Sudha Singh
-
ధ్యానంతోనే మానసిక ప్రశాంతత
నందిగామ: ధ్యానంతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, తద్వారా ఆరోగ్యంగా ఉంటారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాన్హా విలేజ్‌లోని హార్ట్ఫుల్నెస్ కేంద్రం, కాన్హా శాంతి వనాన్ని (రామచంద్రమిషన్) ఆయన సతీమణి సుద్నాసింగ్ చౌహాన్‌తో కలిసి ఆదివారం సందర్శించారు. గురూజీ కమ్లేష్ పటేల్(దాజీ)తో కలిసి ధ్యానం చేశారు. అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. ధ్యానం చేస్తే ఆనందమయ జీవితాన్ని గడుపుతారన్నారు. మురికి నీటి నుంచి విడిపోయి కమలం వికసించినట్లు జీవితం ఉండాలంటే ధ్యానం ఒక్కటే మార్గమని చెప్పారు. ధ్యానంతో అనేక రుగ్మతలు, ఒత్తిళ్లు దూరం అవుతాయని తెలిపారు. కాన్హా శాంతి వనాన్ని ఏర్పాటు చేసి కమ్లేష్ పటేల్ బీడు భూములను హరిత వనంలా మార్చారని అభినందించారు. కాన్హా శాంతి వనంలో టిష్యూ కల్చర్ ఎంతగానో ఆకర్షించిందన్నారు. మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలోని శుష్క భూములను సైతం హార్ట్ఫుల్నెస్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. గురూజీ కమ్లేష్ పటేల్ మాట్లాడుతూ.. ఆనందం కావాలంటే శాంతి కావాలని, అది ధ్యానంతోనే వస్తుందని అన్నారు. స్వచ్ఛమైన హృదయం కలిగిన వ్యక్తులు మాత్రమే రాజకీయాల్లోకి రావాలని అభిప్రాయపడ్డారు. యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతుండటం ఆందోళన కలిగించే విషయమని కమ్లేష్ పటేల్ అన్నారు. వీటిని అరికట్టేందుకు రూపొందించిన ‘నషా ముక్తి’యాప్‌తో పాటు ‘అవును.. మీరు దీన్ని చేయగలరు’(ఎస్.. యూకెన్ డూ ఇట్) అనే పుస్తకాన్ని శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి ఆవిష్కరించారు. మధ్యప్రదేశ్ పోలీస్ జావ్రా 24వ బెటాలియన్‌లో 6 హెక్టార్లలోని బంజరు భూమిలో 25 వేల మొక్కలు నాటి మినీ ఫారెస్ట్‌గా హార్ట్ఫుల్నెస్ కేంద్రం అభివృద్ధి చేసిందని గురూజీ గుర్తుచేశారు. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్లు, సబ్ సెంటర్లలో గ్రూప్ మెడిటేషన్ల ద్వారా మధ్యప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో వేలాది మంది మానసిక ప్రశాంతత పొందుతున్నారని తెలిపారు. అనంతరం సీఎం దంపతులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో అభ్యాసీలు పాల్గొన్నారు. -
ఏడుగురికి ‘పద్మశ్రీ’...
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన పౌర పురస్కారాల్లో ఏడుగురికి ‘పద్మశ్రీ’ అవార్డులు లభించాయి. ఈ జాబితాలో సుధా సింగ్ (ఉత్తరప్రదేశ్–అథ్లెటిక్స్), మౌమా దాస్ (పశ్చిమ బెంగాల్–టేబుల్ టెన్నిస్), అనిత పాల్దురై (తమిళనాడు–బాస్కెట్‌బాల్), వీరేందర్ సింగ్ (హరియాణా–బధిర రెజ్లర్), మాధవన్ నంబియార్ (కేరళ–దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష కోచ్), కేవై వెంకటేశ్ (కర్ణాటక–పారాథ్లెట్), అన్షు జమ్సెన్పా (పర్వతారోహకురాలు–అరుణాచల్ ప్రదేశ్) ఉన్నారు. 34 ఏళ్ల సుధా సింగ్ 2010 గ్వాంగ్జూ ఆసియా క్రీడల్లో, 2017 ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించింది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందిన సుధా సింగ్ 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్ క్రీడల్లోనూ బరిలోకి దిగింది. బెంగాల్‌కు చెందిన 36 ఏళ్ల మౌమా దాస్ 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల టేబుల్ టెన్నిస్ టీమ్ విభాగంలో స్వర్ణం, మహిళల డబుల్స్ విభాగంలో రజతం సాధించింది. భారత్ తరఫున అత్యధికంగా 17 సార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో ఆమె బరిలోకి దిగింది. చెన్నైకి చెందిన 35 ఏళ్ల అనిత పాల్దురై భారత మహిళల బాస్కెట్‌బాల్ జట్టుకు ఎనిమిదేళ్లపాటు కెప్టెన్‌గా వ్యవహరించింది. హరియాణాకు చెందిన 34 ఏళ్ల వీరేందర్ సింగ్ 2005, 2013, 2017 బధిర ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు స్వర్ణ పతకాలు అందించాడు. -
ముంబై మారథాన్‌లో మెరిసిన సుధా సింగ్
ముంబై: భారత అథ్లెట్లు సుధా సింగ్, నితేంద్ర సింగ్ రావత్ ముంబై మారథాన్‌లో మెరిశారు. మహిళల, పురుషుల విభాగాల్లో భారత్ తరఫున మెరుగైన స్థానంలో నిలిచారు. సుధ 2 గంటల 34 నిమిషాల 56 సెకన్లలో పరుగును పూర్తిచేసి దోహాలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం నిర్దేశించిన 2:37:00 క్వాలిఫయింగ్ మార్క్‌ను అధిగమించింది. రావత్ 2:15:52 సెకన్ల టైమింగ్‌తో మెరిశాడు. పురుషుల కేటగిరీలో 2:16:00 క్వాలిఫయింగ్ మార్క్‌ను నితేంద్రసింగ్ అధిగమించాడు. ఈ మారథాన్‌లో కాస్మస్ లగత్ (కెన్యా; 2:09:15) పురుషుల విభాగంలో విజేతగా నిలువగా... మహిళల కేటగిరీలో వర్క్నెష్ అలెము (ఇథియోపియా; 2:25:45) గెలిచింది. -
చేత కాకపోతే చెప్పండి: ఏషియన్ గేమ్స్ విజేత
సాక్షి, లక్నో: క్రీడాకారులు పతకాలు సాధించిన వెంటనే.. ప్రభుత్వాలు వారిపై వరాల జల్లు కురిపిస్తాయి. కొద్ది రోజులపాటు మీడియాలో హడావుడి చేసి, కావాల్సిన పబ్లిసిటి వచ్చాక అసలు విషయాన్ని మరిచిపోతాయి. ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగం, నగదు కోసం క్రీడాకారులు పోటీల్లో పరుగులు తీసినట్టు ఆఫీసుల చుట్టు పరుగులు తీస్తుంటారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితే ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వెటరన్ లాంగ్ డిస్టెన్స్ రన్నర్ సుధా సింగ్‌కు ఎదురైంది. ఆసియా గేమ్స్ 2018లో రజతం సాధించిన ఈ క్రీడాకారిణికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ముప్పై లక్షల నగదుతో పాటు, క్రీడా శాఖలో అత్యున్నత ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. తాజాగా మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం యోగితో పాటు ఆ రాష్ట్ర గవర్నర్ రామ్ నాయక్ సుధాకు 30 లక్షల చెక్‌ను అందచేయగా.. ఆమె తిరస్కరించారు. తనకు కావాల్సింది డబ్బు కాదని ఉద్యోగమని సభా వేదికగా డిమాండ్ చేశారు. అనంతరం అధికారులు, యోగి బుజ్జగించాక చెక్ తీసుకున్నారు. కానీ ఉద్యోగం ఇవ్వకపోతే చెక్ వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటించారు. గతంలో కూడా.. 2015లో కూడా అప్పటి ప్రభుత్వం క్రీడా శాఖలో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి సీఎంను మూడు సార్లు కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆగ్రహించారు. తాను రైల్వే శాఖలో మంచి ఉద్యోగం చేస్తున్నప్పటికీ రాష్ట్ర క్రీడా శాఖలో ఉద్యోగం చేయాలనే కోరిక ఉందని, యువ ఆటగాళ్లకు చేయుతనివ్వాలనే ఉద్దేశంతోనే ఆ ఉద్యోగాన్ని కోరుకుంటున్నానని తెలిపారు. క్రీడాకారుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపడం సరికాదన్నారు. తనకు ఇచ్చిన నగదును యువ క్రీడాకారుల శిక్షణ కోసం ఖర్చు చేస్తానని పేర్కొన్నారు. ఇవ్వడం సాధ్యం కాకపోతే చెప్పండి.. తనకు క్రీడా శాఖలో ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు చెబితే తను వేరే ప్రత్యామ్నాయం చూసుకుంటానని, యూపీ నుంచి ప్రాతినిథ్యం వహించబోనని స్పష్టం చేశారు. తొమ్మిది సార్లు జాతీయ చాంపియన్, ఆసియన్ గేమ్స్‌లో బంగారు, రజత పతకాలు, అర్జున అవార్డు సాధించిన తాను ప్రభుత్వ ఉద్యోగానికి పనికిరానా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చదవండి: సుధా సింగ్‌కు యూపీ ప్రభుత్వ ఉద్యోగం -
సుధా సింగ్‌కు యూపీ ప్రభుత్వ ఉద్యోగం
లక్నో: వెటరన్ లాంగ్ డిస్టెన్స్ రన్నర్ సుధా సింగ్‌కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వనుంది. 32 ఏళ్ల సుధా... సోమవారం 3 వేల మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో రజతం నెగ్గింది. దీంతో ఆమెకు రూ.30 లక్షల ప్రోత్సాహక నగదుతో పాటు గెజిటెడ్ హోదాతో కొలువు ఇవ్వనున్నట్లు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. అయితే, దీనిపై సుధా సింగ్ ఒకింత నిర్వేదంతో స్పందించింది. ‘నాకెలాంటి సంతోషమూ, నిరుత్సాహమూ లేదు. 2010 ఏషియాడ్‌లోనే స్వర్ణం గెలిచాను. ఆసియా చాంపియన్‌షిప్‌లలో కూడా పతకాలు నెగ్గాను. ప్రపంచ చాంపియన్‌షిప్, ఒలింపిక్స్‌లోనూ ప్రాతినిధ్యం వహించాను. ఈ ఉద్యోగం ఇంతకుముందే రావాల్సింది. క్రీడా కోటాలో నియామకానికి సంబంధించి నాలుగేళ్లుగా నా ఫైల్ అపరిష్కృతంగా ఉంది. అప్పుడు కాకున్నా, ఇప్పుడు ఇవ్వడం కొంతలో కొంత ఉపశమనం. క్రీడా శాఖలో మాత్రమే ఉద్యోగం చేస్తా. ఇతర శాఖల్లో చేయను’ అని పేర్కొంది. సుధా ప్రస్తుతం రైల్వే శాఖ ఉద్యోగి. 2015లో యూపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఆమెకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం రావాల్సి ఉంది. దీనిపై మూడుసార్లు నాటి సీఎంను కలిసినా ఉపయోగం లేకపోయిందని ఆమె సోదరుడు పర్వేష్ తెలిపాడు. -
సుధా సింగ్ పేరు ఉన్నట్టా.. లేనట్టా?
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడంపై సందేహాలు న్యూఢిల్లీ : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత క్రీడాకారుల ఎంపికపై రోజుకో వివాదం చెలరేగుతోంది. పీయూ చిత్ర వ్యవహారం ముగిసిందనుకోగానే... తాజాగా 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ అథ్లెట్ సుధా సింగ్ వార్తల్లో నిలిచింది. ఇటీవల భువనేశ్వర్‌లో ముగిసిన ఆసి యా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో సుధా స్వర్ణం సాధిం చింది. అయితే ప్రపంచ పోటీల కోసం భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ఎంపిక చేసిన 24 మందిలో ఆమె పేరును పరిగణలోకి తీసుకోలేదు. అయితే ఆశ్చర్యకరంగా శనివారం రాత్రి అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) విడుదల చేసిన భారత అథ్లెట్ల జాబితాలో మాత్రం సుధా పేరు కూడా ఉంది. ‘ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల ఎంట్రీ జాబితాలో నేను కూడా ఉన్నట్టు తెలిసింది. అయితే నిజంగా నేను జట్టులో ఉన్నానా? లేదా? అనే విషయంలో ఏఎఫ్ఐ నుంచి ఎటువంటి సమాచారం లేదు. కానీ ఏ క్షణమైనా లండన్ వెళ్లేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఈనెల 23న ఏఎఫ్ఐ పంపిన జాబితాలోనైతే నా పేరు లేదు. ఆ తర్వాత జత పరిచారేమో. అందుకే నేను న్యాయపోరాటానికి వెళ్లదలుచుకోలేదు’ అని సుధా సింగ్ తెలిపింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 31 ఏళ్ల సుధా సింగ్ 2010 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించి వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత లండన్, రియో ఒలింపిక్స్‌లోనూ బరిలోకి దిగింది. 2013 (మాస్కో), 2015 (బీజింగ్) ప్రపంచ చాంపియన్‌షిప్‌లలోనూ పాల్గొన్న ఆమె వరుసగా 23వ, 19వ స్థానాల్లో నిలిచింది. ఇంతకుముందు ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 1500 మీటర్ల రేసులో స్వర్ణం నెగ్గిన పీయూ చిత్ర పేరును కూడా ఏఎఫ్ఐ ఎంపిక చేయకపోవడంతో ఆమె కేరళ హైకోర్టులో రిట్ పిటిషన్ ధాఖలు చేసింది. దీంతో కోర్టు ఆమెను ఎంపిక చేయాలని ఆదేశించింది. ఐఏఏఎఫ్ అర్హత ప్రమాణాలను అందుకోలేకపోయినందుకే చిత్ర, సుధా సింగ్, అజయ్ కుమార్ సరోజ్ (పురుషుల 1500 మీటర్లలో స్వర్ణం) పేర్లను జాబితాలో చేర్చలేదని ఏఎఫ్ఐ గతంలోనే పేర్కొంది. ‘సుధ జట్టులో లేదు’ ఇక ఐఏఏఎఫ్ జాబితా ఎలా ఉన్నా ఏఎఫ్ఐ డి ప్యూటీ జాతీయ కోచ్ రాధాక్రిష్ణన్ నాయర్ మాత్రం సుధా జట్టులో లేదని ఖరాఖండిగా తేల్చారు. ప్రస్తుతం ఆయన అథ్లెట్లతో పాటు లండన్‌లోనే ఉన్నారు. నిజం గానే ఏఎఫ్ఐ సుధా పేరును చేర్చిందా.. లేక ఐఏఏఎఫ్ జాబితాలో ఏదైనా పొరపాటు జరిగిందా అనే విషయంలో ఎటువంటి స్పష్టత కనిపించడం లేదు. ఈ విషయంలో వివరణ ఇచ్చేందుకు ఏఎఫ్ఐ అధికారులెవరూ ముందుకు రావడం లేదు. అయితే ఆన్లైన్ ద్వారా పంపాల్సిన ఈ జాబితాలో సుధా పేరును తొలగించకుండానే ఐఏఏఎఫ్‌కు పంపి ఉండవచ్చని ఏఎఫ్ఐ వర్గాలు తెలిపాయి. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ లండన్‌లో ఆగస్టు 4 నుంచి 13 వరకు జరుగుతుంది. -
‘స్వర్ణ’ సుధ...
♦ మహిళల 3000 మీటర్ల ♦ స్టీపుల్‌చేజ్‌లో పసిడి పతకం ♦ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ భువనేశ్వర్: ఎట్టకేలకు భారత అథ్లెట్ సుధా సింగ్ అనుకున్నది సాధించింది. తాను పాల్గొన్న గత మూడు ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లలో స్వర్ణ పతకాన్ని నెగ్గలేకపోయిన సుధా సింగ్... స్వదేశంలో తన లక్ష్యాన్ని అందుకుంది. సుధా సింగ్ అద్వితీయ ప్రతిభ కారణంగా ఈ మెగా ఈవెంట్లో వరుసగా మూడో రోజు భారత్ ఖాతాలో స్వర్ణం చేరింది. శనివారం భారత్‌కు లభించిన ఏకైక పసిడి పతకం సుధానే అందించడం విశేషం. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్ ఫైనల్ రేసును ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుధా సింగ్ 9 నిమిషాల 59.47 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. గత మూడు ఆసియా చాంపియన్‌షిప్‌లలో రజత పతకాలు గెలిచిన 31 ఏళ్ల సుధా తాజా ప్రదర్శనతో వరుసగా మూడోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. మరోవైపు మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో అను రాఘవన్ (57.22 సెకన్లు) రజత పతకాన్ని గెలుపొందగా... పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో ఎం.పి.జబీర్ (50.22 సెకన్లు) కాంస్యం సాధించాడు. మహిళల ట్రిపుల్ జంప్‌లో ఎన్.వి. షీనా (13.42 మీటర్లు) కాంస్యం దక్కించుకుంది. మెర్లీన్ జోసెఫ్, హిమశ్రీ రాయ్, శ్రాబణి నందా, ద్యుతీ చంద్‌లతో కూడిన భారత మహిళల బృందం 4గీ100 మీటర్ల రిలేలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. మూడో రోజు పోటీలు ముగిశాక భారత్ 7 స్వర్ణాలు, 4 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి మొత్తం 20 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
భారత అథ్లెట్ సుధాకు 'జికా'పరీక్షలు!
రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత అథ్లెట్ సుధా సింగ్ తీవ్ర జ్వరానికి గురి కావడంతో ఆమెకు జికా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒలింపిక్స్ ముగిసిన అనంతరం బెంగుళూరులోని స్పోర్ట్స్ అథారిటీ హాస్టల్‌కు చేరిన సుధా సింగ్‌కు విపరీతమైన జ్వరం వచ్చింది. దాంతోపాటు బాగా నీరసించిపోవడంతో ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం నగరంలోని ఫోర్టిస్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే దోమ కాటు ద్వారా వచ్చే డెంగ్యూ, చికెన్‌గున్యాలు ఆమెకు సోకలేదని లేదని అక్కడ చేసిన టెస్టుల్లో తేలింది. కాగా, బ్రెజిల్ లో జికా వైరస్ తీవత్ర హెచ్చుగా ఉండటంతో ఆ మేరకు టెస్టులు కూడా చేయాలని డాక్టర్లు భావించారు. దానిలో భాగంగా ఆమె రక్త నమూనాను పుణెలోని జికా వైరస్ ఇనిస్టిట్యూట్‌కు పంపారు. మంగళవారం ఈ వైరస్‌కు సంబంధించిన టెస్టులు పూర్తయిన తరువాత రిపోర్ట్ వెల్లడిస్తామని కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ హర్షవర్థన్ తెలిపారు. రియో ఒలింపిక్స్‌లో సుధా సింగ్ మూడు వేల మీటర్ల స్టీపల్ చేజ్లో పాల్గొంది. -
స్టీపుల్‌చేజ్ ఫైనల్లో లలిత
-
స్టీపుల్‌చేజ్ ఫైనల్లో లలిత
రియో డి జనీరో: జాతీయ రికార్డును బద్దలు కొట్టిన భారత మహిళా అథ్లెట్ లలితా శివాజీ బబర్ రియో ఒలింపిక్స్‌లో 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌లో హీట్-2లో పాల్గొన్న లలిత 9 నిమిషాల 19.76 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంలో నిలిచింది. 9 నిమిషాల 26.55 సెకన్లతో సుధా సింగ్ పేరిట ఉన్న జాతీయ రికార్డును లలిత తిరగరాసింది. హీట్-3లో బరిలోకి దిగిన భారత్‌కే చెందిన మరో అథ్లెట్ సుధా సింగ్ 9 నిమిషాల 43.29 సెకన్లలో లక్ష్యానికి చేరి తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా లలిత ఏడో స్థానంలో, సుధా సింగ్ 30వ స్థానంలో నిలిచారు. మొత్తం 15 మంది పాల్గొనే ఫైనల్ రేసు సోమవారం (15న) జరుగుతుంది. తాజా ఫలితంతో లలిత బబర్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ చరిత్రలో భారత్ నుంచి ఫైనల్‌కు చేరిన ఎనిమిదో అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. గతంలో మిల్కా సింగ్, గుర్బచన్ సింగ్ రణ్ధావ, శ్రీరామ్ సింగ్, పీటీ ఉష, అంజూ బాబీ జార్జ్ (లాంగ్‌జంప్), కృష్ణ పూనియా (డిస్కస్ త్రో), వికాస్ గౌడ (డిస్కస్ త్రో) మాత్రమే భారత్ నుంచి ఫైనల్ ఈవెంట్‌కు అర్హత సాధించారు. హీట్స్‌లో ద్యుతీ చంద్ అవుట్ మహిళల 100 మీటర్ల విభాగంలో ద్యుతీ చంద్ హీట్స్‌లోనే వెనుదిరిగింది. హీట్-5లో పాల్గొన్న ద్యుతీ 11.69 సెకన్లలో రేసును పూర్తి చేసి ఏడో స్థానంలో నిలిచింది. పురుషుల 400 మీటర్ల విభాగంలో అనస్ హీట్-7లో పాల్గొని 45.95 సెకన్లలో గమ్యానికి చేరుకొని ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల లాంగ్‌జంప్‌లో అంకిత్ శర్మ (7.67 మీటర్లు) 12వ స్థానంలో, మహిళల 400 మీటర్ల విభాగంలో నిర్మల 44వ స్థానంలో నిలిచింది. మహిళల హాకీ జట్టుకు నిరాశ 36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌కు అర్హత పొందిన భారత మహిళల హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమైంది. అర్జెంటీనాతో జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 0-5 గోల్స్ తేడాతో ఓడిపోయింది. తమ గ్రూప్‌లో చివరిదైన ఆరో స్థానంతో సంతృప్తి పడింది. షూటర్లకు దురదృష్టం షూటింగ్ విభాగంలో భారత్‌కు మళ్లీ నిరాశే మిగిలింది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ క్వాలిఫయింగ్‌లో గుర్ప్రీత్ సింగ్ 581 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచాడు. టాప్-6లో నిలిచిన వారే ఫైనల్‌కు చేరుతారు. పురుషుల స్కీట్ విభాగంలో మేరాజ్ అహ్మద్ ఖాన్ ‘షూట్ ఆఫ్’లో విఫలమై సెమీఫైనల్‌కు చేరుకోలేకపోయాడు. రోయర్ దత్తూకు 15వ స్థానం రోయింగ్‌లో దత్తూ బబన్ భోకనాల్ ఓవరాల్‌గా 15వ స్థానంలో నిలిచాడు. సింగిల్ స్కల్స్ ర్యాంకింగ్ రేసులో దత్తూ 6 నిమిషాల 54.96 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానంలో నిలిచాడు. ఓటమితో ముగించిన జ్వాల జంట మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్న జంట చివరిదైన మూడో మ్యాచ్‌లో 17-21, 15-21 తో పుట్టిటా-సప్సిరి (థాయ్‌లాండ్) జోడీ చేతిలో ఓడింది.