రిషబ్‌ పంత్‌ సోదరి వివాహ వేడుక.. డ్యాన్స్‌లతో పిచ్చెక్కించిన ధోని, రైనా | MS Dhoni, Suresh Raina And Rishabh Pant Dancing Together At Pant Sister Wedding | Sakshi
Sakshi News home page

రిషబ్‌ పంత్‌ సోదరి వివాహ వేడుక.. డ్యాన్స్‌లతో పిచ్చెక్కించిన ధోని, రైనా

Published Wed, Mar 12 2025 12:01 PM | Last Updated on Wed, Mar 12 2025 12:07 PM

MS Dhoni, Suresh Raina And Rishabh Pant Dancing Together At Pant Sister Wedding

టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ సోదరి సాక్షి పంత్‌ వివాహ వేడుకలో భారత మాజీ క్రికెటర్లు ఎంఎస్‌ ధోని, సురేశ్‌ రైనా సందడి చేశారు. నిన్న రాత్రి జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వీరిద్దరు  డ్యాన్స్‌లతో పిచ్చెక్కించారు. ఈ వేడకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ముఖ్యంగా ధోని, పంత్‌, రైనా కలిసి గ్రూప్‌గా డ్యాన్స్‌ చేసిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. 

నెటిజన్ల నుంచి ఈ వీడియోకు విపరీతమైన స్పందన వస్తుంది. ఈ వీడియోలో ధోని, రైనా చాలా హుషారుగా కనిపించారు. ఇంట్లో పెళ్లిలా అందరితో కలియతిరిగారు. ధోని, రైనాను ఇలా చూసి చాలా కాలమైందని వారి అభిమానులు అనుకుంటున్నారు. ధోని ఐపీఎల్‌ 2025 సన్నాహకాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఈ వేడకకు హాజరయ్యాడు. ఐపీఎల్‌ సహా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన రైనా ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. 

పంత్‌ ఇటీవలే ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచి హుషారుగా ఉన్నాడు. పంత్‌ త్వరలో ప్రారంభంకాబోయే ఐపీఎల్‌  సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. పంత్‌ను ఎల్‌ఎస్‌జీ కెప్టెన్‌గా కూడా ఎంపిక చేసింది. ఐపీఎల్‌ 2025 సీజన్‌ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.

కాగా, పంత్‌ సోదరి సాక్షి పంత్‌ తన చిరకాల ప్రియుడు అంకిత్‌ చౌదరీని ఇవాళ (మార్చి 12) ఉదయం మనువాడింది. వీరి వివాహం ముస్సోరిలోని ఐటీసీ హోటల్‌లో జరిగింది. వీరి వివాహాని ధోని, రైనా సతీసమేతంగా రెండు రోజుల ముందే హాజరయ్యారు. మెహంది, సంగీత్‌, హల్దీ ఫంక్షన్లలో సందడి చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సాక్షి పంత్‌ స్వయంగా సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది.

సాక్షి-అంకిత్‌ పదేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. గతేడాది జనవరి 6న వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. సాక్షి ఎంబీఏ పూర్తి చేసి నేషనల్‌ ఫార్మసీ అసోసియేషన్‌లో పని చేస్తుంది. ఆమె భర్త అం​కిత్‌ లండన్‌లో వ్యాపారం​ చేస్తున్నాడు. సాక్షికి సోదరుడు రిషబ్‌తో చాలా బాండింగ్‌ ఉంది. పంత్‌కు కారు ప్రమాదం జరిగినప్పుడు సాక్షి అన్నీ తానై చూసుకుంది. పంత్‌ కోలుకుని తిరిగి క్రికెట్‌ బరిలోకి దిగేందుకు సాక్షి ఎంతో తోడ్పడింది.

రిషబ్‌ పంత్‌కు ఇటీవల జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడే అవకాశం రాలేదు. మేనేజ్‌మెంట్‌ కేఎల్‌ రాహుల్‌ను ఫస్ట్‌ ఛాయిస్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా ఎంపిక చేయడంతో పంత్‌ బెంచ్‌కు పరిమితం కాక తప్పలేదు. కారు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత పంత్‌ గతేడాది ఐపీఎల్‌ ఆడాడు. ఆ సీజన్‌లో పంత్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతూ మంచి ప్రదర్శనలు చేశాడు. 

ఆతర్వాత పంత్‌ టీ20 వరల్డ్‌కప్‌ కోసం​ ఎంపిక చేసిన భారత జట్టులోనూ చోటు సంపాదించాడు. ఆ టోర్నీలోనూ పంత్‌ చక్కగా రాణించాడు. తద్వారా భారత్‌ రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం పంత్‌ ముందు ఐపీఎల్‌ టాస్క్‌ ఉంది. ఈ లీగ్‌లో పంత్‌ లక్నోను ఎలా నడిపిస్తాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement