సుధా సింగ్ పేరు ఉన్నట్టా.. లేనట్టా?
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడంపై సందేహాలు
న్యూఢిల్లీ : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత క్రీడాకారుల ఎంపికపై రోజుకో వివాదం చెలరేగుతోంది. పీయూ చిత్ర వ్యవహారం ముగిసిందనుకోగానే... తాజాగా 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ అథ్లెట్ సుధా సింగ్ వార్తల్లో నిలిచింది. ఇటీవల భువనేశ్వర్‌లో ముగిసిన ఆసి యా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో సుధా స్వర్ణం సాధిం చింది. అయితే ప్రపంచ పోటీల కోసం భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) ఎంపిక చేసిన 24 మందిలో ఆమె పేరును పరిగణలోకి తీసుకోలేదు. అయితే ఆశ్చర్యకరంగా శనివారం రాత్రి అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) విడుదల చేసిన భారత అథ్లెట్ల జాబితాలో మాత్రం సుధా పేరు కూడా ఉంది.
‘ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల ఎంట్రీ జాబితాలో నేను కూడా ఉన్నట్టు తెలిసింది. అయితే నిజంగా నేను జట్టులో ఉన్నానా? లేదా? అనే విషయంలో ఏఎఫ్‌ఐ నుంచి ఎటువంటి సమాచారం లేదు. కానీ ఏ క్షణమైనా లండన్ వెళ్లేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఈనెల 23న ఏఎఫ్‌ఐ పంపిన జాబితాలోనైతే నా పేరు లేదు. ఆ తర్వాత జత పరిచారేమో. అందుకే నేను న్యాయపోరాటానికి వెళ్లదలుచుకోలేదు’ అని సుధా సింగ్ తెలిపింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 31 ఏళ్ల సుధా సింగ్ 2010 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించి వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత లండన్, రియో ఒలింపిక్స్‌లోనూ బరిలోకి దిగింది. 2013 (మాస్కో), 2015 (బీజింగ్) ప్రపంచ చాంపియన్‌షిప్‌లలోనూ పాల్గొన్న ఆమె వరుసగా 23వ, 19వ స్థానాల్లో నిలిచింది. ఇంతకుముందు ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 1500 మీటర్ల రేసులో స్వర్ణం నెగ్గిన పీయూ చిత్ర పేరును కూడా ఏఎఫ్‌ఐ ఎంపిక చేయకపోవడంతో ఆమె కేరళ హైకోర్టులో రిట్ పిటిషన్ ధాఖలు చేసింది. దీంతో కోర్టు ఆమెను ఎంపిక చేయాలని ఆదేశించింది. ఐఏఏఎఫ్ అర్హత ప్రమాణాలను అందుకోలేకపోయినందుకే చిత్ర, సుధా సింగ్, అజయ్ కుమార్ సరోజ్ (పురుషుల 1500 మీటర్లలో స్వర్ణం) పేర్లను జాబితాలో చేర్చలేదని ఏఎఫ్‌ఐ గతంలోనే పేర్కొంది.
‘సుధ జట్టులో లేదు’
ఇక ఐఏఏఎఫ్ జాబితా ఎలా ఉన్నా ఏఎఫ్‌ఐ డి ప్యూటీ జాతీయ కోచ్ రాధాక్రిష్ణన్ నాయర్ మాత్రం సుధా జట్టులో లేదని ఖరాఖండిగా తేల్చారు. ప్రస్తుతం ఆయన అథ్లెట్లతో పాటు లండన్‌లోనే ఉన్నారు. నిజం గానే ఏఎఫ్‌ఐ సుధా పేరును చేర్చిందా.. లేక ఐఏఏఎఫ్ జాబితాలో ఏదైనా పొరపాటు జరిగిందా అనే విషయంలో ఎటువంటి స్పష్టత కనిపించడం లేదు. ఈ విషయంలో వివరణ ఇచ్చేందుకు ఏఎఫ్‌ఐ అధికారులెవరూ ముందుకు రావడం లేదు. అయితే ఆన్‌లైన్ ద్వారా పంపాల్సిన ఈ జాబితాలో సుధా పేరును తొలగించకుండానే ఐఏఏఎఫ్‌కు పంపి ఉండవచ్చని ఏఎఫ్‌ఐ వర్గాలు తెలిపాయి. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ లండన్‌లో ఆగస్టు 4 నుంచి 13 వరకు జరుగుతుంది.