టీమిండియా స్టార్లంతా రెండు వారాలు ఆటకు దూరం | Team India Seniors Get 2 Weeks of Break Before IND vs NZ Tests | Sakshi
Sakshi News home page

ముంబైలో రోహిత్‌ శర్మ.. లండన్‌కు వెళ్లిపోయిన కోహ్లి

Published Wed, Oct 2 2024 3:41 PM | Last Updated on Wed, Oct 2 2024 4:46 PM

Team India Seniors Get 2 Weeks of Break Before IND vs NZ Tests

టీమిండియా స్టార్‌ క్రికెటర్లు రెండు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నారు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ ఆడిన జట్టు మొత్తానికి దాదాపు పదిహేను రోజుల విరామం లభించనుంది. బంగ్లాపై కాన్పూర్‌ విజయం తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, యువ తరంగాలు శుబ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, సీనియర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌ తదితరులు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు.

ముంబైలో రోహిత్‌ శర్మ.. లండన్‌కు వెళ్లిపోయిన కోహ్లి
రోహిత్‌ ఇప్పటికే ముంబైకి చేరుకోగా.. కోహ్లి లండన్‌కు పయనమయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా టీ20 ప్రపంచకప్‌-2024 తర్వాత టీమిండియా సీనియర్లకు కావాల్సినంత విశ్రాంతి దొరుకుతోంది. ఈ మెగా టోర్నీలో భారత్‌ విజేతగా నిలిచిన తర్వాత రోహిత్‌, కోహ్లి, జడేజా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలో జింబాబ్వేతో టీ20 సిరీస్‌ ఆడేందుకు వెళ్లిన జట్టులో దాదాపు అంతా కొత్త వాళ్లకే చోటు దక్కింది.

 

టెస్టుల్లో బంగ్లాదేశ్‌ వైట్‌వాష్‌ 
అనంతరం శ్రీలంక పర్యటనకు టీ20 జట్టుకూ జస్‌ప్రీత్‌ బుమ్రా, సిరాజ్‌ తదితరులు దూరం కాగా.. వన్డే సిరీస్‌తో రోహిత్‌, కోహ్లి పునరాగమనం చేశారు. ఈ క్రమంలో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ నేపథ్యంలో బుమ్రా కూడా తిరిగి వచ్చేశాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్‌ చేరే క్రమంలో సొంతగడ్డపై జరిగిన ఈ సిరీస్‌లో టీమిండియా 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. 

టీ20 సిరీస్‌ మొదలయ్యేది అప్పుడే
ఈ క్రమంలో అక్టోబరు 6, 9, 12వ తేదీల్లో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు షెడ్యూల్‌ ఖరారు కాగా.. టెస్టు సిరీస్‌ ఆడిన సీనియర్లకే కాకుండా జట్టు మొత్తానికి బీసీసీఐ రెస్ట్‌ ఇచ్చింది. అక్టోబరు 16 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో భారత్‌ టెస్టు సిరీస్ ఆడనుండటమే ఇందుకు కారణం. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో గనుక గెలిస్తే రోహిత్‌ సేన నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. 

అందుకే ఈ కీలకమైన సిరీస్‌కు ముందు బోర్డు ఈ మేర నిర్ణయం తీసుకుంది. ఇక కివీస్‌తో మూడు టెస్టులు ఆడిన తర్వాత టీమిండియా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ(బీజీటీ) కోసం ఆస్ట్రేలియాకు పయనం కానుంది. డబ్ల్యూటీసీ తాజా సీజన్‌లో ఆఖరుగా కంగారూ జట్టుతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడనుంది. నవంబరు 22 నుంచి ఇరు జట్ల మధ్య బీజీటీ మొదలుకానుంది.

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రిం​కూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్‌ శర్మ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్‌ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్.

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ ఆడిన జట్టు
ప్లేయింగ్‌ ఎలెవన్‌
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్‌ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
బెంచ్‌: కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ దయాళ్, ధృవ్ జురెల్.

చదవండి: రిస్క్‌ అని తెలిసినా తప్పలేదు.. అతడొక అద్భుతం: రోహిత్‌ శర్మ
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement