గురూజీ కమ్లేష్ పటేల్‌తో కలిసి ధ్యానం చేస్తున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ దంపతులు
నందిగామ: ధ్యానంతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, తద్వారా ఆరోగ్యంగా ఉంటారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాన్హా విలేజ్‌లోని హార్ట్‌ఫుల్‌నెస్ కేంద్రం, కాన్హా శాంతి వనాన్ని (రామచంద్రమిషన్) ఆయన సతీమణి సుద్నాసింగ్ చౌహాన్‌తో కలిసి ఆదివారం సందర్శించారు. గురూజీ కమ్లేష్ పటేల్(దాజీ)తో కలిసి ధ్యానం చేశారు. అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. ధ్యానం చేస్తే ఆనందమయ జీవితాన్ని గడుపుతారన్నారు.
మురికి నీటి నుంచి విడిపోయి కమలం వికసించినట్లు జీవితం ఉండాలంటే ధ్యానం ఒక్కటే మార్గమని చెప్పారు. ధ్యానంతో అనేక రుగ్మతలు, ఒత్తిళ్లు దూరం అవుతాయని తెలిపారు. కాన్హా శాంతి వనాన్ని ఏర్పాటు చేసి కమ్లేష్ పటేల్ బీడు భూములను హరిత వనంలా మార్చారని అభినందించారు. కాన్హా శాంతి వనంలో టిష్యూ కల్చర్ ఎంతగానో ఆకర్షించిందన్నారు. మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలోని శుష్క భూములను సైతం హార్ట్‌ఫుల్‌నెస్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. గురూజీ కమ్లేష్ పటేల్ మాట్లాడుతూ.. ఆనందం కావాలంటే శాంతి కావాలని, అది ధ్యానంతోనే వస్తుందని అన్నారు.
స్వచ్ఛమైన హృదయం కలిగిన వ్యక్తులు మాత్రమే రాజకీయాల్లోకి రావాలని అభిప్రాయపడ్డారు. యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతుండటం ఆందోళన కలిగించే విషయమని కమ్లేష్ పటేల్ అన్నారు. వీటిని అరికట్టేందుకు రూపొందించిన ‘నషా ముక్తి’యాప్‌తో పాటు ‘అవును.. మీరు దీన్ని చేయగలరు’(ఎస్.. యూకెన్ డూ ఇట్) అనే పుస్తకాన్ని శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి ఆవిష్కరించారు.
మధ్యప్రదేశ్ పోలీస్ జావ్రా 24వ బెటాలియన్‌లో 6 హెక్టార్లలోని బంజరు భూమిలో 25 వేల మొక్కలు నాటి మినీ ఫారెస్ట్‌గా హార్ట్‌ఫుల్‌నెస్ కేంద్రం అభివృద్ధి చేసిందని గురూజీ గుర్తుచేశారు. హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ సెంటర్లు, సబ్ సెంటర్లలో గ్రూప్ మెడిటేషన్‌ల ద్వారా మధ్యప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో వేలాది మంది మానసిక ప్రశాంతత పొందుతున్నారని తెలిపారు. అనంతరం సీఎం దంపతులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో అభ్యాసీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment