
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన పౌర పురస్కారాల్లో ఏడుగురికి ‘పద్మశ్రీ’ అవార్డులు లభించాయి. ఈ జాబితాలో సుధా సింగ్ (ఉత్తరప్రదేశ్–అథ్లెటిక్స్), మౌమా దాస్ (పశ్చిమ బెంగాల్–టేబుల్ టెన్నిస్), అనిత పాల్‌దురై (తమిళనాడు–బాస్కెట్‌బాల్), వీరేందర్ సింగ్ (హరియాణా–బధిర రెజ్లర్), మాధవన్ నంబియార్ (కేరళ–దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష కోచ్), కేవై వెంకటేశ్ (కర్ణాటక–పారాథ్లెట్), అన్షు జమ్‌సెన్పా (పర్వతారోహకురాలు–అరుణాచల్ ప్రదేశ్) ఉన్నారు. 34 ఏళ్ల సుధా సింగ్ 2010 గ్వాంగ్‌జూ ఆసియా క్రీడల్లో, 2017 ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించింది.
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందిన సుధా సింగ్ 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్ క్రీడల్లోనూ బరిలోకి దిగింది. బెంగాల్‌కు చెందిన 36 ఏళ్ల మౌమా దాస్ 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల టేబుల్ టెన్నిస్ టీమ్ విభాగంలో స్వర్ణం, మహిళల డబుల్స్ విభాగంలో రజతం సాధించింది. భారత్ తరఫున అత్యధికంగా 17 సార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో ఆమె బరిలోకి దిగింది. చెన్నైకి చెందిన 35 ఏళ్ల అనిత పాల్‌దురై భారత మహిళల బాస్కెట్‌బాల్ జట్టుకు ఎనిమిదేళ్లపాటు కెప్టెన్‌గా వ్యవహరించింది. హరియాణాకు చెందిన 34 ఏళ్ల వీరేందర్ సింగ్ 2005, 2013, 2017 బధిర ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు స్వర్ణ పతకాలు అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment