‘స్వర్ణ’ సుధ...
♦ మహిళల 3000 మీటర్ల
♦ స్టీపుల్‌చేజ్‌లో పసిడి పతకం
♦ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్
భువనేశ్వర్: ఎట్టకేలకు భారత అథ్లెట్ సుధా సింగ్ అనుకున్నది సాధించింది. తాను పాల్గొన్న గత మూడు ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లలో స్వర్ణ పతకాన్ని నెగ్గలేకపోయిన సుధా సింగ్... స్వదేశంలో తన లక్ష్యాన్ని అందుకుంది. సుధా సింగ్ అద్వితీయ ప్రతిభ కారణంగా ఈ మెగా ఈవెంట్‌లో వరుసగా మూడో రోజు భారత్ ఖాతాలో స్వర్ణం చేరింది. శనివారం భారత్‌కు లభించిన ఏకైక పసిడి పతకం సుధానే అందించడం విశేషం. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్ ఫైనల్ రేసును ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుధా సింగ్ 9 నిమిషాల 59.47 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. గత మూడు ఆసియా చాంపియన్‌షిప్‌లలో రజత పతకాలు గెలిచిన 31 ఏళ్ల సుధా తాజా ప్రదర్శనతో వరుసగా మూడోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది.
మరోవైపు మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో అను రాఘవన్ (57.22 సెకన్లు) రజత పతకాన్ని గెలుపొందగా... పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో ఎం.పి.జబీర్ (50.22 సెకన్లు) కాంస్యం సాధించాడు. మహిళల ట్రిపుల్ జంప్‌లో ఎన్.వి. షీనా (13.42 మీటర్లు) కాంస్యం దక్కించుకుంది. మెర్లీన్ జోసెఫ్, హిమశ్రీ రాయ్, శ్రాబణి నందా, ద్యుతీ చంద్‌లతో కూడిన భారత మహిళల బృందం 4గీ100 మీటర్ల రిలేలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. మూడో రోజు పోటీలు ముగిశాక భారత్ 7 స్వర్ణాలు, 4 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి మొత్తం 20 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.