
వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియాను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ ఆటగాడు హసన్ రజాకు.. భారత పేసర్ మహ్మద్ షమీ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఈ మెగా టోర్నీలో బీసీసీఐ, ఐసీసీ కుమ్మక్కై భారత బౌలర్లకు ప్రత్యేక బంతులు ఇస్తున్నాయంటూ హసన్ రజా నిరాధరమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా డీఆర్‌ఎస్‌ని తారుమారు చేయడంలాంటి మోసపూరిత కుట్రలతో టీమిండియా విజయాలు సాధిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఈ నేపథ్యంలో రజా వ్యాఖ్యలకు టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ దిమ్మతిరిగేలా సమాధానమిచ్చాడు. ఇటువంటి నిరాధరమైన ఆరోపణలు చేయడానికి సిగ్గు ఉండాలంటూ మండిపడ్డాడు. "ఇటువంటి చెత్త వ్యాఖ్యలు చేసినందుకు కొంచెం సిగ్గుపడండి. ముందు ఆటపై దృష్టిపెట్టండి. వేరొకరి విజయాన్ని ఆస్వాదించండి. అంతేతప్ప మరొకరిని ద్వేషించడం సరికాదు.
ఇదేమి లోకల్ టోర్నమెంట్ కాదు. ఐసీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వరల్డ్‌కప్. ఇదివరకే మీరు ఇలాంటి చెత్త కామెంట్స్ చేస్తే వసీం అక్రమ్ ఖండించారు. కనీసం మీ సొంత ఆటగాడినైనా నమ్మండి. సొంత డప్పు కొట్టుకోవడంలో బిజీగా ఉన్నారు కదా" అంటూ తన ఇనస్టాగ్రామ్ స్టోరీలో షమీ రాసుకొచ్చాడు. కాగా ఈ మెగా టోర్నీలో షమీ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన షమీ 16 వికెట్లు పడగొట్టాడు. అందులో రెండు ఫైవ్ వికెట్ల హాల్స్ ఉండడం గమనార్హం.
చదవండి: ICC Rankings: మళ్లీ మనోడే నెంబర్ 1.. షాహిన్ ఆఫ్రిదిని వెనక్కినెట్టిన సిరాజ్