WTC Final 2021: New Zealand Website Insults Virat Kohli, Meme Pic Goes Viral - Sakshi
Sakshi News home page

కెప్టెన్‌ కోహ్లీని ఘోరంగా అవమానించిన కివీస్‌ వెబ్‌సైట్‌

Published Fri, Jun 25 2021 8:53 PM | Last Updated on Sat, Jun 26 2021 9:46 AM

New Zealand Website Insults Indian Skipper Virat Kohli - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో ఎదురైన పరాభవానికి తల్లడిల్లిపోతున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి మరో ఘోర అవమానం జరిగింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో 8 వికెట్ల తేడాతో పరాజయం పాలయ్యాక, అతనిపై ముప్పేట దాడి మొదలైంది. ఇంటా బయటా అన్న తేడా లేకుండా మాజీ క్రికెటర్లు, అభిమానులు అతని కెప్టెన్సీతో పాటు వ్యక్తిగత అటతీరుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే ఇలా విమర్శిస్తున్న వారు టీమిండియా అభిమానులో లేక మాజీ క్రికెటర్లో అయితే అది వేరే విషయం. వారి విమర్శలకు, ఆరోపణలకు ఓ అర్ధం ఉంది.

కానీ, న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ వెబ్‌సైట్ TheAccNZ ఓ పోస్టులో టీమిండియా సారధిని ఘోరంగా అవమానించడం ప్రస్తుతం టీమిండియా అభిమానులను కలచి వేస్తుంది. ముఖ్యంగా కోహ్లీ అభిమానులకు ఈ విషయం అస్సలు మింగుడుపడడం లేదు. కోహ్లీని అవమానకర రీతిలో చూపించిన ఆ వెబ్‌సైట్‌పై నిప్పులు చెరుగుతున్నారు. వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్‌కు చెందిన సదరు వెబ్‌సైట్, డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమిపాలయ్యాక ఓ ఫోటోను తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఆ ఫోటోలో ఒక మహిళ.. బెల్ట్ తో ఓ మనిషిని పట్టుకుని ఉంటుంది. ఆ మహిళను కైల్ జేమీసన్‌తో పోలస్తూ.. ఆ మనిషిని కోహ్లీతో పోల్చింది. ఇది చూసిన టీమిండియా అభిమానులు ముఖ్యంగా కోహ్లీ అభిమానులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఆ వెబ్‌సైట్‌ను టార్గెట్‌ చేశారు.

డబ్ల్యూటీసీ ఫైనల్లో కోహ్లీ రెండుసార్లూ జేమీసన్ బౌలింగ్‌లోనే ఔటవడంతో ఆ వెబ్‌సైట్ ఈ నీచానికి ఒడిగట్టి ఉంటుందని భావిస్తున్నారు. కోహ్లీని అవమానించినందుకు గాను ఆ వెబ్‌సైట్‌తో పాటు న్యూజిలాండ్‌ మొత్తాన్ని చీల్చిచెండాతున్నారు. కోహ్లీ లాంటి వరల్డ్‌ క్లాస్‌ ప్లేయర్‌ని అవమానించడం తగదని కొందరు హెచ్చరిస్తుంటే, కొందరేమో వ్యక్తిగత దూషణలకు దిగారు. టీమిండియా అభిమానులు తలచుకుంటే ఆ వెబ్‌సైట్‌కు నామారూపాలు లేకుండా చేస్తారని వార్నింగ్ ఇస్తున్నారు. మరికొందరైతే ఇలాంటి చర్యల వల్ల న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టుకు ఉన్న మంచి ఇమేజ్‌ మసకబారుతుందని కామెంట్‌ చేస్తున్నారు. ఇంకొంత మంది ఫ్యాన్స్.. జేమీసన్‌ను మహిళతో పోల్చుకుని తమను తామే దిగజార్చుకున్నారని కౌంటర్ వేస్తున్నారు.
చదవండి: ‘పంత్‌ ఆ గీతను ఉల్లంఘించాడు. ఎన్నిసార్లు చెప్పినా అంతే’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement