MS Dhoni birthday special: యుగానికి ఒక్క‌డు.. మ‌హీ.. ది వారియ‌ర్‌ | MS Dhoni Birthday Special story | Sakshi
Sakshi News home page

MS Dhoni birthday special: యుగానికి ఒక్క‌డు.. మ‌హీ.. ది వారియ‌ర్‌

Published Sun, Jul 7 2024 1:23 PM | Last Updated on Sun, Jul 7 2024 7:23 PM

MS Dhoni Birthday Special story

2004 డిసెంబర్‌ 23.. ఈ తేదికి భార‌త క్రికెట్‌లో ఓ ప్ర‌త్యేక‌త ఉంది. ఆ రోజున  జులపాల జట్టుతో ఓ య‌వ ఆట‌గాడు టీమిండియా త‌ర‌పున అంత‌ర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ రోజు ఎవరూ అనుకోలేదు.. ఆ యువకుడు ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తాడని. 

ఆ రోజు ఎవరూ ఊహించలేదు.. ఆ జులుపాల ఆటగాడే భారత క్రికెట్ చరిత్రను మలుపు తిప్పుతాడని. తన తొలి మ్యాచ్‌లోనే గోల్డెన్ డకౌటై విమ‌ర్శ‌లు అందుకున్న ఆ యువ ఆట‌గాడే.. ఇప్పుడు కోట్లాదిమంది అభిమానుల ఆరాధ్య దైవమ‌య్యాడు.

ఆ యువ సంచ‌ల‌న‌మే మూడు దశాబ్దాలుగా ఎంతోమంది కెప్టెన్ల‌కు సాధ్యం కానీ వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను భార‌త్‌కు అందించాడు. అత‌డే భార‌త మాజీ కెప్టెన్‌, లెజెండ‌రీ క్రికెట‌ర్ ఎంఎస్ ధోని.   టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ సారధిగా నిలిచిన ధోని ఆదివారం(జూలై 7)  తన 43వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ నేప‌థ్యంలో ఎంఎస్ ధోనిపై ఈ  ప్ర‌త్యేక క‌థ‌నం.

ఎంఎస్ ధోని.. భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో త‌న పేరును సువ‌ర్ణ అక్ష‌రాల‌తో లిఖించుకున్నాడు. ఆట‌గాడిగా, కెప్టెన్‌గా భార‌త క్రికెట్ రూప‌రేఖ‌ల‌ను మార్చేశాడు. అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలోనే కెప్టెన్‌గా మారిన మిస్ట‌ర్‌కూల్‌.. టీమిండియాకు ఎన్నో చిరస్మ‌ర‌ణీయ విజ‌యాలు అందించాడు.

అత‌డి సార‌థ్యంలో ఇండియన్ క్రికెట్ టీమ్ తిరిగిలేని శ‌క్తిగా అవ‌త‌రించింది. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌ద‌డ‌ప విజ‌యాల‌ను చూసిన భార‌త్.. అత‌డి నాయ‌క‌త్వంలో వ‌రుస విజ‌యాలు సాధించింది.  2007లో జ‌రిగిన తొట్ట తొలి టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ధోని సార‌థ్యంలో అండ‌ర్ డాగ్స్‌గా బ‌రిలోకి దిగిన భార‌త జ‌ట్టు అద్భుతాలు సృష్టించింది. ఫైనల్ పోరులో చిర‌కాల ప్ర‌త్య‌ర్ధి పాకిస్తాన్ చిత్తు చేసిన భార‌త్‌.. విశ్వవిజేత‌గా నిలిచింది.

ఆ త‌ర్వాత కెప్టెన్‌గా ధోని వెనక్కి తిరిగిచూడ‌లేదు. 2011 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను అందించి 30 ఏళ్ల భార‌త నిరీక్ష‌ణ‌కు తెరిదించాడు. మహ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గ‌జాల‌కు సాధ్యం కానిది మిస్ట‌ర్ కూల్ చేసి చూపించాడు. 

ఆ త‌ర్వాత 2013లో ఐసీసీ ఛాంఫియ‌న్స్ ట్రోఫిని కూడా భార‌త్‌కు అందించాడు. అత‌డి సార‌థ్యంలో భార‌త జ‌ట్టు కొన్నాళ్ల‌పాటు వ‌ర‌ల్డ్ నెం1గా కొన‌సాగింది. ఝార్ఖండ్ డైన‌మెట్‌గా పేరుగాంచిన ఎంస్ ధోని.. ఆగస్టు 15, 2020న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌కు ప్ర‌క‌టించాడు. ఇక త‌న 16 ఏళ్ల కెరీర్‌లో ధోని ఒక ఆట‌గాడిగా, ఒక కెప్టెన్‌గా ఎన్నో అరుదైన ఘ‌న‌త‌ల‌ను ధోని అందుకున్నాడు.

ధోని సాధించిన ఘ‌న‌త‌లు ఇవే..

ధోని 2004లో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌తో అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి అడుపెట్టాడు. కానీ ఆ సిరీస్ మొత్తం విఫ‌ల‌మై కేవ‌లం 13 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. కానీ ఆ త‌ర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్ ధోని కెరీర్‌ను మార్చేసింది. 

 ఆ సిరీస్‌లో విశాఖపట్నం వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో ధోని విధ్వంస‌క‌ర శ‌త‌కంతో చెల‌రేగాడు. 123 బంతుల్లో 148 పరుగులు చేసి విమ‌ర్శ‌కుల నోళ్ల‌ను మూయించాడు. ధోనికి త‌న కెరీర్‌లో ఇదే తొలి అంత‌ర్జాతీయ సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం.

ఇక అదే ఏడాది శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 145 బంతుల్లో 183 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు.  వన్డేల్లో భారత తరుపన అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన వికెట్‌ కీపర్‌గా ధోని నిలిచాడు. ఇప్పటికి ఈ రికార్డు ధోనీ పేరిటే ఉంది.

అత్యధిక స్టంపౌట్స్ చేసిన రికార్డు కూడా ధోని పేరిటనే ఉంది. ధోని మూడు ఫార్మాట్లలో కలిపి ఏకంగా 538 మ్యాచ్‌ల్లో 195 స్టంపౌట్స్ చేశాడు.

భారత్‌కు ఐసీసీ మూడు మేజర్‌ ట్రోపీలు అందించిన ఏకైక భారత కెప్టెన్‌ కూడా ధోనినే. అతడి సారథ్యంలోనే 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే వరల్డ్‌కప్‌, 2013 ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని భారత్‌ కైవసం చేసుకుంది.

మూడు ఫార్మాట్లలో 332 మ్యాచులలో కెప్టెన్ గా సేవలందించిన ధోని.. 178 మ్యాచ్‌ల్లో భారత్‌కు విజయాలను అందించాడు. ఇక భారత క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వన్డేలకు సారధ్యం వహించిన కెప్టెన్‌ కూడా ధోనినే.

అదే విధంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆటగాడు కూడా ధోనినే.

వరల్డ్‌క్రికెట్‌లో అత్యుత్తమ ఫినిషర్‌గా నిలిచిన మహేంద్ర సింగ్ ధోని వన్డేల్లో 84 సార్లు అజేయంగా నిలిచాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్‌ ధోనినే కావడం గమనార్హం.

ధోని ఐపీఎల్‌లో కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ధోని సారథిగా ఐదు సార్లు ఛాంపియన్స్‌గా నిలిపాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ధోని ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

ఇక చివరిగా.. "భార‌త క్రికెట్ జ‌ట్టుకు ఎంతో మంది కెప్టెన్లు వస్తుంటారు పోతుంటారు.. కానీ కొందరు మాత్రమే చ‌రిత్ర‌లో నిలిచిపోతారు. అందులో కచ్చితంగా మిస్టర్ కూల్ మాత్రం ఉంటాడు. హ్యాపీ బర్త్‌డే మహీ.


 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement