వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా మైదానంలో నమాజ్ చేశాడని టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీని కొంతమంది నెటిజన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై స్పందించిన షమీ.. తనపై విమర్శల చేసిన వారికి గట్టి కౌంటరిచ్చాడు. తాను గర్వించదగిన భారత ముస్లింనని, నమాజ్ చేయాలనుకుంటే అడ్డుకునేవారు ఎవరని సీరియస్ అయ్యాడు.
అసలేం ఏం జరిగిందంటే?
వన్డే ప్రపంచకప్‌లో మహ్మద్ షమీ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. కేవలం 7 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టి టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. కాగా ఈ మెగా టోర్నీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లతో చెలరేగాడు. ఈ క్రమంలో తన ఐదు వికెట్ల హాల్‌ను అందుకోగానే షమీ మెకాలిపై కూర్చోని రెండు చేతులతో నేలను తాకుతూ సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. అయితే షమీ సెలబ్రేషన్స్‌ను కొంతమంది అభిమానులు తప్పుబట్టారు. షమీ మైదానంలో నమాజ్ చేశాడని ఆరోపిస్తూ అతడిని ట్రోలు చేశారు.
నన్ను ఆపేవారు ఎవరు?
"నేను నమాజ్ చేయాలనుకుంటే నన్ను ఎవరు అడ్డుకుంటారు? నేను ప్రార్థన చేయాలనుకుంటే చేస్తా. ఇందులో ఉన్న సమస్య ఏంటి? నేను ఒక భారతీయ ముస్లింనని గర్వంగా చెబుతాను. నమాజ్ చేయడానికి ఎవరో అనుమతి తీసుకోవాలంటే.. నేను ఈ దేశంలో ఎందుకు ఉంటాను? ఇంతకు ముందు కూడా నేను చాలా సార్లు 5 వికెట్లు సాధించాను.
అప్పుడు ఎప్పుడైన నేను నమాజ్ చేయడం మీరు చూశారా? ఇటువంటి పిచ్చి పనులు మానుకోండి. నేను ఇప్పుడు ఎక్కడ ప్రార్థన చేయాలో చెప్పండి. అక్కడికి వెళ్లి నమాజ్ చేస్తాను. శ్రీలంకతో మ్యాచ్‌లో వికెట్ల కోసం 200 శాతం ఎఫర్ట్ పెట్టి బౌలింగ్ చేశాను. దీంతో కాస్త అలసటకు గురై మోకాళ్లపై కూర్చున్నాని ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీ పేర్కొన్నాడు. కాగా షమీ ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు సిద్దమవుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment