ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. ప్రపంచ రికార్డుపై గురి పెట్టిన షమీ | Mohammed Shami On The Verge Of Breaking Mitchell Starc ODI Record During ENG Series | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. ప్రపంచ రికార్డుపై గురి పెట్టిన షమీ

Published Tue, Feb 4 2025 9:03 PM | Last Updated on Tue, Feb 4 2025 9:03 PM

Mohammed Shami On The Verge Of Breaking Mitchell Starc ODI Record During ENG Series

ఫిబ్రవరి 6న ఇంగ్లండ్‌తో జరుగబోయే తొలి వన్డేలో టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ (Mohammed Shami) ఓ వరల్డ్‌ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో షమీ ఐదు వికెట్లు తీస్తే.. వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్‌గా వరల్డ్‌ రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఆసీస్‌ స్పీడ్‌స్టర్‌ మిచెల్‌ స్టార్క్‌ (Mitchell Starc) పేరిట ఉంది. స్టార్క్‌ 102 మ్యాచ్‌ల్లో 200 వికెట్లు పూర్తి చేశాడు. షమీ ప్రస్తుతం 100 ఇన్నింగ్స్‌ల్లో 195 వికెట్లు కలిగి ఉన్నాడు.

వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన టాప్‌-5 బౌలర్లు..
మిచెల్‌ స్టార్క్‌-102 మ్యాచ్‌లు
సక్లయిన్‌ ముస్తాక్‌-104 మ్యాచ్‌లు
ట్రెంట్‌ బౌల్ట్‌-107 మ్యాచ్‌లు
బ్రెట్‌ లీ-112 మ్యాచ్‌లు
అలన్‌ డొనాల్డ్‌-117 మ్యాచ్‌లు

కాగా, 2023 వన్డే ప్రపంచ కప్‌ సందర్భంగా గాయపడిన షమీ.. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఫిబ్రవరి 6 నుంచి స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో షమీ వన్డేల్లోకి కూడా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. షమీ చివరిగా ఆడిన వన్డే వరల్డ్‌కప్‌లో కేవలం ఏడు ఇన్నింగ్స్‌ల్లోనే 24 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు ఐదు వికెట్ల ఘనతలు ఉండటం విశేషం. షమీ చెలరేగడంతో భారత్‌ ఆ వరల్డ్‌కప్‌లో ఫైనల్‌ వరకు అజేయంగా చేరింది. అయితే తుది పోరులో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో పరాభవాన్ని ఎదుర్కొంది.

34 ఏళ్ల షమీ రీఎంట్రీ ఇచ్చాక ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో వికెట్లేమీ తీయలేదు. దీంతో అతన్ని నాలుగో టీ20లో పక్కన పెట్టారు. నాలుగో టీ20తో భారత్‌ సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో షమీకి తిరిగి చివరి టీ20లో అవకాశం దక్కింది. ఈ సారి షమీ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో షమీ 3 వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలకప్రాత పోషించాడు.

షమీ.. త్వరలో జరుగబోయే ఛాంపియన్స్‌ ట్రోఫీకి కూడా ఎంపికయ్యాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ షమీపై భారీ అంచనాలే పెట్టుకుంది. ఈ టోర్నీలో షమీ రాణిస్తే పూర్వవైభవం సాధిస్తాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత ప్రయాణం ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. 

ఈ టోర్నీలో భారత్‌, పాక్‌ మ్యాచ్‌ ఫిబ్రవరి 23న జరుగనుంది. ఈ టోర్నీలో భారత్‌ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగనున్నాయి. దీనికి ముందు ఫిబ్రవరి 6న భారత్‌ నాగ్‌పూర్‌ వేదికగా ఇంగ్లండ్‌తో తొలి వన్డే ఆడుతుంది. అనంతరం ఫిబ్రవరి 9, 12 తేదీల్లో రెండు, మూడు వన్డేలు జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లకు కటక్‌, అహ్మదాబాద్‌ వేదికలు కానున్నాయి. ఈ మూడు మ్యాచ్‌లు మధ్యాహ్నం 1:30 గంటల నుంచి ప్రారంభమవుతాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement