శుభాకాంక్షలు షమీ అన్నా: విరాట్‌ కోహ్లి కామెంట్‌ వైరల్‌ | 'Mubarak Ho Lala': Virat Kohli Viral Comment On Shami Winning Arjuna Award - Sakshi
Sakshi News home page

శుభాకాంక్షలు షమీ అన్నా: విరాట్‌ కోహ్లి కామెంట్‌ వైరల్‌

Published Wed, Jan 10 2024 4:30 PM | Last Updated on Wed, Jan 10 2024 4:49 PM

Mubarak Ho Lala: Virat Kohli Viral Comment On Shami Winning Arjuna Award - Sakshi

Mubarak Ho Lala: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత పేసర్‌ మహ్మద్‌ షమీ పట్ల ఆప్యాయత ప్రదర్శించిన తీరుకు ఫిదా అవుతున్నారు. కాగా షమీకి ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం అర్జున అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం తనకు దక్కిన అత్యుత్తమ గౌరవమని మురిసిపోయాడు.

జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లు చవిచూశానన్న షమీ.. కష్టకాలంలో తనకు అండగా నిలిచి సహాయం చేసిన వారందరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశాడు. తనకు బౌలింగ్‌లో మెళకువలు నేర్పిన కోచ్‌లు, ఎల్లవేళలా తనకు మద్దతుగా నిలిచిన బీసీసీఐ.. సహచర ఆటగాళ్లు, అభిమానుల పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు.

తన ప్రతిభ, కఠిన శ్రమను గుర్తించి ఈ అవార్డు అందజేసినందుకు దేశం గర్వపడేలా అత్యుత్తమంగా ఆడి రుణం తీర్చుకుంటానని షమీ పేర్కొన్నాడు. తనతో పాటు ఈ అవార్డు అందుకున్న భారత క్రీడాకారులందరికీ అభినందనలు తెలిపాడు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఉద్వేగపూరిత నోట్‌ షేర్‌ చేసిన షమీ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న వీడియోను షేర్‌ చేశాడు.

ఇందుకు స్పందించిన విరాట్‌ కోహ్లి.. ‘‘శుభాకాంక్షలు అన్నా(ముబారక్‌ హో లాలా)’’ అంటూ షమీని ప్రేమగా విష్‌ చేశాడు. హార్ట్‌ ఎమోజీ జతచేసి సహచర ఆటగాడి పట్ల ఆత్మీయతను ప్రదర్శించాడు. ఈ నేపథ్యంలో షమీ పట్ల కోహ్లి వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ.. ‘‘హుందాతనం ప్రదర్శించడంలో కింగ్‌ తనకు తానే సాటి’’ అంటూ ఫ్యాన్స్‌ ఈ పోస్ట్‌ను వైరల్‌ చేస్తున్నారు. కాగా పంజాబీలో లాలా అంటే అన్నయ్య అనే అర్థం ఉంది.

కాగా తాను కెప్టెన్‌గా ఉన్న సమయంలో విరాట్‌ కోహ్లి షమీకి దన్నుగా నిలిచిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్‌-2021 పాకిస్తాన్‌తో మ్యాచ్‌ సమయంలో షమీపై విమర్శలు రాగా.. కోహ్లి ఖండించాడు. దీంతో కొంతమంది ఆకతాయిలు కోహ్లి చిన్నారి కుమార్తె వామికాను ఉద్దేశించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే.. దాదాపు 14 నెలల తర్వాత అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌ ద్వారా విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ టీ20లలో రీఎంట్రీ ఇస్తుండగా.. వరల్డ్‌కప్‌-2023 టాప్‌ వికెట్‌ టేకర్‌ షమీ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. చీలమండ నొప్పితో బాధపడుతున్న ఈ స్టార్‌ పేసర్‌ ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ చివరి మ్యాచ్‌లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

చదవండి: Ind Vs Afg: అఫ్గన్‌తో టీమిండియా సిరీస్‌: షెడ్యూల్‌, జట్లు, లైవ్‌ స్ట్రీమింగ్‌.. పూర్తి వివరాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement