ్ చేశాడు.
Mohammed Shami in action 🔥@MdShami11 pic.twitter.com/qzXHHub4J9
— Subhayan Chakraborty (@CricSubhayan) October 20, 2024
ఆస్ట్రేలియా టూర్‌కు ముందు షమీ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకునేందుకు రంజీ ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నాడు. షమీ బెంగాల్ తరఫున ఒకటి లేదా రెండు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. షమీ రీఎంట్రీ వార్త తెలిసి భారత క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, టీమిండియా నవంబర్ 21 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ సమయానికి స్టార్ పేసర్ షమీ అందుబాటులో ఉండాని భావిస్తున్నాడు. బీజీటీలో ఆడేందుకు షమీ వీలైనంత విరామాన్ని తీసుకుంటున్నాడు. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఈ సిరీస్‌లో ఆడాలన్నది షమీ మనోగతం. ఈ సిరీస్ కోసమని షమీ ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌కు కూడా దూరంగా ఉన్నాడు.
టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ సిరీస్‌లోని రెండో టెస్ట్ మ్యాచ్ పూణే వేదికగా అక్టోబర్ 24 నుంచి ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment