
ఇటీవలికాలంలో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు ఇవ్వలేక ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj).. ప్రస్తుతం జరుగుతున్న రంజీ మ్యాచ్‌లోనూ (Ranji Trophy) ఆకట్టుకోలేకపోయాడు. చాలాకాలం తర్వాత హైదరాబాద్ (Hyderabad) తరఫున రంజీ బరిలోకి దిగిన సిరాజ్.. విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో ఒకే ఒక వికెట్‌కు పరిమితమయ్యాడు.
భారీ అంచనాలతో ఈ మ్యాచ్ బరిలోకి దిగిన సిరాజ్ అతి సాధారణ బౌలర్‌లా బౌలింగ్ చేశాడు. కొత్త బంతితో మ్యాజిక్ చేసే సిరాజ్ ఈ మ్యాచ్‌లో తన తొలి 15 ఓవరల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో అతనికి దక్కిన ఏకైక వికెట్ చివరి స్పెల్‌లో లభించింది. ఈ మ్యాచ్ జరుగుతున్న నాగ్‌పూర్ పిచ్ పేసర్లకు సహకరించలేదా అంటే అదేమీ లేదు.
సిరాజ్ సహచర పేసర్లు చింట్ల రక్షన్ రెడ్డి, చామ మిలింద్ కలిపి ఐదు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ రాణించకపోయినా మిగతా బౌలర్లు రాణించి విదర్భను 190 పరుగులకే ఆలౌట్ చేశారు. రక్షన్ రెడ్డి, అనికేత్ రెడ్డి తలో మూడు వికెట్లు పడగొట్టగా.. చామ మిలింద్ రెండు, తనయ్ త్యాగరాజన్ ఓ వికెట్ దక్కించుకున్నారు. విదర్భ ఇన్నింగ్స్‌లో హర్ష్ దూబే (46 బంతుల్లో 65; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.
మెరుపు అర్ద సెంచరీ చేసి జోష్ మీదున్న హర్ష్ దూబేను ఔట్ చేయడమే సిరాజ్‌కు ఊరట కలిగించే అంశం. విదర్భ ఇన్నింగ్స్‌లో హర్ష్‌తో పాటు అక్షయ్ వాద్కర్ (29), దనిష్ మలేవార్ (13), పార్థ్ రేఖడే (23), యశ్ రాథోడ్ (16), యశ్ ఠాకూర్ (17) రెండంకెల స్కోర్లు చేశారు. ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా పరుగుల వరద పారించిన కరుణ్ నాయర్ (3) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 1.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. అభిరథ్ రెడ్డి 5 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 12 పరుగులు చేసి బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. తన్మయ్ అగర్వాల్ ఒక్క పరుగుతో క్రీజ్‌లో ఉన్నాడు.
బీజీటీలోనూ అంతంతమాత్రమే..!
ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ప్రధాన బౌలర్‌గా చలామణి అయిన సిరాజ్.. ఆ సిరీస్‌లో పెద్దగా రాణించలేకపోయాడు. ఈ సిరీస్‌లో సిరాజ్ 5 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీసినప్పటికీ.. జట్టు విజయానికి అతని ప్రదర్శనలు ఏమాత్రం అక్కరకు రాలేదు. బీజీటీలో సిరాజ్ బుమ్రా కంటే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేశాడు. అయినా అతని నుంచి ఆశించిన ఫలితాలు రాలేదు.
2023 ఆరంభంలో మంచి ఫామ్‌లో ఉండిన సిరాజ్ ఆతర్వాత కొంత కాలం పాటు తన ఫామ్‌ను కొనసాగించగలిగాడు. 2023 నుంచి ఇప్పటివరకు 57 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ 27.89 సగటున 104 వికెట్లు తీశాడు. ఈ మధ్యకాలంలో అతను మూడు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. 2023 నుంచి ఇప్పటివరకు 683.5 ఓవర్లు వేసిన సిరాజ్.. ఈ మధ్యకాలంలో అత్యధిక ఓవర్లు వేసిన భారత పేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment