
తన ఆరాధ్య క్రికెటర్‌ను కలుసుకోవడం.. కాసేపు సరదాగా ముచ్చటించడం, ఫొటోలు దిగడం... సగటు అభిమానికి ఉండే సాధారణ కోరికలు. కానీ.. భద్రత గోడలు దాటుకుని వారిని చేరుకోవడం అంత తేలికైన విషయమేమీ కాదు. ఒక్కోసారి ఆటోగ్రాఫ్ కోసమే ఏళ్ల తరబడి వేచి చూడాల్సి ఉంటుంది. దేవ్ అనే ఓ వ్యక్తికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని వీరాభిమాని అతడు. ఒక్కసారైనా ధోనిని నేరుగా కలవాలన్నది అతడి చిరకాల కోరిక. ఇందుకోసం ఏకంగా తను పనిచేసే ఊరి నుంచి మరో చోటుకు బదిలీ చేయించుకున్నాడు దేవ్.
పదహారేళ్ల తర్వాత ఎట్టకేలకు తన అభిమాన ఆటగాడిని కలుసుకున్నాడు. కరోనా కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ అర్ధంతరంగా ఆగిపోయిన నేపథ్యంలో ఇంటికి చేరుకున్న ధోని, కుటుంబంతో ఎక్కువగా సమయాన్ని గడుపుతున్న సంగతి తెలిసిందే. భార్య సాక్షి, కూతురు జీవాతో కలిసి అతడు ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలో రత్నారీలోని మీనాభాగ్ హోటల్‌లో ధోని కుటుంబం బస చేసింది.
అదే హోటల్ మరో బ్రాంచీలో పనిచేస్తున్న దేవ్... ఈ విషయం తెలుసుకుని.. తనను షిమ్లా నుంచి రత్నారీ బదిలీ చేయాల్సిందిగా పై అధికారులను కోరాడు. దేవ్ అభ్యర్థనను వారు మన్నించడంతో రత్నారీ వచ్చి ధోని కలుసుకున్నాడు. ధోనితో ఫొటో దిగడంతో పాటుగా, తన ఫోన్ కవర్‌పై అతడి ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మీనాభాగ్ యాజమాన్యం తమ ఇన్‌స్టా పేజీలో పంచుకుంది. 2005లో రోహ్రు(హిమాచల్ ప్రదేశ్)లో క్రికెట్ టోర్నీ జరుగుతున్న సమయంలో దేవ్.. ధోనిని కలిసేందుకు వెళ్తే.. పోలీసులు దెబ్బలు తినాల్సి వచ్చిందని, ఇప్పుడు ఇదిగో ఇలా అతడిని కలిసే అవకాశం దక్కిందని హర్షం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment